రైతు సునందా సూపే జూన్ నెల గురించి, ఆ తర్వాత వచ్చే వర్షాకాలపు నెలల గురించీ కూడా భయపడుతుంటారు. ఏడాదిలో ఈ నెలలలోనే, స్థానికంగా మోథే గోగల్గై అని పిలిచే ఈ భారీ ఆఫ్రికా నత్తలు దరక్‌వాడీ గ్రామంలో ఉన్న ఆమె ఎకరం పొలాన్ని నాశనం చేస్తున్నది.
"మనం ఏమి విత్తినా, అవి తినేస్తాయి - వరి, సోయాబీన్, వేరుశెనగ, కాళా ఘేవ్డా (నల్ల చిక్కుళ్ళు), కిడ్నీ బీన్స్ - ఏవైనా," అని చెప్పారామె. మామిడి, చికూ (సపోటా), బొప్పాయి, జామ వంటి పండ్లకు కూడా వాటి నుండి రక్షణ లేదు. "మనం ఈ నత్తలను వేల సంఖ్యలో చూడవచ్చు," అని 42 ఏళ్ళ ఈ రైతు చెప్పారు
మహారాష్ట్రలో షెడ్యూల్డ్ తెగగా జాబితా చేసిన మహదేవ్ కోళీ సముదాయానికి చెందిన ఈమె తన తల్లి, సోదరుడితో కలిసి చాస్‌కమాన్ ఆనకట్ట పక్కనే నివసిస్తున్నారు. ఆమె ఇల్లు, పొలం ఆనకట్టకు చెరోవైపునా ఉన్నాయి. ఆమె ఇంటి నుంచి పొలానికీ, పొలం నుంచి ఇంటికీ చేరాలంటే చెరో అరగంటా పడవ నడుపుతూ ప్రయాణించాలి.
ఈ భారీ ఆఫ్రికా నత్తలు (అకటీనా ఫూలికా), భారతదేశంలోకి చొచ్చుకువచ్చిన జాతి అని గ్లోబల్ ఇన్వేసివ్ స్పీసీస్ డేటాబేస్ పేర్కొంది. ఇవి వివిధ రకాల పంటలను తింటాయని తెలుస్తోంది. వర్షాకాలంలో, జూన్ నుండి సెప్టెంబర్ వరకు, తివై కొండకు దిగువన ఉన్న పొలాలను ఈ నత్తలు ఆక్రమిస్తాయి. కొన్నిసార్లు అవి మరికొన్ని నెలల పాటు అక్కడే ఉంటాయి. సునంద, 2022 చివరిలో ఈ విలేఖరితో మాట్లాడుతూ, తాను ఇప్పుటికి మూడేళ్ళుగా ఈ సమస్యను ఎదుర్కొంటున్నానని చెప్పారు












