బమ్దాభైసా మొహల్లా మొత్తం నహకుల్ పాండో కోసం పెంకులను తయారు చేయడంలో నిమగ్నమై ఉన్నారు. ఇది సంఘీభావ ప్రదర్శన, వ్యక్తులు అందరూ ఈ పెంకుల తయారీలో ఒకరి తరవాత ఒకరు వంతులు వేసుకుని చేసే ఈ సమాజ ప్రయత్నానికి ఖరీదు ఉచితమనే అనుకోవాలి - నహాకుల్ అందరి మధ్య తిరుగుతూ ఇంటిలో చేసిన ద్రాక్ష సారాయిని, ఒక్కొక్కరికి అందించడాన్ని పట్టించుకోకపోతే.
కానీ వారందరు అతని పైకప్పుకు పెంకులను ఎందుకు తయారు చేస్తున్నారు? ముందే ఉన్న పైకప్పుల పెంకులను ఉన్నట్టుడి నహకుల్ ఎలా పోగొట్టుకున్నాడు? పెంకులు లేని ఆ ఇల్లు, బట్టతల ఉన్న మనిషిలా అలా బోడిగా నిలబడి ఉంది.
“అది ఒక ప్రభుత్వ ఋణం,” అన్నాడతను. “నేను 4800 రూపాయిలు ఋణం తీసుకుని రెండు ఆవులను కొనుక్కున్నాను.” వీటిని సాఫ్ట్ లోన్ లని పిలుస్తారు. ఇది ఒక అధికారిక స్కీమ్- ఆవు కొనుక్కుంటే, దీనికి సబ్సిడీ వస్తుంది, తక్కువ వడ్డీ ఉంటుంది. 1994లో, సుర్గుజాలో ఈ డబ్బుకు రెండు ఆవులను కొనుక్కోవచ్చు(ఈ జిల్లా అప్పట్లో మధ్యప్రదేశ్ లో ఉండేది. ఇప్పుడు ఛత్తీస్గఢ్ లోకి మారిపోయింది)
నహకుల్ కు అసలు ఋణం తీసుకునే ఉద్దేశం లేదు. చాలామంది అతని పాండో ఆదివాసీ బంధువులు ఇలానే అప్పులు తీసుకుని అనేకసార్లు వారిని భూమిని కూడా పోగొట్టుకున్నారు. కాని ఇది ప్రభుత్వ ఋణం, పైగా స్థానిక బ్యాంకు నుండి ఆదివాసీల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఇస్తున్నారు. ఇది తీసుకుంటే వచ్చే ఇబ్బంది ఏమి లేదు. ఏదో పాత ఉవాచ చెప్పినట్లు - ఆ సమయానికది మంచి పనిగానే తోచింది.
“కాని నేను ఆ ఋణాన్ని తీర్చలేకపోయాను,” అన్నాడు నహకుల్. పాండోలు కడు పేదవారు, వీరిని ‘ప్రత్యేక బలహీనపు గిరిజన సమూహం' గా వర్గీకరించారు. వీరి సాధారణ స్థితికి నహకుల్ మినహాయింపు కాదు.



