చిత్రను కలివక మూడేళ్ళ ముందే ముత్తురాజా తన రెండు కళ్ల దృష్టినీ కోల్పోయాడు. అతనికి ఆ రోజు తేదీ, సమయం ముద్రించుకుపోయాయి. జనవరి 13, 2013న సంక్రాంతికి ఒక రోజు ముందు, సాయంత్రం ఏడు గంటలకు, ఇక ఏమి చూడలేకపోతున్నాడన్న విషయాన్ని అర్థం చేసుకుని, అతను విపరీతంగా ఆందోళనపడిన సమయమది.
ఆ తరవాత కొన్నేళ్లు అతను చాలా కష్టపడ్డాడు. ఎక్కువగా ఇంట్లోనే ఉండిపోయేవాడు- కోపంతో, పిచ్చెక్కిపోయి, ఏడుస్తూ- చనిపోవాలన్న ఆలోచనలు కూడా వచ్చేవి. చిత్రని కలిసే సమయానికి అతనికి 23 ఏళ్ళు. తనకు తానే ఒక జీవఛ్ఛవంలా అనిపించేవాడు. ఆమె వలెనే అతనికి కొత్త జీవితం అందింది, అని మెత్తగా చెబుతాడు.
దృష్టిని కోల్పోక ముందు ముత్తురాజా కొన్ని దురదృష్టవంతమైన సంఘటనలు ఎదుర్కొనవలసి వచ్చింది. అతనికి ఏడేళ్లు ఉన్నప్పుడు, అతను, అతని చెల్లెలు వాళ్ళ పొలం లో గులాబీ మొక్కలు నాటుతున్నారు. వారి కుటుంబం గులాబీలు పూయించి వాటిని అమ్మేది. ఒక చిన్న తప్పు- పెకిలించి అందించిన మొక్కని అతని చేతినించి అతని చెల్లి సరిగ్గా అందుకోలేదు, అందువలన ఆ మొక్క మొహానికి విసురుగా తగిలి, ముళ్ళు అతని కళ్ళలోకి గుచ్చుకుపోయాయి.
ఆ తర్వాత ఆరు ఆపరేషనలు జరిగాయి. అతని ఎడమ కంటికి కొంత వరకు దృష్టి వచ్చింది. అతని కుటుంబం 3 సెంట్ల భూమిని అమ్మి అప్పుల్లో కూరుకుపోయారు. ఆ తరవాత కొంత కాలానికి ఒక బైక్ ఆక్సిడెంట్ వలన కనిపించే కన్నుకు మళ్లీ దెబ్బ తగిలి అతను ఆ కొంచెం దృష్టిని కూడా కోల్పోయాడు. స్కూల్, చదువు చాలా కష్టమైపోయాయి ముత్తురాజా కు- అతనికి బోర్డు సరిగ్గా కనిపించేది కాదు, దాని పై తెల్ల అక్షరాలూ కనిపించేవి కావు. కానీ టీచర్ల సాయం తీసుకుని ఎలాగోలా పదవతరగతి వరకు చదువుకోగలిగాడు.
ఆ జనవరి 2013 రోజున ఇంటి ముందున్న వీధిలో ముత్తురాజా తలకు ఒక ఐరన్ రాడ్ కొట్టుకుంది. ముత్తురాజా లోకం మొత్తం చీకటైంది. చిత్రను కలిశాకే అతని జీవితంలో వెలుగు, ప్రేమ తిరిగివచ్చాయి.