ఐదు నెలల గర్భిణి అయిన పల్లవి గావిట్ మూడు గంటలకు పైగా ఖాట్ (చార్‌పాయ్) మీద నొప్పితో మెలికలు తిరుగుతోంది. పల్లవి గర్భాశయం ఆమె యోని నుండి జారిపోయినప్పుడు ఆమె వదిన, 45 ఏళ్ళ సప్నా గారెల్, ఆమెతో ఉంది. ఐదు నెలల మగ పిండం పల్లవి గర్భాశయం లోపల నిర్జీవంగా ఉంది. రక్తంతో పాటు, శరీరం నుండి స్రావాలు నేలపై కారుతుండగా, భరించలేని నొప్పితో, పల్లవి స్పృహతప్పి పడిపోయింది.
అది జూలై 25, 2019 తెల్లవారుజామున 3 గంటలు. సత్పుడా కొండల్లోని 55 భిల్ కుటుంబాల కుగ్రామమైన హెంగ్లపానిలో పల్లవి పూరిగుడిసె పై వర్షం కురుస్తోంది. వాయువ్య మహారాష్ట్రలోని నందుర్బార్ జిల్లాలోని ఈ దుర్గమ ప్రాంతంలో, పక్కా రోడ్లు లేవు, మొబైల్ నెట్‌వర్క్‌లు లేవు. “అత్యవసర పరిస్థితులు మనకు చెప్పి రావు. అవి ఎప్పుడైనా సంభవించవచ్చు," అని పల్లవి భర్త గిరీష్ (ఈ కథనంలో అన్ని పేర్లు మార్చబడ్డాయి) అన్నాడు. "నెట్‌వర్క్ కవరేజీ లేకుండా అంబులెన్స్ లేదా డాక్టర్‌ని ఎలా పిలవగలము?"
"నేను భయపడ్డాను," 30 ఏళ్ల గిరీష్ చెబుతున్నాడు. "ఆమె చనిపోకూడదనుకున్నాను." తెల్లవారుజామున 4 గంటలకు, చీకటిలో, వర్షం కురుస్తుండగా, గిరీష్, అతని పొరుగింటి మనిషి, ఇద్దరూ పల్లవిని వెదురు, దుప్పటి కలిపి చేసిన తాత్కాలిక స్ట్రెచర్‌పై 105 కిలోమీటర్ల దూరంలోని ఉన్న ధడ్‌గావ్ వైపు వెళ్ళడానికి, బురదగా ఉన్న దారిలో సత్పుడా కొండలపైకి తీసుకెళ్లారు.
హెంగ్లపాని కుగ్రామం అక్రాని తాలూకాలోని తోరన్మల్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉంది. తోరన్మల్ గ్రామీణ ఆసుపత్రి దగ్గరగానే ఉంది కానీ ఆ రాత్రి అక్కడికి వెళ్లే రహదారి సురక్షితంగా లేదు. చెప్పులు లేకుండా (బురదలో చెప్పులు వేసుకుని వేగంగా నడవడం కష్టం), గిరీష్, అతని పొరుగింటి మనిషి ఆ బురద మార్గాలలో జారకుండా నడవడానికి చాలా కష్టపడ్డారు. ప్లాస్టిక్ షీట్ కప్పుకున్న పల్లవి నొప్పితో మూలుగుతూ ఉంది.
తోరన్మల్ ఘాట్ రోడ్డుకు చేరుకునే వరకు, అంటే దాదాపు మూడు గంటలపాటు వారు పైకి ఎక్కారు. "ఇది దాదాపు 30 కిలోమీటర్ల ఎత్తులో ఉంది" అని గిరీష్ చెప్పాడు. అక్కడి నుంచి రూ. 1,000 కు జీప్‌ని అద్దెకు తీసుకుని ధడ్‌గావ్ గ్రామం వైపు వెళ్లారు. రోడ్డు మీద ఐదు గంటలు ప్రయాణించాక తర్వాత, పల్లవిని ధడ్‌గావ్‌లోని ఒక ప్రైవేట్ నర్సింగ్‌హోమ్‌లో చేర్చారు - అక్కడికి గ్రామీణ ఆసుపత్రి మరో 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. “నేను చూసిన మొట్టమొదటి దవాఖానా [ఆరోగ్య కేంద్రం]కి ఆమెను తీసుకెళ్లాను. ఇది చాలా ఖరీదైనది, కానీ కనీసం వారు నా పల్లవిని కాపాడారు, ” అని అతను చెప్పాడు. డాక్టరు రూ. 3,000 ఫీజు వేసి, మరుసటి రోజు ఆమెను డిశ్చార్జ్ చేశారు. "భారీ రక్తస్రావం కారణంగా ఆమె చనిపోయి ఉండేదని ఆయన చెప్పారు," అని గిరీష్ గుర్తుచేసుకున్నాడు.













