మే 4న హరిందర్ సింగ్ తనతో పాటు పని చేసే పప్పుని, చివరి రెండు శవాలను దహనానికి తయారుచేయమని అడిగినప్పుడు తనతో పాటు పని చేసేవారిని అంత ఆశ్చర్య పరిచాననుకోలేదు. అతను మాటలాడిన పదాలు మామూలుగా లేవు.
“దో లౌన్డే లేటే హుయే హై (ఇద్దరు అబ్బాయిలు పడుకుని ఉన్నారు),” అన్నాడు హరిందర్. ఆ మాటలకు అతనితో పనిచేసేవారు ఆశ్చర్యపోయి, అతని ఉత్సాహానికి ఒక్క పెట్టున నవ్వేశారు. నిగమ్ బోధ్ ఘాట్ వద్ద ఉన్న రద్దీయైన స్మశానవాటిక లో ఉదాసీనంగా సాగే ఈ విషాదమైన పనిలో, ఈ వినోదం కాస్త ఉపశమనాన్ని ఇచ్చింది.
కానీ హరీందర్ నాకు సమాధానం చెప్పుకోవాలని అనుకున్నాడు. అతను తన సహోద్యోగులతో క్రమటోరియం కొలిమివద్ద ఉన్న చిన్న గదిలో రాత్రి భోజనం చేస్తున్నాడు. అతను ఊపిరి తీసుకున్నాడు. ఈ కోవిడ్ మహారోగం మధ్యలో ఊపిరి తీసుకున్న అదృష్టవంతుడు అతను. “మీరు వాటిని శవాలు అంటారు. మేము వాటిని లౌన్డే(బాబులు) అని పిలుస్తాము.” చెప్పాడు.
“ఇక్కడికొచ్చే ప్రతి ఒక్కరు ఎవరికో కొడుకో కూతురో అవుతారు- నాలాగానే,” అన్నాడు పప్పు. “వాళ్ళని కొలిమి వద్దకు తీసుకెళ్లాలంటే బాధగా ఉంటుంది. కానీ మేము వారి ఆత్మ కోసం ఆ పని చెయ్యాలి, కదా.” ప్రతి నెలా నిగమ్ బోధ్ లో - CNG కొలిములలోను, కట్టెల పైనా 200 పైగా శవాలని వారు దహనం చేస్తారు.
ఆ మే 4 న నిగమ్ బోధ్ ఘాట్ లో 35 శవాలను CNG కొలిమిలో కాల్చారు. రెండో వేవ్ ఢిల్లీని తన గుప్పెట్లో నలిపేస్తున్నవేళ, ఏప్రిల్ 1 నుంచి మొదలైన సగటు రోజు లెక్కతో చూస్తే ఈ రోజు తక్కువ శవాలు వచ్చినట్టు. కానీ మహారోగానికి ముందు ఈ దహనాస్థలం లోని CNG కొలిములు నెలకు 100 శవాలనే కాల్చేవి.
ఘాట్ ప్రవేశద్వారం వద్ద, యమునా నది ఒడ్డున, ఢిల్లీ లోని కాశ్మీర్ గేట్ వద్ద, ఒక పెద్ద కుడ్యచిత్రం ఉంది. “నన్ను ఇక్కడికి తీసుకు వచ్చినందుకు కృతఙ్ఞతలు. ఇక పై నాది ఒంటరి పయనం.” అని రాసి ఉంది. కానీ కోవిడ్ 19, ఏప్రిల్ మే నెలలలో రాజధాని మీద స్వైరవిహారం చేసినప్పుడు, చనిపోయినవారు ఒంటరిగా వెళ్లిపోలేదు. మార్గంలో వారికి స్నేహితులు దొరికే ఉంటారు.














