అది సెప్టెంబర్ నెల మొదటి వారం. ఘోరామారా రేవు కోలాహలంగా వుంది. ఆడ, మగ, పిల్లలు, పశువులతో సహా అందరూ త్వరత్వరగా పడవ దిగి తమ రోజువారీ పనులలోకి వెళ్ళడానికి హడావుడి పడుతున్నారు. అలలు ఎగసిపడే ఉప్పెన సమయంలో వేరే చోట - తరచుగా బంధువుల దగ్గర - తలదాచుకున్న వాళ్ళందరూ నీరు తగ్గిపోగానే తిరిగి ద్వీపం లోని తమ ఇళ్లకు చేరుకుంటున్నారు. కనీసం నెలకు రెండుసార్లు అటూ ఇటూ తిరిగే ఆ పడవ (ఫెర్రీ) ప్రధాన భూభాగమైన కాక్‌ద్వీపం నుండి సుందరవనాలలోని డెల్టాప్రాంత ద్వీపానికి చేరుకోవడానికి 40 నిమిషాల సమయం పడుతుంది. ఘోరామారా పశ్చిమ బెంగాల్, దక్షిణ 24 పరాగణాల జిల్లాలోని ఒక చిన్న ద్వీపం. కేవలం నెలకు రెండుసార్లు సాగే ఈ ప్రయాణం, వారి చిన్న ద్వీపంలో జీవించడానికి ఘోరామారా ప్రజలు చేస్తున్న సుదీర్ఘ జీవన పోరాటాన్ని అర్థంచేయించలేదు.
తరచుగా వచ్చే తుఫానులు, పెరుగుతున్న సముద్ర మట్టం, భారీ వర్షాలు - ఇటువంటి వాతావరణ మార్పులన్నీ కలిసి ఘోరామారా ప్రజల జీవనాన్ని కష్టతరం చేసాయి. దశాబ్దాల వరదలు, భూమి కోతల వల్ల వారి మాతృభూమి హుగ్ల్లీ నదీ ముఖంలో ఒక తేలియాడే భూభాగంగా మారిపోయింది.
మే నెలలో వచ్చిపడ్డ యాస్ తుఫాను వల్ల ఘోరంగా నష్టపోయిన సుందరవన ప్రాంతాల్లో సాగర్ బ్లాక్ లోని ఘోరామారా ఒకటి. మే 26 న, అధికమైన ఆటుపోట్లతో తుఫాను కట్టలు తెంచుకుని కేవలం 15-20 నిమిషాలలోనే ద్వీపాన్ని ముంచెత్తింది. అంతకుముందు అంఫాన్ (2020), బుల్బుల్ (2019) తుఫానుల ప్రభావాన్ని భరించిన ద్వీపవాసులు మళ్లీ ఈ విధ్వంసాన్ని ఎదుర్కొన్నారు. వారి ఇళ్లు కూలిపోయాయి. నిల్వపెట్టుకున్న వరి, తమలపాకు పంటలు, పొద్దుతిరుగుడు పొలాలు మొత్తం కొట్టుకుపోయాయి.
తుపాను బీభత్సానికి ఖాసిమారా ఘాట్ సమీపంలోని అబ్దుల్ రవూఫ్ ఇల్లు ధ్వంసమైంది. "మాకు ఆ మూడు రోజులు ఆహారం లేదు వర్షపునీటితో బతికాం.ప్లాస్టిక్ షీట్లే మమ్మల్ని కాపాడాయి." అని అక్కడికి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొల్‌కతాలో టైలర్‌గా పనిచేసే రవూఫ్ చెప్పారు. అతనూ, అతని భార్య అనారోగ్యానికి గురైనప్పుడు, "మాకు కోవిడ్ వచ్చిందేమోనని అందరూ అనుమానించారు. చాలా మంది గ్రామం నుండి వెళ్లిపోయారు," అని అతను చెప్పారు. "అనారోగ్యం కారణంగా మేము సురక్షిత ప్రాంతానికి వెళ్లలేకపోయాము”. బ్లాక్ డెవలప్మెంట్ అధికారి చెప్పిన తరవాత మాత్రమే రవూఫ్‌కీ, అతని భార్యకీ వైద్య సహాయం అందింది. "బిడిఒ మమ్మల్ని ఎలాగైనా చేసి కాక్‌ద్వీపం చేరుకోమన్నాడు. అక్కడినుంచి ఆయన అంబులెన్సు ఏర్పాటు చేశాడు. మాకు మొత్తం 22వేల రూపాయలు ఖర్చయ్యింది ( వైద్యం కోసం)". అప్పటి నుంచి రవూఫ్, అతని భార్య ద్వీపం లోని ఒక ఆశ్రయంలో నివసిస్తున్నారు.
ఇళ్లు ధ్వంసమైన పలువురిని తాత్కాలిక ఆశ్రయాలకు తరలించారు. మందిర్‌తలా గ్రామస్థులకు ద్వీపంలోకల్లా ఎత్తైన ప్రదేశం అయిన మందిర్‌తలా బజార్ (బజార్) సమీపంలోని ట్యాంక్ గ్రౌండ్‌లో ఆశ్రయం ఏర్పాటుచేశారు. వీరిలో కొందరు సమీపంలోని ఇరుకైన రహదారిపై నివాసం(క్యాంప్) ఏర్పరుచుకున్నారు. ద్వీపంలోని హాత్‌ఖోలా, చూన్‌పురి, ఖాసిమారా ప్రాంతాల నుండి, 30 కుటుంబాలు ఘోరామారాకు దక్షిణాన ఉన్న సాగర్ ద్వీపంలో తాత్కాలికంగా ఆశ్రయం పొందాయి. వీరికి పునరావాసం కోసం అక్కడ భూమిని కేటాయించారు.



























