నాగిరెడ్డి తమిళనాడులో నివాసముంటారు, కన్నడం మాట్లాడతారు, తెలుగు చదువుతారు. ఒక డిసెంబర్ ఉదయాన, ఆయన్ని కలవటం కోసం మేము కొన్ని కిలోమీటర్లు నడిచివెళ్ళాం. ఆయన ఇల్లు, ఆయన మాతో యథాలాపంగా చెప్పినట్టుగా "అదిగో అక్కడుంది." నిజానికది నీటితో పొంగిపొరలుతున్న సరస్సు దగ్గరలో, పెద్ద చింతచెట్టును దాటి, యూకలిప్టస్ కొండ పైకి ఎక్కి, మామిడి తోటలోకి దిగి, కాపలా కుక్కని, దాని పక్కనే కీచుకీచుమంటున్న కుక్కపిల్లని, పశువుల కొట్టాన్ని దాటుకుని వెళ్తే వస్తుంది.
దేశంలోని ఏ రైతైనా ఎదుర్కొనే అన్ని సాధారణ సమస్యలూ తలనొప్పులతో పాటు, నాగిరెడ్డిని తాను పండించే పంటలనే మార్చేసేలా చేసేస్థాయికి ఆయనని బాధించేది మరొకటి ఉంది. ఆయన మూడు కఠినమైన, భయపెట్టే పాత్రలచే వేటాడబడుతున్నారు. అవి: మొట్టై వాల్, మఖానా, గిరి.
వాటి ఆకారాన్నిబట్టి కూడా ఈ కుర్రాళ్లను తేలికగా తీసుకోకూడదని ఇక్కడి రైతులు తెలుసుకున్నారు. అవి ఒక్కొక్కటీ 4,000, 5,000 కిలోల మధ్య బరువు ఉన్నప్పుడు కాదు. ఈ దోపిడీ ఏనుగుల ఖచ్చితమైన బరువూ ఎత్తులను దగ్గరగా వెళ్ళి తనిఖీ చేయడంలో ఉత్సాహం లేనందుకు స్థానికులను క్షమించవచ్చు.
మేము కృష్ణగిరి జిల్లాలో ఉన్నాం. ఇది తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దులో ఉంది. తేన్కనికోట్టై తాలూకాలోని నాగిరెడ్డి కుగ్రామం, వడ్రపాళైయం, అడవికి గానీ ఏనుగులకు గానీ మరీ దూరంలో ఏంలేదు. మేము కూర్చున్న ఆ ఇంటి సిమెంట్ వరండా, ఆయన పొలాలకు కొన్ని మీటర్ల దూరంలోనే ఉంది. గ్రామస్థులు నాగన్నగా పిలుచుకునే ఆయన వయస్సు 86 సంవత్సరాలు. అత్యంత పోషక విలువలు కలిగిన చిరుధాన్యమైన రాగులను (ఫింగర్ మిల్లెట్) పండించే రైతు. దశాబ్దాలుగా వ్యవసాయంలో జరిగిన ప్రతి మార్పుకీ - అది మంచిది కావచ్చు చెడ్డది కావచ్చు తరచుగా ఉండేట్టు భయంకరమైనదీ కావచ్చు - ఆయన సాక్షి.
"నా చిన్నతనంలో, ఆనై (ఏనుగులు), రాగుల సువాసన వాటిని ఆకర్షించినప్పుడు, ఆ సీజన్‌లో కొన్ని రోజులు మాత్రమే వచ్చేవి." మరి ఇప్పుడు? "అవి తరచుగా వస్తున్నాయి. పంటల్నీ, పండ్లనూ తినడం అలవాటు చేసుకున్నాయి."
అందుకు రెండు కారణాలను నాగన్న తమిళంలో వివరించారు. “1990 తర్వాత, ఈ అడవిలో ఏనుగుల సంఖ్య పెరిగింది. అదే సమయంలో అడవి పరిమాణం, నాణ్యత తగ్గిపోయాయి. కాబట్టి, అవి తమ ఆహారం కోసం ఇక్కడ కనిపిస్తాయి. మీరు ఒక మంచి హోటల్‌కి వెళ్లినప్పుడు దాని గురించి మీ స్నేహితులకు ఎలా చెప్తారో, అవి కూడా వాటి స్నేహితులతో చెబుతాయి.” అంటూ ఆయన నిట్టూర్చారు, నవ్వారు కూడానూ. ఆ వ్యంగ్య పోలిక ఆయన్ని రంజింపజేసింది, నన్ను ఆశ్చర్యపరిచింది.
































