2019లో బకింగ్‌హామ్ కెనాల్ ప్రాంతంలో ప్రయణిస్తుండగా నేనామెను మొదటిసారిగా గమనించాను. ఒక గ్రీబ్ పక్షిలాగా ఆ కాలువలోకి దూకిన ఆమె, నీటి అడుగున ఈత కొట్టడంలో ఆమె చూపించిన నేర్పు నా దృష్టిని ఆకర్షించాయి. నదీగర్భంలో ఉండే గండ్ర ఇసుకలోకి తన చేతులను వేగంగా పోనిచ్చి, అక్కడ ఉన్న అందరికంటే కూడా వేగంగా ఆమె రొయ్యలను పట్టుకుంటారు.
గోవిందమ్మ వేలు తమిళనాడులో షెడ్యూల్డ్ తెగగా జాబితా చేయబడిన ఇరుళర్ సముదాయానికి చెందినవారు. ఆమె చిన్న బాలికగా ఉన్నప్పటి నుండి రొయ్యలను పట్టుకోవడానికి చెన్నై సమీపంలోని కొసస్తలైయాఱు నదిలో తిరుగుతూనేవున్నారు. ఇప్పుడు 70ల మలివయసులో చూపు మందగించి, గాయాలతో బాధపడుతున్నప్పటికీ, భయంకరమైన కుటుంబ ఆర్థిక పరిస్థితులు ఆమె ఈ పనిని కొనసాగించేలా బలవంతం చేస్తున్నాయి.
చెన్నై ఉత్తర భాగంలోని కొసస్తలైయాఱు నది పక్కనే ఉన్న బకింగ్‌హామ్ కాలువలో ఆమె తన పనిలో మునిగివుండగా నేనీ వీడియోను చిత్రీకరించాను. రొయ్యలను పట్టుకోవడానికి కాలువలోకి దూకుతూనే, మధ్య మధ్య తన జీవితం గురించీ, రొయ్యలను ఇలా పట్టుకోవటమే తనకు తెలిసిన ఏకైక విద్య ఎలా అయిందో దానిగురించీ ఆమె మాట్లాదుతున్నారు.
గోవిందమ్మ జీవితం గురించి మరింత తెలుసుకోవడానికి ఇక్కడ చదవండి.
అనువాదం: సుధామయి సత్తెనపల్లి