“మేము ఒక రహస్య మార్గంలో బయటికి తప్పించుకు వెళ్లాం. మరింకేం చేయగలం? కనీసం ఆ మెటీరియల్ మా వద్ద ఉంటే ఇంటి వద్ద కూర్చుని బుట్టలను అల్లి వాటిని సిద్ధం చేసే వాళ్లం,” అని తెలంగాణాలోని కంగల్ గ్రామానికి చెందిన బుట్టల అల్లిక కార్మికులు చెప్పారు. వాళ్లు ప్రయాణించిన రహస్య మార్గమేదో తెలుసా? పోలీసు బ్యారికేడ్లు గానీ, గ్రామ వాసులు ఏర్పరిచిన ముళ్ల కంచెలు గానీ లేనటువంటి ఒక దారి.
ఏప్రిల్ 4వ తేదీన, నెలిగుందరాశి రాములమ్మ అనే మహిళతో పాటు మరో నలుగురు మహిళలు, ఒక పురుషుడు కలిసి కంగల్ గ్రామానికి ఏడు కిలోమీటర్ల దూరంలోని వెల్లిదండుపాడు అనే తండాకు వెళ్లి ఈత చెట్ల ఆకులను సేకరించడానికి గాను, ఉదయం దాదాపు 9 గంటలకు ఆటో ఎక్కారు. వాటితో వాళ్లు బుట్టలను అల్లుతారు. సాధారణంగా ఈ ఆకులను ప్రభుత్వ భూమి నుండి సేకరిస్తారు, లేదా ఏదైనా వ్యవసాయ భూమి నుండి సేకరిస్తే, ఆ భూమిని సాగు చేసే రైతుకు కొన్ని బుట్టలను ప్రతిఫలంగా ఇస్తారు.
కంగల్‌లో బుట్టలను అల్లే కార్మికులు ఎరుకుల సామాజిక వర్గానికి చెందిన వారు, వీరిని తెలంగాణాలో షెడ్యూల్డ్ తెగలుగా వర్గీకరిస్తారు. వీళ్ల బుట్టల అమ్మకానికి మార్చి నుండి మే వరకు గల కాలం ఎంతో ముఖ్యమైనది. ఆ ఆకులు ఎండేందుకు ఈ నెలల్లోని అధిక ఉష్ణోగ్రతలు దోహదపడతాయి.
సంవత్సరంలో మిగిలిన నెలల్లో వాళ్లు సాధారణంగా రైతు కూలీలుగా పని చేసి రోజుకు రూ. 200 సంపాదిస్తారు. డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు ఉండే పత్తి సాగు సీజన్‌లో కొందరు నెల రోజుల పాటు అడపాదడపా రోజుకు రూ. 700-800 వరకు సంపాదించగలుగుతారు. అయితే అది అందుబాటులో ఉన్న పనిని బట్టి ఉంటుంది.
బుట్టలను అమ్మడం ద్వారా వారికి వచ్చే ఆదాయానికి ఈ సంవత్సరం కొవిడ్-19 లాక్‌డౌన్ అడ్డుకట్ట వేసింది.. “డబ్బున్న వాళ్లు తృప్తిగా భోంచేస్తున్నారు. కానీ మా దగ్గర డబ్బు లేదు. అందుకే మేము [ఈత చెట్ల ఆకులను సేకరించేందుకు] వచ్చాం. లేకపోతే ఎందుకు వస్తాం?” అని దాదాపు 70 ఏళ్ల రాములమ్మ అడిగారు.







