యాభై ఏడేళ్ళ బాలాభాయ్ చావ్డాకు గుజరాత్‌లోని సురేంద్రనగర్ జిల్లాలో ఐదెకరాల వ్యవసాయ భూమి ఉంది. అది సారవంతమైనది. దానికి నీటి సదుపాయం కూడా ఉంది. దానికి పాతిక సంవత్సరాలుగా అతనే యజమాని. కానీ ఇక్కడే ఒక సమస్య ఉంది.అతన్ని తన సొంత వ్యవసాయ భూమి దగ్గరకు ఎవరూ రానివ్వరు.
“నేనే యజమానినన్న ఋజువు నా దగ్గరుంది,” పెళుసుగా, పసుపు రంగులోకి మారిన భూమి దస్తావేజులను చూపిస్తూ అతనన్నారు. “కానీ (భూమి) ఆధిపత్య కులానికి చెందిన వ్యక్తుల ఆధీనంలో ఉంది.”
గుజరాత్‌లో, షెడ్యూల్డ్ కులమైన చమర్ సముదాయానికి చెందిన బాలాభాయ్ ఒక కార్మికుడు. భూమి విషయంలో ప్రతి ఒక్కరినీ సహాయం చేయమని అడిగారు – ఆ ఊరిలో అతను తట్టని తలుపు లేదు. “నేను ప్రతిరోజూ భూమి దగ్గరికి వెళ్తాను. దాన్ని దూరం నుండే చూస్తూ, అదే నా అధీనంలో ఉండివుంటే నా జీవితం ఎలా ఉండేదోనని ఊహించుకుంటుంటాను..."
1997లో, గుజరాత్ భూపంపిణీ విధానం కింద, ధ్రాంగధరా తాలూకా భరడ్ గ్రామంలోని వ్యవసాయ భూమిని బాలాభాయ్‌కి కేటాయించారు. 1960 నాటి గుజరాత్ వ్యవసాయ భూముల సీలింగ్ చట్టం సాగు భూములపై పరిమితులు విధించింది. దాని కింద సేకరించిన 'మిగులు భూమి'ని ‘సమూహ ప్రయోజనాల' కోసం కేటాయించడం జరిగింది..
సంథాని జమీన్ అని పిలిచే ఈ సేకరించిన స్థలాలతో పాటు ప్రభుత్వ ఆధీనంలో ఉండే బంజరు భూమిని 'వ్యవసాయం చేయడానికి భూమి అవసరం ఉన్న ' వ్యక్తులకు కేటాయిస్తారు. వీరిలో రైతు సహకార సంఘాలు, భూమిలేని వ్యక్తులు, వ్యవసాయ కూలీలు కూడా ఉంటారు. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందిన సంఘాల సభ్యులకు ఈ భూపంపిణీలో ప్రాధాన్యం ఇస్తారు.
కానీ ఈ పథకం కాగితాలపైనే బాగా పనిచేస్తుంది, ఆచరణలోకి అంతగా రాదు.
భూమి పట్టా చేతికి వచ్చాక, అందులో పత్తి, జొన్నలు, సజ్జలు సాగు చేయడానికి ప్రణాళికలు రూపొందించుకున్నారు బాలాభాయ్. ఆ వ్యవసాయ భూమిలో ఒక చిన్న ఇల్లు కూడా కట్టుకోవాలనుకున్నారు. ఆ విధంగా తాను పనిచేసే చోటనే నివసించవచ్చునని అతని ఆలోచన. అప్పుడతనికి 32 ఏళ్ళు. తన కుటుంబంతో కలిసి మంచిగా బతకొచ్చని భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్నారు. “నాకు ముగ్గురు చిన్న పిల్లలు ఉన్నారు. నేను కూలీగా పని చేస్తున్నాను. వేరొకరి కోసం శ్రమించే రోజులు ఇక పోయాయనుకున్నాను. నా సొంత భూమితో, నా కుటుంబానికి మంచి జీవితాన్ని ఇవ్వగలనని అనుకున్నాను,” అన్నారాయన.








