రాధ ధైర్యానికి ఆమె పెంచుకున్న కుక్కలు మూల్యం చెల్లించవలసి వచ్చింది. మొదటి కుక్క తలను నరికేశారు, రెండో కుక్కకు విషం ఇచ్చారు, మూడో కుక్క అసలు కనిపించడం లేదు, నాలుగోదాన్ని రాధ కళ్ళ ముందే చంపేశారు. “ఈ గ్రామంలోని నన్ను హింసించిన నలుగురు పెద్దమనుషులు జైలులో ఉన్నారు. అందుకని ఊరిలో కొందరు నేను ఆ రేప్ కేసులో రాజీపడలేదని మండిపడుతున్నారు.”
ఆరేళ్ళ క్రితం నలుగురు మగవాళ్లు రాధ(అసలు పేరు కాదు)ను లైంగికంగా హింసించారు. ఆమె తన గ్రామం నుండి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న బీడ్ జిల్లాలో ఉన్న బీడ్ నగరానికి వెళ్తుండగా ఒక ప్రైవేట్ వాహనంలోని డ్రైవర్ ఆమెకు లిఫ్ట్ ఇస్తానని ఎక్కించుకుని, అతని ఊరికి చెందిన మరో ముగ్గురు స్నేహితులతో కలిసి ఆమెను లైంగికంగా హింసించారు(రేప్ చేశారు).
“వారాల తరబడి నా మనసు చెదిరిపోయింది.” తను పడిన క్షోభని గురించి చెబూతూ అన్నది 40 ఏళ్ళ రాధ . “వారికి చట్టప్రకారం శిక్ష పడాలని చెప్పి నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను.”
ఆమె పై లైంగిక దాడి జరిగినప్పుడు, రాధ బీడ్ నగరంలో తన భర్త, పిల్లలతో కలిసి ఉండేది. “నా భర్త అక్కడ ఒక ఫైనాన్స్ ఏజెన్సీ లో పని చేసేవాడు. నేను మా ఊరికి అప్పుడప్పుడు వెళ్లి పొలాన్ని చూసుకుని వచ్చేసేదాన్ని.” అని చెప్పింది.
కంప్లైంట్ నమోదు చేసాక రాధ పై కేసు వెనక్కు తీసుకోమని చాలా ఒత్తిడి వచ్చింది . నేరం చేసినవారికి, వారి బంధువులు అందరికీ గ్రామ పంచాయత్ సభ్యులు, గ్రామంలోని పెద్దమనుషులు బాగా తెలుసు. “నా పై ఒత్తిడి పెరిగింది. కానీ నేను గ్రామంలో లేను, నగరంలో నాకు చాలామంది మద్దతునిచ్చారు. ఇక్కడ భద్రంగా, ధైర్యంగా అనిపించింది.” అన్నది రాధ.
కాని ఆమె కప్పుకున్న ధైర్యం మార్చ్ 2020లో అకస్మాత్తుగా కోవిడ్-19 వ్యాపించడంతో జారిపోయింది. ఆమె భర్త మనోజ్(నిజం పేరు కాదు) దేశవ్యాప్తంగా ప్రకటించిన లాక్ డౌన్ వలన ఉద్యోగం కోల్పోయాడు. “అతనికి నెలకు 10,000 రూపాయిలు వచ్చేవి. మేము ఒక అద్దె ఇంట్లో ఉండేవాళ్లం. మా జరుగుబాటుకి చాలా ఇబ్బంది అయింది.”
మరే మార్గం దొరకక, రాధా, మనోజ్, వారి పిల్లలు అయిష్టంగా వారి గ్రామానికి వెళ్లారు. ఇక్కడే అంతకు ముందు రాధ పై లైంగిక దాడి జరిగింది. “మాకు ఇక్కడ మూడు ఎకరాల భూమి ఉంది, అందుకనే మేము ఇక్కడికి వచ్చి బతుకుతున్నాం. మాకిక ఏం చెయ్యాలో కూడా తోచలేదు,” అన్నది ఆమె. ఆమె కుటుంబం ఇప్పుడు వారి పొలంలో గుడిసె వేసుకుని బతుకుతున్నారు. రాధ అక్కడ పత్తి, గోధుమలు పండిస్తున్నది.
ఆమె తన గ్రామానికి తిరిగి రాగానే, ఆమె పై దాడి చేసిన వారి కుటుంబాలు రాధ పైన గురిపెట్టాయి. “కేసు ఇంకా సాగుతూనే ఉంది. దానిని వెనక్కు తీసుకోమని ఒత్తిడి బాగా పెరిగింది”, అన్నది రాధ. కానీ వెనక్కి తీసుకోనని ఆమె చెప్పినందుకు, ఆమెను బెదిరించసాగారు. “నేను గ్రామంలో వారి ముందే ఉన్నాను. నన్ను బెదిరించి వేధించడం వారికి తేలికైపోయింది.” కానీ రాధ లొంగలేదు




