దోమ తెర కట్టిన నులక మంచం మీద వెల్లకిలా పడుకుని కలతగా ఉన్న కెహెల్యా వాసవే నొప్పితో మూలుగుతున్నాడు. తండ్రి బాధను దగ్గరగా చూస్తున్న పద్దెనిమిదేళ్ల లీల అతడి కాళ్ళను నొక్కి కాసింత ఉపశమనాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తోంది.
ఎడమ బుగ్గ మీద ఒక పుండుతో, ఆహారం తీసుకోవడానికి కుడి ముక్కులో ఒక ట్యూబుతో కెహెల్యా కొన్ని నెలలుగా అలా మంచం మీదే పడి ఉన్నాడు. “ఆయన అటూ ఇటూ తిరగలేడు. పుండు సలుపుతూ ఉంటుంది ” అని అతడి 42 ఏళ్ళ భార్య పెస్రీ చెప్పింది.
నలభై ఐదేళ్ల కెహెల్యాకు దవడ క్యాన్సరు (బుక్కల్ మ్యూకోసా) వచ్చింది. మహారాష్ట్ర వాయువ్య ప్రాంతంలోని నందుర్బర్ జిల్లా చించ్పడ క్రిస్టియన్ ఆసుపత్రి వైద్యులు ఈ ఏడాది జనవరి 21 న వ్యాధి నిర్థారణ చేశారు.
దేశంలో మార్చి 1 నుండి 45-59 ఏళ్ల వయసు వారికోసం ప్రారంభం అయిన రెండో దశ కోవిడ్-19 టీకా కార్యక్రమం మార్గదర్శకాల్లో 20 సహ సంబంధిత రోగాలను (comorbidities) ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ చేర్చింది. కెహెల్యాకు వచ్చిన కాన్సరు అందులో ఒకటి. తొలుత అరవై ఏళ్ళు పైబడ్డ వారికీ, ఆ తర్వాత 45-60 ఏళ్ల వయసు వారికీ, అలాగే సహ సంబంధిత రోగాలు ఉన్నవారికీ టీకాలు వేస్తారని ఆ శాఖ మార్గదర్శకాలు చెప్పాయి (ఏప్రిల్ 1 నుంచి 45 ఏళ్ళు పైబడిన వారందరికీ సహ సంబంధిత రోగాలతో నిమిత్తం లేకుండానే టీకాలు వేయడం మొదలయ్యింది).
వయసు వర్గీకరణాలూ, సహ సంబంధిత రోగాల జాబితాలు లేదా అర్హతల విస్తరణలు- ఇవేవీ కూడా కెహల్యా, అతడి భార్య పెస్రీలకు ఏ ప్రయోజనాన్నీ చేకూర్చలేదు. షెడ్యూల్డ్ తరగతిలోని భిల్ సమూహానికి చెందిన వాసవే కుటుంబం టీకాలను వేయించుకోలేకపోతోంది. అక్రని తాలూకాలోని వారి ఊరు కుంభరికి 20 కి.మీ దూరంలో ఉన్న ధడ్గావ్ గ్రామీణ ఆసుపత్రిలో టీకా కేంద్రం ఉంది. అదే వారికి సమీపంలో ఉన్న టీకా కేంద్రం. “మేము అక్కడికి నడిచి వెళ్లడం వినా వేరే మార్గం లేదు” చెప్పింది పెస్రీ.
కొండ మీదకు ఎక్కడం, దిగడం అంటే నాలుగు గంటల ప్రయాస. “వెదురు బొంగులకు దుప్పటి చుట్టి తాత్కాలికంగా తయారు చేసిన డోలీ (stretcher) మీద టీకా కేంద్రానికి మోసుకుపోవడం అంటే మాటలు కాదు” తన మట్టింటి మెట్ల మీద కూర్చుని చెప్పింది పెర్సీ. వాళ్ళ ఇల్లు ఆదివాసులు ఎక్కువగా నివసించే నందుర్బార్ కొండ ప్రాంతంలో ఉంటుంది.
“ప్రభుత్వం ఆ సూది మందును ఇక్కడ ఇవ్వలేదా (స్థానిక ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో)? మేము అక్కడికి పోగలుగుతాము కదా?” అంది పెర్సీ. వాళ్లింటికి రమారమి ఐదు కి.మీ దూరంలో ఉండే రోషమల్ కే.హెచ్ గ్రామంలో ప్రాధమిక ఆరోగ్య కేంద్రం ఉంది.
ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు కొండ ప్రాంతమైన ధడ్గావ్ ఏరియాలో తిరగవు. అక్రని తాలూకా ఈ ప్రాంతంలోనే ఉంటుంది. ఇక్కడ ఉన్న 165 గ్రామాలలో సుమారు రెండు లక్షల ప్రజలు నివసిస్తారు. ధడ్గావ్ గ్రామీణ ఆసుపత్రి సమీపంలో ఉన్న డిపో నుంచి నందుర్బార్ జిల్లాలోని ఇతర ప్రాంతాలకు బస్సులు తిరుగుతాయి. “ఇక్కడ ప్రాధమిక సదుపాయాలు లేవు” అన్నారు నందుర్బర్ జిల్లా పరిషద్ సభ్యుడు గణేశ్ పరాడ్కే.
స్థానికులు ఎక్కడికన్నా వెళ్లాలంటే ప్రైవేటు ఆపరేటర్లు తిప్పే జీపుల మీదే ఆధారపడతారు. కానీ అవి తరచుగా తిరగవు. ఒక చోట నుంచి మరో చోటకు తీసుకువెళ్లి మళ్ళీ వెనక్కు తీసుకురావడం కోసం వాళ్ళు ఒక్కొక్క ప్రయాణీకుడి నుంచి రూ. 100 వసూలు చేస్తారు. ఒక ఊరు నుంచి ఇంకో ఊరికయినా, బజారు కయినా, బస్టాండ్ కయినా, ఆ ప్రాంతంలో ఎక్కడికయినా అదే ధర.
పెస్రీ, ఆమె కుటుంబం ఈ చార్జీలను పెట్టుకోలేరు. కెహెల్యా వైద్య నిర్ధారణ, చికిత్సల కోసం వాళ్ళ పశువులను అన్నింటినీ – ఒక ఎద్దు, ఎనిమిది మేకలు, ఏడు కోళ్ళు- ఆ ప్రాంతంలోని ఒక రైతుకు పెస్రీ అమ్మేసింది. తమ మూగ జీవాలను కట్టేసేందుకు కట్రాటలను పాతిన ఆవరణ నేడు అవి లేక వెలవెల బోతోంది.
తన ఎడమ బుగ్గ మీద ఒక కణితి ఎదగడాన్ని కెహెల్యా ఏప్రిల్ 2020 మొదట్లో గమనించాడు. అయితే కోవిడ్ భయంతో వైద్య సహాయాన్ని పొందటానికి కుటుంబం వెనుకడుగు వేసింది. “కరోనా కారణంగా ఆసుపత్రికి వెళ్లడానికి భయపడ్డాము. కణితి మరింత పెరిగి సలపడంతో ఈ ఏడాది ప్రయివేటు ఆసుపత్రికి (2020 జనవరిలో నవపూర్ తాలూకా చించ్పడ క్రిస్టియన్ ఆసుపత్రికి) వెళ్లాము” వివరించింది పెస్రీ.
“మా గొడ్లను అన్నిటినీ 60 వేల రూపాయలకు అమ్మేశాను. ప్రభుత్వ ఆసుపత్రి కంటే పెద్ద (ప్రైవేటు) ఆసుపత్రిలో మంచి వైద్యం దొరుకుతుందని అనుకున్నాం. మేం కొంచెం డబ్బు ఖర్చుపెట్టాలి అయినా మంచి వైద్యం దొరుకుతుందని అనిపించింది. అక్కడ డాక్టరేమో ఆపరేషన్ తప్పనిసరి అంటున్నారు. కానీ మా దగ్గర డబ్బులు లేవాయే”, పెస్రీ ఆవేదన చెందింది.
కొండవాలులో ఉన్న తమ ఒక ఎకరం పొలంలో ఆమె కుటుంబం వానాకాలమంతా పనిచేసి తమ కోసం రెండు మూడు క్వింటాళ్ళ జొన్నలు పండిస్తుంది. ఆమె కుటుంబంలో మొత్తం ఎనిమిది మంది - కూతురు లీలా, 28 యేళ్ల పెద్ద కొడుకు సుబాస్, కోడలు సుని, వాళ్ళిద్దరి చంటి పిల్లలు, పెస్రీ చిన్న కొడుకు, భర్త కెహెల్యా. “ఈ జొన్నలు మాకు సరిపోవు. మేము బయట పని వెతుక్కుంటాం” చెప్పింది పెస్రీ.
పెస్రీ, కెహెల్యా ప్రతి ఏటా అక్టోబరులో కోతల తర్వాత పత్తి చేలలో పనిచేయడానికి గుజరాత్ వలస వెళ్ళేవారు. నవంబరు నుంచి మే వరకు వారి ఒక్కొక్కరి చేతికి రోజుకి రూ. 200 నుంచి రూ. 300 దాకా సుమారు 200 రోజుల పాటు కూలి రూపేణా దక్కేవి. కోవిడ్ పుణ్యమా అని వారు ఇల్లు కదలడానికి లేకుండా పోయింది. “ ఇక ఇప్పుడేమో ఆయన మంచం పట్టాడు. బైట వైరస్ ఉంది” వాపోయింది పెస్రీ.
కుంభరి గ్రామ జనాభా 660 (2011 జనాభా లెక్కల ప్రకారం). తాను విధులు నిర్వహించే 10 కుగ్రామాల్లో కెహెల్యా ఒక్కడే కాన్సర్ వ్యాధిగ్రస్తుడని తమ రికార్డులు సూచిస్తున్నట్టు ఆ ప్రాంతపు ఆశా సేవిక ముఫై ఆరేళ్ల సునీత పట్లే తెలిపారు. ఈ గ్రామాల మొత్తం జనాభా సుమారు ఐదు వేలని ఆమె అంచనా. “నలభై ఐదేళ్లు దాటిన ఆడ, మగ జనాభాలో 50 మందికీ, అరవై ఏళ్ళు దాటిన వారిలో 200 మందికీ కొడవలి కణ రక్తహీనత (sickle cell anaemia) వ్యాధి ఉంది (ఎర్ర రక్త కణ రుగ్మత కూడా ప్రభుత్వ మార్గదర్శకాలలో సహ సంబంధిత వ్యాధుల జాబితాలో ఉంది).
రవాణా, రహదారి సదుపాయాలు లేకపోవడంతో టీకా కోసం ఎవరూ కూడా ధడ్గావ్ గ్రామీణ ఆసుపత్రికి వెళ్లలేని పరిస్థితి. “ఇంటింటికీ వెళ్ళి టీకా కార్యక్రమం మొదలయ్యిందని చెబుతూనే ఉన్నాం. అయితే వారు టీకా కేంద్రానికి వెళ్ళడం చాలా కష్టం” అన్నారు సునీత.
అరవై ఏళ్ళు పైబడ్డ వారిలో కేవలం 99 మంది, సహ సంబంధిత వ్యాధిగ్రస్తులయిన 45-60 ఏళ్ల వారిలో ఒక్కరు మాత్రమే మార్చి 20 నాటికి ధడ్గావ్ గ్రామీణ ఆసుపత్రి టీకా కేంద్రంలో తొలి టీకా వేయించుకున్నారని జిల్లా వైద్య శాఖ వారి నందుర్బర్ టీకా నివేదిక వెల్లడి చేసింది.
మార్చి 2020 లో ఇరవై వేల పాజిటివ్ కేసులు వచ్చిన జిల్లాలోని అర్బన్, సెమీ అర్బన్ ప్రాంతాలో ఏర్పాటు చేసిన టీకా కేంద్రాలు కొంతవరకు టీకాలను వేయడంలో సఫలీకృతమయ్యాయి. ధడ్గావ్ గ్రామీణ ఆసుపత్రికి 45 కి. మీ దూరంలో ఉన్న తలోడా లోని సబ్ డివిజినల్ ఆసుపత్రిలో అరవై ఏళ్ల పైబడ్డ వారిలో 1279 మంది, సహ సంబంధిత వ్యాధులు ఉన్నవారిలో 332 మంది టీకాలను వేయించుకున్నారు.
ఎడమ: రోషమల్ కే. హెచ్ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం ఐదు నుంచి ఎనిమిది కి. మీ దూరంలో ఉంది. “ప్రభుత్వం ఆ సూది మందును ఇక్కడ ఇవ్వలేదా ( స్థానిక ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో)? అని ప్రజలు అడుగుతున్నారు. కుడి: సమీపంలోని ధడ్గావ్ గ్రామీణ ఆసుపత్రి టీకా కేంద్రానికి వెళ్లాలంటే స్థానికులు కొండల గుట్టల మీదుగా 20 కి.మీలు నడవాల్సిందే.
“రహదారులు లేని ఈ ఆదివాసీ ప్రాంతాలనుంచి టీకా కార్యక్రమానికి వస్తున్న స్పందన అంతంత మాత్రం” అన్నారు నందుర్బర్ జిల్లా వైద్యాధికారి డా. నితిన్ బొర్కే. “ధడ్గావ్ గ్రామాలను కలుపుతూ రోడ్డు మార్గాలు లేకపోవడం పెద్ద సమస్య. టీకా కేంద్రం నుంచి ఇక్కడి గ్రామాలు, కుగ్రామాలు చాలా దూరంలో ఉన్నాయి” అన్నారాయన.
దూరాన ఎక్కడో విసిరేసినట్టు ఉన్న కుగ్రామాల్లో నర్మదా నది ఒడ్డున ఉండే చిత్ఖేడీ ఒకటి. పెర్సీ వాళ్ళ ఊరి నుంచి ఇది 10 కిమీ ఉంటుంది. ధడ్గావ్ గ్రామీణ ఆసుపత్రి టీకా కేంద్రం ఇక్కడి నుంచి 25 కిమీ పైనే ఉంటుంది.
ఈ గ్రామ నివాసి సోన్యా పట్లే పార్కిన్సన్స్ వ్యాధితో (ఈ వ్యాధిగ్రస్తుల్లో శరీరం బిరుసెక్కి, ముఖం/తల భాగంలో వణుకుడు మొదలై అవయవ సమన్వయం కోల్పోయి నడక గతి తప్పుతూ ఉంటుంది) నులకమంచం మీద తన తలరాతని నిందించుకుంటూ పడుకుని ఉన్నాడు. అతనికి 85 ఏళ్ళు. “ నేనేం పాపం చేశానని దేవుడు నాకీ శిక్ష వేశాడు?” అంటూ గట్టిగా అరుస్తూ ఏడ్చాడు. అతడి మంచం పక్కన ఆవు పేడతో అలికిన నేల మీద కూర్చుని ఉన్న అతడి భార్య బుబాలి గచ్చకాయ రంగు గళ్లున్న రుమాలుతో కళ్ళు తుడుచుకుంది. పర్వత శిఖర గ్రామం అయిన చిత్ఖేడీలో వెదురు బొంగులతో కట్టుకున్న తన ఇంట్లో గత 11 ఏళ్లుగా ఆమె భర్త అలానే పడి ఉన్నాడు.
ఆదివాసీ భిల్ సమూహానికి చెందిన సోన్యా, బుబాలిలు ఇద్దరూ వయసు రీత్యా టీకా వేయించుకోవడానికి అర్హమైన గ్రూపులోనే ఉన్నారు. “మేము ఇద్దరమూ ముసలి వాళ్ళం. అతడేమో మంచం పట్టి ఉన్నాడు. వెళ్ళి టీకా వేయించుకోలేని పరిస్థితి. టీకా వేస్తున్న సంగతి మమ్మల్ని ఎలా సంతోష పరుస్తుంది చెప్పండి?” అని ప్రశ్నించింది 82 ఏళ్ల బుబాలి.
ఆలుమగలు ఇద్దరూ వారి ఏభై ఏళ్ల కొడుకు హను, కోడలు గార్జీల ఆదాయం మీద ఆధారపడి బతుకుతున్నారు. వారు ఆ వెదురింట్లో కొడుకు, కోడలితో సహా ఆరుగురు మనుమలతో కలిసి ఉంటున్నారు. “హను వాళ్ళ నాన్నకు స్నానం చేయిస్తాడు, మరుగుకు తీసుకు వెళ్తాడు, వీపు మీద మోస్తాడు, సంరక్షణ అంతా చూసుకుంటాడు” అని బుబాలి చెప్పింది. హను కాక, వివాహితులైన వారి ఇతర నలుగురు మగ పిల్లలు, ముగ్గురు ఆడ పిల్లలు వేరే గ్రామాల్లో ఉంటున్నారు.
వారంలో మూడు రోజులు నర్మదా నదిలో ఉదయం తొమ్మిది గంటల నుండి మద్యాహ్నం 2 గం. వరకు హను, గార్జీ చేపలు పడతారు. “ చేపల వర్తకుడు ఒకరు మా ఊరికి వారంలో మూడు సార్లు వస్తాడు. కిలో చేపలకు మాకు వంద రూపాయలు ఇస్తాడు” చెప్పింది గార్జీ. చేపలమీద వాళ్ళకు వారానికి సుమారు రూ. 3,600 దాకా ఆదాయం వస్తుంది. హను మిగతా రోజుల్లో ధడ్గావ్ హోటళ్లలో పాచి చేసి, గిన్నెలు కడిగి రోజుకి రూ. 300 సంపాదిస్తాడు. పొలాల్లో కూలి చేసి గార్జీ మరో రూ. 100 ఆర్జిస్తుంది. “నెలలో మాకిద్దరికీ 10-12 రోజులు మాత్రమే పని దొరుకుతుంది. కొన్ని సార్లు ఆ పనీ దొరకదు” వివరించింది గార్జీ.
ఆర్థిక పరిస్థితులు ఇలా ఉన్నపుడు సోన్యా, బుబాలిలను టీకా కేంద్రానికి తీసుకువెళ్లడానికి రూ. 2000 కు ప్రైవేటు వాహనం మాట్లాడుకోవాలంటే అది వారికి చిన్న విషయమేమీ కాదు.
“బహుశా ఆ సూదిమందు మాకు మంచే చేయవచ్చు. కానీ మేము ఈ వయసులో అంత దూరం నడవడం చాలా కష్టం” అని బుబాలి అంది. టీకా కోసం ఆసుపత్రికి వెళ్తే, “అక్కడ మాకు కరోనా సోకితే మా పరిస్థితి ఏమిటి?” అంటూ కోవిడ్-19 గురించి ఆమె ఆందోళన వ్యక్తం చేసింది. “మేము అక్కడికి వెళ్ళేది లేదు. ప్రభుత్వాన్నే మా గడప దగ్గరికి రానివ్వండి” అంది.
అదే గ్రామంలోని ఇంకో గుట్ట మీద ఉండే 89 ఏళ్ల దోల్యా వాసవే తన ఇంటి వసారాలో చెక్కలతో చేసిన పెద్ద బల్ల మీద కూర్చుని బుబాలి భయాలనే తాను కూడా వ్యక్తం చేశాడు. “నేను గనుక వెళితే (టీకా కోసం) అది బండి మీదే ( నాలుగు చక్రాల వాహనం మీద). లేకపోతే లేదు” అని నిశ్చయంగా చెప్పాడు.
అతని దృష్టి మందగిస్తోంది. చుట్టూ ఉన్నవాటిని గుర్తు పట్టలేక పోతున్నాడు. “ ఈ కొండలూ గుట్టలలో అవలీలగా నడిచి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి” అని గుర్తు చేసుకున్నాడు. “ నాకిప్పుడు అంత శక్తి లేదు. స్పష్టంగా ఏదీ చూడలేక పోతున్నాను.” అన్నాడు.
దోల్యా భార్య రూలా చాన్నాళ్ల క్రితమే మరణించింది. ముప్ఫై ఏళ్ల వయసులో ప్రసవ సమయంలో కొన్ని సమస్యలు తలెత్తి చనిపోయింది. ముగ్గురు కొడుకులను తండ్రి దోల్యానే సాకాడు. వాళ్ళు ముగ్గురూ ఇపుడు సమీప గ్రామంలో తమ సొంత గుడిసెలలో నివసిస్తున్నారు. ఇరవై రెండేళ్ల మనవడు కల్పేష్ దోల్యాతో ఉంటూ తాత సంరక్షణ చూసుకుంటున్నాడు. చేపలు పట్టడం మూలంగా వచ్చే ఆదాయం మీద బతుకుతున్నాడు.
చిత్ఖేడీ గ్రామంలో దోల్యా, సోన్యా, బుబాలి సహా అరవై ఏళ్ళు పైబడ్డ వాళ్ళు 15 మంది ఉన్నారని ఆశా సేవిక బోజి వాసవే చెప్పారు. మార్చి మధ్యలో తాను ఈ గ్రామాన్ని సందర్శించినపుడు ఒక్కరు కూడా టీకా కేంద్రానికి వెళ్లకపోవడాన్ని గమనించానని ఆమె అన్నారు. “వృద్ధులు, బాగా జబ్బు పడ్డవారు ఆసుపత్రికి అంత దూరం నడిచి వెళ్లలేరు. కరోనా సోకుతుందనే అనుమానం వలన చాలా మంది ఆసుపత్రికి వెళ్లడానికి భయపడుతున్నారు” అంటున్నారు ఆశా సేవిక బోజి వాసవే. ఆమె తన విధుల్లో భాగంగా గ్రామంలోని 94 ఇళ్లలోని 527 మంది ఆరోగ్య అవసరాలు అర్ధం చేసుకుంటుంది.
ఈ సమస్యలను అధిగమించి టీకాలకు వచ్చేవారి సంఖ్యను పెంచడానికి ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో కూడా టీకా కేంద్రాలను తెరవాలని మహారాష్ట్ర వైద్య శాఖ తలపోస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఇంటర్నెట్ ఉన్న చోటనే ఇది సాధ్యం అని అన్నారు డా. నితిన్ బోర్కే. “ టీకా వేయించుకునే వ్యక్తి వివరాలు కొవిన్(CoWIN) సైటులో నమోదు చేయడానికి, క్యూ.ఆర్ సంకేతం ఆధారంగా టీకా సర్టిఫికేటు జారీ చేయడానికి టీకా కేంద్రాలలో ఇంటర్నెట్, కంప్యూటర్లు, ప్రింటర్లు ఉండాలి” అని ఆయన చెప్పారు.
ధడ్గావ్ ప్రాంతంలో ఉన్న చిత్ఖేడీ, కుంభరి వంటి సుదూర గ్రామాలలో మొబైల్ నెట్‌వర్క్ లేదు. అందుచేత ఈ ప్రాంతంలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో ఇంటర్నెట్ సదుపాయం లేదు. “ఫోను కాల్స్ చేసుకోవడానికి కూడా ఇక్కడ నెట్‌వర్క్ అందుబాటులో లేదు. ఇక ఇంటర్నెట్ అసంభవం ఇక్కడ” అన్నారు రోషమల్ ప్రాధమిక ఆసుపత్రిలో పనిచేసే డా. శివాజీ పవార్.
పెర్సీ ఈ కష్టాలకు అలవాటు పడిపోయింది. “ఎవరూ ఇక్కడికి రావాలని అనుకోరు. పైపెచ్చు అది (కోవిడ్ టీకా) ఆయన (కెహెల్యా) కాన్సర్ నేమీ తగ్గించలేదు” అని నిట్టూర్చింది. “ఈ సుదూర కొండ ప్రాంతాలలోకి మా రక్షణ కోసం, మాకు మందులు ఇవ్వడం కోసం వైద్యులు ఎందుకు వస్తారు? “ అని ఆమె ప్రశ్నించింది.
అనువాదం: ఎన్.ఎన్.శ్రీనివాసరావు