తొమ్మిదేళ్ళ చంద్రికా బెహెరా దాదాపు రెండేళ్లుగా పాఠశాలకు దూరమయింది. బారాబంకీ గ్రామంలో 1 నుండి 5వ తరగతి వరకు చదవడానికి బడికి వెళ్ళవలసిన 19 మంది విద్యార్థులలో ఈమె కూడా ఉంది. కానీ ఈ పిల్లలు 2020 నుండి సక్రమంగా బడికి వెళ్లడం లేదు. తన తల్లి తనను బడికి పంపటంలేదని చంద్రిక చెప్పింది.
బారాబంకీ గ్రామానికి 2007లో సొంత పాఠశాల వచ్చింది, కానీ ఒడిశా ప్రభుత్వం 2020లో దానిని మూసివేసింది. ప్రాథమిక పాఠశాల పిల్లలను, గ్రామానికి చెందిన చంద్రిక వంటి సంథాల్, ముండా ఆదివాసీ పిల్లలను దాదాపు 3.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న జాముపసి గ్రామంలోని పాఠశాలలో చేర్పించాలని అధికారులు చెప్పారు.
“పిల్లలు రోజూ అంతలేసి దూరాలు నడవలేరు. అదీగాక, అంత దూరం నడిచే క్రమంలో వాళ్ళంతా ఒకరితో ఒకరు దెబ్బలాడుకుంటున్నారు,” అని చంద్రిక తల్లి మామీ బెహెరా ఎత్తి చూపారు. “మేం పేద కూలీలం. మేం పనులే వెతుక్కోవాలా, లేదంటే పిల్లల వెంట రోజూ బడికి వెళ్ళి, వాళ్ళను తిరిగి తీసుకురావాలా? అధికారులు మా ఊరి బడిని తిరిగి తెరవాలి,” అని ఆమె అన్నారు.
అప్పటి వరకు తన చిన్న బిడ్డలాంటి 6 నుండి 10 సంవత్సరాల వయస్సు గల పిల్లలు చదువు లేకుండా ఉండాల్సిందేనని ఆమె నిస్సహాయంగా భుజాలు ఎగరేశారు. ఇక్కడ జాజ్‌పూర్ జిల్లాలోని దానగడి బ్లాక్‌లో ఉన్న అడవిలో పిల్లలను ఎత్తుకుపోయేవాళ్ళు ఉండవచ్చని కూడా 30ల వయసులో ఉన్న ఈ తల్లి భయపడుతున్నారు.
తన కొడుకు జోగి కోసం మామి ఒక ఉపయోగించిన సైకిల్‌ను ఏర్పాటు చేయగలిగారు. జోగి అక్కడికి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. 7వ తరగతి చదువుతోన్న పెద్ద కూతురు మోనీ జముపసిలోని పాఠశాలకు నడుచుకుంటూ వెళ్తుంది. అందరిలోకీ చిన్నదైన చంద్రిక ఇంట్లోనే ఉండాల్సి వస్తోంది.
"మా తరమంతా మా ఒళ్ళు గుల్లయ్యేవరకూ నడిచింది, ఎక్కింది, పని చేసింది. ఇప్పుడు మా పిల్లలకు కూడా అదే జరగాలా?” అని మామి అడుగుతున్నారు.





















