సమీరుద్దీన్ షేక్ రోజుకి రెండుసార్లు తన సైకిల్‌ని జనాలతో క్రిక్కిరిసిపోయి ఉండే పాత నగరపు సందుగొందుల గుండా పోనిస్తుంటారు. తన ఇల్లు ఉన్న జుహాపురా లోని ఫతేహ్‌వాడి నుంచి తాను పనిచేసే తాజ్ ఎన్వలప్స్ వరకు ఉన్న పదమూడు కిలోమీటర్ల దూరం రావడానికీ పోవడానికీ ఒక్కో వేపుకు గంట సమయం పడుతుందాయనకు. బైక్ హై పర్ నహీ లే జాతా, క్యోంకి పెట్రోల్ నహీ పోసాతా(నా దగ్గరున్న బైక్‌ను నేను తీసుకువెళ్ళను. పెట్రోల్ ఖర్చును భరించే స్తోమత నాకు లేదు)," అంటారు ముప్పైఆరేళ్ల షేక్, తన సైకిల్‌కి స్టాండ్ వేస్తూ.
షేక్ పని రోజులన్నీ ఖరియా అని పిలిచే ప్రాంతంలో ఒక వాణిజ్య సముదాయం బేస్‌మెంట్‌లో ఉండే 10x20 అడుగుల కొలతలున్న గదిలో మొదలై అక్కడే ముగుస్తాయి. తనవంటి మరో పదిమందితో కలిసి సంచికవర్లు తయారుచేయడం ఆయన పని. ఒక్క రోజులో ఆరు నుంచి ఏడు వేల సంచికవర్లు తయారుచేయగలిగిన నేర్పరితనం అతనిది.
సంచికవర్లను తయారు చేయడం కనపడేంత సునాయాసమైన పనేం కాదు. "సంచికవర్ల తయారీలో నైపుణ్యం సంపాదించడానికి సంవత్సరంన్నర నుంచి రెండేళ్ళ వరకూ పడుతుంది," అంటారు సమీరుద్దీన్. "ఉస్తాద్ (పనిలో నైపుణ్యమున్న సీనియర్, గురువు) నీ పని నాణ్యతను మెచ్చి, అనుమతిస్తే గాని నువ్వు సొంతంగా సంచికవర్లు తయారుచేయలేవు. అప్పటికిగాని సొంతంగా డబ్బులూ సంపాదించలేవు." అని వివరిస్తారాయన.
ఈ పనిలో నాణ్యత అంటే వేగం, నిర్దిష్టత, నేర్పు, పనిముట్లపై ఉన్న పట్టు- వీటన్నిటి కలబోత. కత్తిరించడం, రంధ్రాలు చేయటం - యంత్రాలు చేసే ఈ రెండు పనులు మినహా, మిగతా పనులన్నీ చేతులతో చేసేవే.
యంత్రాలన్నీ దుకాణాల యజమానులే వాడతారు; పెద్దపెద్ద కాగితపు షీట్లని తీసుకొచ్చి ముందే నిర్ణయించిన కొలతల్లోకి కత్తిరించి, అపుడు ఒక ప్రత్యేకమైన అచ్చులో ఉంచి వివిధ కొలతలతో సంచికవర్లను తయారుచేస్తారు. పనివాళ్ళు ఒక్కో తడవకు వందేసి కాగితాలను లెక్కపెట్టి వాటిని మడతపెట్టడం, అంటించడం, ముద్రవేయడం, ఆఖరికి అన్నిటిని కట్టలుకట్టడం వరకు చేస్తారు.
































