"నేను గత సంవత్సరం కేవలం ఐదు ప్రదర్శనలు మాత్రమే ఇచ్చాను " అని 'శ్రీ ప్రసన్నాంజనేయ బృందం ' అనే తోలుబొమ్మలాట బృందం వ్యవస్థాపకుడు, ఆ బృందంలో ముఖ్య కళాకారుడు అయిన రేఖనార కోటిలింగం చెప్పారు.
48 ఏళ్ల కోటిలింగం 2,500 పైగా ప్రదర్శనలు ఇచ్చిన అనుభవం వున్న కళాకారుడు. ఆయన తన 12 వ ఏటనే ప్రదర్శనలు ఇవ్వటం ప్రారంభించారు. 25 ఏళ్ల క్రితం తన సొంతబృందాన్ని ప్రారంభించక ముందు, తండ్రి బాలాజీ నడిపే తోలుబొమ్మలాట బృందంలో మృదంగం వాయించేవారు, పాటలు పాడేవారు..
"నేను ఈ కళను మా నాన్న దగ్గర నేర్చుకున్నాను. ఆయన వాళ్ళ నాన్న దగ్గర నేర్చుకున్నాడు" కోటిలింగం సోదరుడు 60 ఏళ్ల రేఖనార హనుమంతరావు అన్నారు. అతను కూడా ఆ బృందంలో సభ్యుడు. " మేము ఆటకు కావలసిన పరికరాలు (మృదంగం, హార్మోనియం, వేదిక మీదకు కావాల్సిన ఇతర వస్తువులు) , రోజువారీ అవసరాలైన వంట పాత్రలు , బట్టలు అన్నీ ఎద్దుల బండి మీద వేసుకొని ఒక ఊరి నుంచి ఇంకొక వూరికి ప్రదర్శనలివ్వడానికి వెళ్ళేవాళ్ళం."
కానీ ఇప్పుడు తోలుబొమ్మలాట కళాకారుల్ని హైదరాబాద్లో రవీంద్ర భారతి , చెన్నైలో మద్రాస్ యూనివర్సిటీ వంటి సాంస్కృతిక కార్యక్రమాలు జరిగే ప్రదేశాలకు, తిరుపతిలో బ్రహ్మోత్సవాలు జరిగే సమయంలో అప్పుడప్పుడు ప్రదర్శనలిచ్చేందుకు పిలుస్తున్నారు.
మార్చి నెల 10, 2018 న వాళ్ళు అద్దంకి పట్టణంలో " రామ రావణ యుద్ధం" ప్రదర్శించారు. ప్రకాశం జిల్లాలో జానపద కళలను ప్రోత్సహించే అద్దంకి కళాపీఠం అనే సంస్థ 20వ వార్షికోత్సవం సందర్భంగా ఆ ప్రదర్శనను ఏర్పాటు చేశారు. రాముడికి రావణుడికి మధ్య యుద్ధం మంచికీ చెడుకీ మధ్య జరిగే యుద్ధంగా చూపించే నాటకం అది. కార్యక్రమంలో అది చివరి ప్రదర్శన కావడంతో రెండు గంటల ప్రదర్శనని ఒక గంటకి కుదించుకోవాల్సి వచ్చింది. రాత్రి 11 అయినా ఆడా మగా అందరూ తోలు బొమ్మలాట చూడడానికి ఉండిపోయారు. ప్రేక్షకుల్లో ఒకరైన 74 ఏళ్ల మాణిక్యాల రావు , చేతిలో బీడీ పట్టుకొని ఆవలిస్తూ అన్నారు " తోలు బొమ్మలాట చూసి చాల కాలం అయ్యింది. అందుకే ఆలస్యం అవుతున్నా వున్నాను".
ఆంధ్రప్రదేశ్లో మిగిలివున్నఅతి కొద్ది తోలుబొమ్మలాట బృందాల్లో 10 మంది సభ్యులున్న కోటిలింగం బృందం కూడా ఒకటి. బృందంలో సభ్యులందరూ మహారాష్ట్రలో మూలాలు కలిగివున్న ఆర్యక్షత్రియ సామజిక వర్గానికి చెందినవారే, అందరూ కోటిలింగం బంధువులే. వీరంతా దక్షిణ కోస్తా ఆంధ్రలోని గుంటూరు, ప్రకాశం జిల్లాలలోని అద్దంకి , దరిశి , ఒంగోలు లాంటి చిన్న పట్టణాల్లో తోపుడు బండ్ల మీద వ్యాపారమో, కూలీపనో చేసుకుంటూ జీవిస్తున్నారు. మూడు నాలుగు నెలలకొకసారి ఎవరైనా ప్రదర్శనకు పిలిచినపుడు అందరూ బృందంగా కలుస్తారు.
తమ పూర్వీకుల కళారూపాన్ని ఛత్రపతి శివాజీ మరాఠా రాజ్యానికి అనుసంధానం చేస్తూ- ఛత్రపతి శివాజీ సోదరులైన సెర్ఫోజీ, వెంకోజీలు 17వ శతాబ్దంలో మదురై-తంజావూరు ప్రాంతానికి వచ్చి వివిధ కళారూపాలను ప్రోత్సహించారనీ, అందులో ఒకటి ఆర్యక్షత్రియ సామాజికవర్గానికి చెందిన తోలుబొమ్మలాట అనీ- బృందంలోని ముఖ్య స్త్రీ పాత్రధారి, 45 ఏళ్ల వనపర్తి రామాంజునేయమ్మ చెప్పారు.
కోటిలింగం, రామాంజునేయమ్మ ఒకరి తరువాత ఒకరు వంతులు వేసుకుంటూ ఈ మూల కథను వివరించారు: "ఒకానొకప్పుడు, చోళరాజు ఆస్థానంలో ఒక బ్రాహ్మడు ఉండేవాడు. అతనికి కంసలు (ఒక సామాజిక వర్గం: ఆంధ్రలో ప్రస్తుతం కంసాలి అనే పేరుతో ఉంది) అంటే ద్వేషం. రాజును కంసలు చంపడానికి పథకం వేస్తున్నారని ఆ బ్రాహ్మడు ఒక కట్టు కథ అల్లి రాజుని నమ్మించాడు. కంసల తలలు తీయించమని రాజు ఆజ్ఞాపించాడు. బతికివున్న కొద్దిమంది కంసలు జీవనోపాధిని కోల్పోయి అడవులకు పారిపోయారు. అక్కడ చనిపోయిన జంతువుల చర్మంతో బొమ్మలు చేయడం ప్రారంభించి, ఈ జానపద కళను అభివృద్ధి చేసి, బ్రతుకుతెరువు కోసం ప్రజల వద్ద ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించారు. ఆసక్తి కలిగిన ఇతర కులాలవారు కూడా ఈ కళను నేర్చుకున్నారు. ఆరు నెలల పాటు రామాయణాన్ని ప్రదర్శిస్తూ వారు, ప్రతీకారంతో బ్రాహ్మణుడినీ రాజునూ చంపడానికి వేదిక నుండి రాజభవనం వరకు సొరంగం త్రవ్వడం ప్రారంభించారు. ప్రదర్శన చివరి రోజున రాముడు రావణుడిని సంహరించినప్పుడు, వారు బ్రాహ్మణుడ్నీ రాజునూ చంపి, ఆసక్తితో నేర్చుకున్న ప్రజల కోసం తమ కళారూపాన్ని వదిలివేశారు. కాలక్రమేణా, ఈ కళను ప్రదర్శించిన వ్యక్తుల సమూహాన్ని ఆర్యక్షత్రియ అని పిలుస్తున్నారు.”
'ఒకప్పుడు రోజుల తరబడి, నెలల తరబడీ కూడా ఈ ప్రదర్శనలు కొనసాగేవి. కానీ ఇప్పుడు కేవలం సాయంత్రం ప్రదర్శనలకే పరిమితమయ్యాం.' అని రామాంజునేయమ్మ అన్నారు
ఈ సామాజిక వర్గం, 1871 నాటి 'క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్' కింద ఎలా హింసించబడిందో ఈ కథ తెలియజేస్తోంది. వలస పాలకులు రూపొందించిన ఈ చట్టం కొన్ని తెగలను స్వాభావికంగా 'నేరస్థులు'గా ముద్ర వేసింది. తోలుబొమ్మలాట ప్రదర్శనలతో సహా వారి కార్యకలాపాలు వాళ్ల చట్టవిరుద్ధమైన లావాదేవీలకు ఒక ముసుగు అని పేర్కొంది. 1952లో భారత ప్రభుత్వం ఈ చట్టాన్ని రద్దు చేసింది. దాంతో తోలుబొమ్మలాట బహిరంగ ప్రదర్శనలకు చట్టబద్దత లభించింది. ఆర్యక్షత్రియులు ఇప్పుడు వెనకబడిన తరగతుల జాబితాలో వున్నారు.
ఈ కళారూపానికి వున్న కుల-ఆధారిత మూలాలు, సంప్రదాయకంగా నిమ్నజాతి ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని, తోలుబొమ్మలాటలో వుండే నాటకాలు (తెలుగు భాషలో) పురాణాలు , రామాయణం మహాభారతం వంటి హిందూ ఇతిహాసాల నుండి తీసుకున్న కథలలో బ్రాహ్మణ వ్యతిరేక దృక్పథాలను పరిచయం చేస్తాయి. ఒక్కో ప్రదర్శనలో 7 నుండి 10 వరకు మేక తోలుతో చేసిన బొమ్మలు ఉంటాయి. వాటిని ఈ కళాకారులే తయారు చేసుకుంటారు. బొమ్మలు పాడయిపోతే కొత్త వాటితో మారుస్తారు. "మేము సుందరకాండ, మహి రావణ చరిత్ర, లక్ష్మణ మూర్ఛ, ఇంద్రజిత్తుని వధ, కుంభకర్ణుని వధ, పద్మవ్యూహం, విరాటపర్వం, కీచక వధ వంటి ఎన్నో ప్రదర్సనలు ఇచ్చాం." అన్నారు కోటిలింగం.
కోటిలింగం తరచుగా ప్రదర్శించే సుందరకాండ అతనికి అత్యంత ఇష్టమైనది, ఎందుకంటే అది అతనికి మంచి పేరు తెచ్చిపెట్టింది. . ఇది రామాయణం ఆధారంగా రూపొందించబడింది, కానీ తోలుబొమ్మలాట కళాకారులు కథను రావణుడి దృక్కోణం నుండి చెప్తూ అతన్ని కథకు నాయకుడిగా చేస్తారు.
"మా ప్రదర్శనలు రోజులు, నెలల తరబడీ కొనసాగేవి. రామాయణాన్ని మొదటి నుంచి చివరి దాకా ప్రదర్శించాలంటే ఆరు నెలలు పడుతుంది. కానీ ఇప్పుడు అంత పెద్ద నాటకాలు ప్రదర్శించటంలేదు. ప్రదర్శన ఇచ్చే స్థలం, చూసేందుకు వచ్చే ప్రేక్షకులలో వచ్చిన మార్పుల వల్ల సాయంత్రం ప్రదర్శనలు మాత్రమే ఇస్తున్నాం." అన్నారు రామాంజునేయమ్మ. వేదికను బట్టి 2 నుంచి 4 గంటల ప్రదర్శనకు ఈ బృందానికి 10 నుంచి 30 వేల రూపాయల వరకూ ఇస్తారు.
కోటిలింగం, హనుమంతరావులిద్దరూ తోలుబొమ్మలాటలో మొదట శిక్షణ పొందిన బాలాజీ బృందం ప్రకాశం, గుంటూరు జిల్లాల్లోని 1,000 గ్రామాలలలో ప్రదర్శనలు ఇచ్చింది. బ్రాహ్మణ అగ్రహారాల్లో మాదిరి వీళ్లకు కూడా మిరాశీ పద్దతి వుంది. ఒక్కో బృందానికీ కొన్ని గ్రామాల్లో- మిరాశీ లేదా వారసత్వం గా వచ్చిన ‘ప్రదర్శనలు ఇచ్చుకునే ప్రత్యేక హక్కు’ ఉంటుంది. ఆ బృందాలు వారి మిరాశీ గ్రామాల్లో ఒక్కోదాంట్లో నెలా రెండు నెలలు వుండి ప్రదర్శనలు ఇచ్చేవాళ్ళు. అయితే వారి ప్రదర్శన ఈ గ్రామాల వరకే పరిమితమై ఉంటుంది.
"మాకున్న ఆస్తులు ఇవే. కొడుకులు ( కూతుర్లు కాదు) మిరాశీ గ్రామాల్ని పంచుకుని వారి స్వంత బృందాలను ప్రారంభించారు. మా అన్ని అవసరాలు ( తిండి, గూడు, బట్టలు) గ్రామస్తులే చూసుకునేవాళ్ళు. ప్రదర్శనలు ఇచ్చినందుకు ఇచ్చే వడ్లు, డబ్బులు అదనం." అన్నారు కోటిలింగం. ఇప్పుడీయన అద్దంకిలో గొడుగులు ఇతర చిన్న చిన్న వస్తువులు అమ్ముకునే ఒక వీధి వ్యాపారస్తుడు. ప్రదర్శనలు లేనప్పుడు- సంవత్సరంలో ఎక్కువ భాగం- అదే అతని బ్రతుకుతెరువు. హనుమంతరావు తోలుబొమ్మలాట తప్ప ఇంకేపని చెయ్యటం లేదు. రామాంజునేయమ్మ ప్రకాశం జిల్లా దరిశిలో ఇళ్లల్లో పాచిపని చేస్తున్నారు.
"ఎక్కువగా మహిళలే ఈ తోలుబొమ్మలాటలు చూసేందుకు వచ్చేవాళ్ళు. టీవీ ప్రతి ఇంట్లో వుండే వస్తువయ్యాక వాళ్ళు ఇళ్లలోనే వుంటూ టీవీలో వచ్చే సీరియళ్లు చూస్తున్నారు. " అని అద్దంకిలో వుండే విశ్రాంత తెలుగు ఉపాధ్యాయుడు, సాంస్కృతిక కార్యకర్త జ్యోతి చంద్రమౌళి అన్నారు. ఆయన గత 35 ఏళ్లుగా జానపద కళాకారులతో పని చేస్తున్నారు.
తోలుబొమ్మలాట కళాకారులను’ నైపుణ్యం అవసరం లేని’ అనియత వృత్తుల వైపు వెళ్లేట్టు చేసిన కారణాల్లో ఇది కూడా ఒకటి. కోటిలింగం నలుగురు కొడుకుల్లో ఒక్కరు కూడా బొమ్మలాట నేర్చుకోలేదు. అద్దంకి పరిసరాల్లో భవన నిర్మాణ కార్మికులుగా, పరిశ్రమల్లో రోజు కూలీలుగా పనిచేస్తున్నారు. హనుమంత రావు, రామాంజునేయమ్మ పిల్లలు కూడా ఈ బొమ్మలాట నేర్చుకోలేదు.
“10 సంవత్సరాల క్రితం ఆరు తోలుబొమ్మలాట బృందాలు, వీధి నాటకాలు ప్రదర్శించే 15 ఇతర బృందాలు (ప్రకాశం జిల్లాలో) ఉండేవి. ఇప్పుడవి కనిపించడం అరుదు. నెమలి ఆట, బుట్ట బొమ్మలు వంటి మరికొన్ని కళారూపాలు ఇప్పటికే అంతరించిపోయాయి” అని చంద్రమౌళి చెప్పారు. తన ఆందోళనను వెలిబుచ్చుతూ కోటిలింగం “ఇది తోలుబొమ్మ కళాకారుల చివరి తరం అవుతుంది. ఇప్పటి నుండి పదేళ్ల తర్వాత, మీరు మా గురించి పుస్తకాలలో మాత్రమే చదువుతారు,మా ప్రదర్శనలను ఫొటోల్లో మాత్రమే చూస్తారు. ప్రత్యక్షంగా చూడటానికి ఏమీ మిగలదు.” అన్నారు.
"వెనకటి రోజుల్లో, గ్రామాల్లో ప్రజలు జానపద కళలను నిలబెట్టేవారు" అని హనుమంతరావు అన్నారు. “ఇప్పుడు, ప్రభుత్వం మమ్మల్నసలు పట్టించుకోవడం లేదు. పుణ్యక్షేత్రాలు, పాఠశాలల దగ్గర ఇటువంటి ప్రదర్శనలను ఏర్పాటు చేసి ప్రోత్సహించమని మేము ప్రభుత్వాన్ని కోరాం, కానీ వారు ఎన్నడూ పట్టించుకోలేదు. రాష్ట్రం నుంచి సహాయంగానీ, గ్రాంట్లు, పెన్షన్లు, గుర్తింపు కార్డులు - ఇవేవీ మా బొమ్మలాట కళాకారులకు లేవు. . "నెలకు ఐదు నుండి ఆరు ప్రదర్శనలు మా కడుపు నింపుతాయి, కళనూ నిలబెడతాయి," అని అతను, తన వారసత్వం తనతోనే కనుమరుగు కాకూడదని ఆశిస్తూ అన్నారు.
అనువాదం: వి. రాహుల్జీ