రాణి మహ్తో తన రెండు రోజుల పాపను సురక్షితంగా ప్రసవించినందుకు ఆనందంగా ఉన్నా, ఇంటికి వెళ్లి తన భర్తకు మళ్ళీ.ఆడపిల్ల పుట్టింది అని చెప్పాలంటే భయపడుతుంది.
"అతను ఈసారి కొడుకు కావాలనుకున్నాడు," అని ఆమె భయంగా చెప్పింది. బీహార్లోని పాట్నా జిల్లాలోని దానాపూర్ సబ్-డివిజనల్ హాస్పిటల్లో 20 ఏళ్ళ రాణి, తన మంచం పై ఉన్న పసిపాపకు పాలు ఇస్తోంది. "నేను ఇంటికి వెళ్ళాక రెండవసారి కూడా ఆడపిల్ల పుట్టింది అని చెబితే అతను ఏమంటాడో అని భయంగా ఉంది.”
2017లో 16 సంవత్సరాల వయస్సులో తన పెళ్లి అయిన వెంటనే రాణికి మొదటి కూతురు పుట్టింది. ఆ సమయంలో ఆమె భర్త ప్రకాష్ కుమార్ మహ్తో వయస్సు 20 ఏళ్ళు. ఆమె, ప్రకాష్ తో, అతని తల్లితో కలిసి, అదే జిల్లాలోని ఫుల్వారీ బ్లాక్లో ఒక గ్రామంలో(పేరు చెప్పడానికి ఇష్టపడలేదు) నివసిస్తుంది. మహ్తోలు సంప్రదాయవాద OBC వర్గానికి చెందినవారు.
“మా ఊరిలో చాలా మంది ఆడపిల్లలకు 16 ఏళ్లకే పెళ్లిళ్లు చేస్తారు” అని యుక్తవయసులో ఉన్నప్పుడే పెళ్లి వల్ల తలెత్తే సమస్యల గురించి తెలియని రాణి చెప్పింది. "నాకు ఒక చెల్లెలు కూడా ఉంది, కాబట్టి నా తల్లిదండ్రులు నాకు త్వరగా పెళ్లి చేయాలని అనుకున్నారు" అని ఆమె చెప్పింది, ఆమె అత్తగారు గంగా మహ్తో తనతో కలిసి మంచం మీద కూర్చొని చుట్టీ వాలే పేపర్(డిశ్చార్జ్ సర్టిఫికేట్) కోసం ఎదురు చూస్తోంది.
రాణి, ఆమె సోదరి మాత్రమే కాదు. దేశంలోని 55 శాతం బాల్య, కౌమార వివాహాలు బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, రాజస్థాన్లలో జరుగుతున్నాయని జనాభా లెక్కల విశ్లేషణ, జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలు, ఇంకా ఇతర అధికారిక డేటా ద్వారా బాలల హక్కుల స్వచ్ఛంద సంస్థ, NGO Child Rights & YOU(CRY), తెలిపింది.
"మాకు చుట్టీ వాలే పేపర్ వచ్చాక, మేము ఆటోరిక్షా మాట్లాడుకుని మా గ్రామానికి వెళ్ళిపోతాము" అని రాణి నాకు చెప్పింది. ఇప్పటికే ఆమె ఆసుపత్రిలో సాధారణంగా అవసరమైన దానికంటే రెండు రోజులు ఎక్కువ సమయం గడిపింది. ఎందుకంటే ఆమెకు వేరే వైద్యపరమైన సమస్యలు ఉన్నాయి. "నాకు ఖూన్ కి కమీ (రక్తహీనత) ఉంది" అని రాణి చెప్పింది.







