వాళ్ళు తమిళనాడులో ఎన్నో ప్రదేశాలు దాటుకుని వచ్చారు, తూత్తుకుడి పట్టణంలో వీధులలోకి గుంపులు గుంపులుగా మనుషులు వచ్చాక - ఒక చిన్నపిల్లాడు వారి వైపు పరిగెత్తుకుంటూ వచ్చాడు. అతను కాసేపట్లోనే వారు చేసే ఆ నిరసన లో కలిసిపోయి విప్లవాత్మక నినాదాలు ఇచ్చాడు. “మీకీ రోజు ఈ విషయం అర్ధమవకపోవచ్చు.” అన్నారయన, “కానీ భగత్ సింగ్ ని ఉరితీయడం తమిళనాడులో స్వాతంత్య్రపోరాట భావోద్వేగాలను ఒక మలుపు తిప్పింది. ప్రజలు నిర్ఘాంతపోయారు, చాలా మంది కనీళ్ళు పెట్టుకున్నారు.”
“నాకు అప్పుడు 9 ఏళ్ళు మాత్రమే”, ఆయన నవ్వారు.
ఈ రోజు ఆయన వయసు 99 ఏళ్ళు. ఆయనలో స్వాతంత్య్ర యోధుడిని చేసిన ఆత్మజ్వాల, ఇంకా ప్రజ్వలంగా ఉంది. ఈయన ఒక అండర్ గ్రౌండ్ విప్లవ రచయిత, వక్త, విప్లవాత్మక మేథావి. బ్రిటిష్ జైలు నుండి ఆగష్టు 14, 1947న బయటపడిన వ్యక్తి. “ఆ రోజు ఆ జడ్జి సెంట్రల్ జైలుకి వచ్చి మమ్మల్ని విడుదల చేశారు. మమ్మల్ని మదురై కుట్ర కేసులో పట్టుకున్నారు. నేను మదురై సెంట్రల్ జైలు నుండి వచ్చి స్వాతంత్య్ర ఊరేగింపులో పాల్గొన్నాను.”
వందేళ్లున్న శంకరయ్య మేధ ఇప్పటికీ చురుకుగా ఉంది. ఇప్పటికీ ఆయన ఉపన్యాసాలు ఇస్తారు. 2018లో ఈయన ఇంటి నుంచి చైన్నై ఊరి చివర ఉన్న క్రోమ్పేట్ వరకు వచ్చారు. అక్కడ తమిళనాడు ప్రోగ్రెసివ్ రైటర్స్ అండ్ ఆర్టిస్ట్స్ మీట్ జరుగుతోంది, అక్కడే మేము ఆయనను ఇంటర్వ్యూ చేశాము. స్వాతంత్య్ర పోరాటం లో పాల్గొన్న ఫలితంగా ఆయన ఎప్పటికి తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేయలేకపోయినా రాజకీయ పరిణామాలపై పుస్తకాలు, కరపత్రాలు, జర్నలిస్ట్ వ్యాసాలూ రచించారు.
నరసింహాలు శంకరయ్య అమెరికన్ కాలేజీ, మదురై లో బి ఏ హిస్టరీ పూర్తిచెయ్యబోతూ, అతని ఆఖరు పరీక్షలను 1941 లో రెండు వారాల వ్యవధిలో రాసే అవకాశం పోగొట్టుకున్నారు. “నేను విద్యార్థుల యూనియన్ కు జాయింట్ సెక్రటరీని.” ఈయన క్యాంపస్ లో కవుల సమాజాన్ని స్థాపించారు. తన కాలేజ్లో మంచి ఫుట్బాల్ ఆటగాడు కూడా. బ్రిటిష్ రాజ్యానికి వ్యతిరేకంగా జరిగే పోరాటాలలో ముందుడేవారు. “కాలేజీ రోజుల్లో వామపక్ష భావజాలమున్న వ్యక్తులకు నేను దగ్గరయ్యాను. భారత స్వాతంత్య్రం రాకుండా సమాజం లో మార్పు రాదనీ నమ్మాను.” ఆయనకు 17 ఏళ్ళు ఉన్నప్పుడే భారత కమ్యూనిస్ట్ పార్టీ లో సభ్యుడయ్యారు(అప్పటికే అది నిషేధించబడింది, అందుకే అండర్ గ్రౌండ్ లో పని చేసేవారు).
అమెరికన్ కాలేజీ అనుకూలంగానే ఉండేదని గుర్తు తెచ్చుకున్నారు ఆయన. “మా కాలేజీలో అమెరికన్ డైరెక్టర్, ఇంకొందరు అమెరికన్లు ఫాకల్టీ సభ్యులు ఉండేవారు. మిగిలినవారందరూ తమిళవారే. వారంతా తటస్థంగా ఉండేవారు కానీ బ్రిటిష్ వారికి అనుకూలంగా ఐతే లేరు. విద్యార్థి కార్యకలాపాలకు అనుమతి ఉండేది.” 1941 మదురైలో అన్నామలై యూనివర్సిటీ స్టూడెంట్ అయిన మీనాక్షిని, బ్రిటిష్ వారి పై నిరసన తెలియజేసినందుకు అరెస్టు చేశారని నిరసన సభ జరిగింది. “అప్పుడు మేమొక కరపత్రాన్ని విడుదల చేశాము. మా హాస్టల్ రూమ్ ని తనిఖీ చేశారు. నా స్నేహితుడు నారాయణస్వామి వద్ద కరపత్రం దొరికినందుకు అరెస్ట్ చేశారు. ఆ తరవాత అతని అరెస్టుని ఖండిస్తూ మేము ఇంకో మీటింగ్ ని నిర్వహించాము.








