"నేను చనిపోయినా ఫర్వాలేదు, కాని మనం బిల్లు మాత్రం భరించలేము" అని చనిపోయే రెండు రోజుల ముందు హరిశ్చంద్ర ధావరే తన భార్య జయశ్రీతో చెప్పారు. కోవిడ్ -19 కారణంగా 48 ఏళ్ల జర్నలిస్ట్ ఆరోగ్యం క్లిష్టంగా మారింది, అందుకని అతన్ని వెంటిలేటర్ మీద ఉంచారు.
అప్పుడు కూడా, అతని ఆందోళన తన సొంత జీవితం కోసం కాదు. ఆసుపత్రి బిల్లుల గురించే! "అతను నాతో దెబ్బలాడి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇంటికి వెళ్ళిపోదామని పట్టుబట్టాడు." అని 38 ఏళ్ల జయశ్రీ గుర్తు చేసుకుంది.
2021 మార్చి చివరలో కరోనా వైరస్ హరిశ్చంద్రకు సోకినప్పుడు జర్నలిస్టుగా ఇరవై సంవత్సరాల అతని అనుభవం అతని అక్కరలోకి రాలేదు. పైగా అతని ఉద్యోగమే అతనిని ప్రమాదంలోకి తోసింది.
మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ జిల్లాలో వార్తా సంస్థల కోసం 2001 ఆరంభం నుండి విలేకరిగా పనిచేస్తున్న హరిశ్చంద్ర చివరిగా మరాఠీ దినపత్రిక రాజధర్మ లో పనిచేశాడు. "అతను కోవిడ్ -19 యొక్క రెండవ తరంగంపై పై నివేదికలు పంపుతున్నాడు. తరచూ ప్రెస్ కాన్ఫరెన్స్ లకు వెళ్లడం, ఫీల్డ్ లో తిరగడం చేసేవాడు”అని జయశ్రీ చెప్పారు. "అతను ఇంటి నుంచి బయటికి అడుగుపెట్టిన ప్రతిసారీ మేము కంగారు పడుతూనే ఉన్నాము . అతనికి రక్తపోటు, చక్కెర వ్యాధి [డయాబెటిస్] ఉన్నాయి. కానీ తను పని చేయవలసి ఉంటుందని చెప్పాడు.”
మార్చి 22 న, ధావరే కు ఒళ్లు నొప్పులు, జ్వరం తోపాటు కోవిడ్ లక్షణాలు కనిపించడం మొదలయ్యాయి. "అతని ఆరోగ్యం మెరుగుపడకపోయేసరికి, మేము అతన్ని పట్టణంలోని సివిల్ ఆసుపత్రికి తీసుకువెళ్ళాము" అని జయశ్రీ చెప్పారు. పరీక్షలో కోవిడ్ పాజిటివ్ అని వచ్చాక అతనిని ఆసుపత్రిలో చేర్చుకున్నారు. "అక్కడ పెద్దగా సౌకర్యాలు లేవు, ఆరోగ్యం లో మార్పు కూడా ఏమీ లేదు" అని చెప్పింది జయశ్రీ. అందుకని మార్చి 31 న అతనిని 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న సోలాపూర్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాలని అతని కుటుంబం నిర్ణయించింది.
అక్కడ ఆరు రోజుల ఉన్న తర్వాత , ఏప్రిల్ 6న ధావరే చనిపోయాడు.
ఆసుపత్రి రూ. 4 లక్షలు బిల్లు వేసింది. మరణించే సమయానికి హరిశ్చంద్ర నెలసరి జీతం రూ. 4000. అతను మరణించిన తరువాత, జయశ్రీ తన బంగారు నగలను అమ్మి లక్ష రూపాయిలు తెచ్చింది. "బంధువులు నాకు కొంత మొత్తాన్ని అప్పుగా ఇచ్చారు. ఉస్మానాబాద్‌లోని జర్నలిస్టులు [రూ. 20,000] ఇచ్చారు. ఆ డబ్బులు కొంచెం సహాయపడ్డాయి,” అని ఆమె చెప్పింది. "కానీ మా ఇంట్లో సంపాదించే ఆ ఒక్కడిని కోల్పోయాము, ఈ అప్పులని ఎలా తిరిగి చెల్లించాలో నాకు తెలియదు." అంది.
హరిశ్చంద్ర సంవత్సర ఆదాయం సుమారు లక్ష రూపాయిలు. ఇది అతని జీతంతో పాటు అడ్వేర్టైస్మెంట్ల మీద 40 శాతం కమిషన్ కలుపుకున్న తరవాత వచ్చిన సంఖ్య. జయశ్రీ తన ఇంటి నుండే బిస్కెట్లు, చిప్స్ మరియు గుడ్లు అమ్ముతూ ఒక చిన్న స్టోర్ నడుపుతోంది. "నాకు దాని మీద పెద్ద సంపాదన అంటూ ఏమి ఉండదు.” అని చెప్పింది. ఆమె బ్యూటీ పార్లర్‌ను కూడా నడుపుతుంది, అయితే మహమ్మారి కారణంగా గత ఏడాదిన్నరగా కస్టమర్లు లేరు.
నవ్ బౌద్ధ సమాజానికి చెందిన ధావరే కుటుంబం, మహాత్మా జ్యోతిరావు ఫులే జన్ ఆరోగ్య యోజన (MJPJAY) అనే ఆరోగ్య భీమాకు అర్హులు - రాష్ట్ర ప్రభుత్వ పథకం కింద లక్ష కన్నా తక్కువ సంవత్సర ఆదాయాన్ని కలిగి ఉన్న కుటుంబాలకు రూ. 2.5 లక్షల వరకు వైద్య ఖర్చులు అందిస్తుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం చేత గుర్తింపు పొందిన జర్నలిస్టులకు కూడా వర్తిస్తుంది. ఈ పథకం కింద, ఆసుపత్రి రోగికి చికిత్స చేస్తుంది, కాని రాష్ట్ర ప్రభుత్వానికి బిల్లులు ఇస్తుంది.
ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవడానికి హాస్పిటల్ హరిశ్చంద్రను వెయిటింగ్ లిస్టులో పెట్టింది. కరోనా వైరస్ బారిన పడి, తాను కూడా అనారోగ్యంతో బాధపడుతున్న జయశ్రీ, ఉస్మానాబాద్ సివిల్ హాస్పిటల్ లో మూడు రోజులు గడిపింది. “ఈ సమయంలో అతనికి చికిత్స చేయమని మేము వారికి చెప్పాము. కానీ దరఖాస్తు ముందుకు వెళ్లకముందే అతను మరణించాడు. వారు కావాలనే ఆలస్యం చేశారని నేను అనుకుంటున్నాను." అన్నది జయశ్రీ. హరిశ్చంద్ర మరణించిన రోజు జయశ్రీ ఆసుపత్రి నుంచి విడుదలయ్యారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో కోవిడ్ -19 యొక్క రెండవ వేవ్ ప్రారంభమైనప్పటి నుండి, దేశవ్యాప్తంగా జర్నలిస్టుల భద్రత, ముఖ్యంగా ఫీల్డ్ రిపోర్టర్స్ గురించిన సమస్యను లేవనెత్తారు. కేంద్ర ప్రభుత్వం జర్నలిస్టులను ఫ్రంట్‌లైన్ కార్మికులుగా గుర్తించడం లేదు గాని, ఒడిశా, తమిళనాడు, కర్ణాటక, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్ వంటి రాష్ట్రాలు జర్నలిస్టులను ఈ విభాగంలో చేర్చి వారికి ప్రాధాన్యత ఇచ్చి టీకాలు వేస్తున్నాయి.
మహారాష్ట్రలో, రాష్ట్ర ప్రభుత్వానికి నిరసనలు మరియు విజ్ఞప్తులు ఉన్నప్పటికీ - కొంతమంది క్యాబినెట్ మంత్రులు కూడా సమర్ధించినప్పటికీ - ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే జర్నలిస్టులను ప్రాధాన్యతా విభాగంలో చేర్చలేదు.
మహారాష్ట్రలోని దాదాపు 8,000 మంది జర్నలిస్టుల యూనియన్ అయిన మరాఠీ పత్రాకర్ పరిషత్ యొక్క చీఫ్ ట్రస్టీ S.M. దేశ్ముఖ్, "ఆగస్టు 2020 మరియు మే 2021 మధ్యకాలంలో రాష్ట్రంలోని 132 మంది జర్నలిస్టులు మరణించారు." కానీ ఈ సంఖ్య సాంప్రదాయిక అంచనా ప్రకారం మాత్రమే తెలిసింది. గ్రామీణ ప్రాంతాల్లో మరణించిన విలేకరుల జాబితాలో అంతగా తెలియని స్థానిక వార్తా సంస్థల విలేకరుల వివరాలు లేవు, అని గ్రామీణ విలేకరులు అంటున్నారు.
"గ్రామీణ ప్రాంతాల నుండి కొన్ని కేసుల సమాచారం నాకు చేరి ఉండకపోవచ్చు" అని దేశ్ముఖ్ అంగీకరించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,000 మంది జర్నలిస్టులు - వారందరూ ఎంపిపి సభ్యులు కాదు - కోవిడ్ -19 బారిన పడ్డారని ఆయన చెప్పారు. "అనేక సందర్భాల్లో, వారు కోలుకున్నప్పటికీ, వారి కుటుంబ సభ్యులు మరణించారు."
మే 11 న, మహారాష్ట్ర వ్యాప్తంగా 90 మంది జర్నలిస్టులు ఆన్‌లైన్ సమావేశానికి హాజరయ్యారు. కోవిడ్ -19 చిన్న పట్టణాలు మరియు గ్రామాలలో వ్యాపించడంతో, గ్రామీణ ప్రాంతాల్లోని జర్నలిస్టుల భద్రత ఇప్పుడు ఎక్కువ ఆందోళన కలిగిస్తుంది, ఎందుకంటే గ్రామీణ ప్రాంతం లో ఉండే వీరికి, కొంత దూరం ప్రయాణిస్తే తప్ప మంచి ఆరోగ్య సంరక్షణ అందుబాటులో ఉండకపోవచ్చు.
భారతదేశంలో కోవిడ్ -19 కారణంగా జర్నలిస్టుల మరణాలపై, న్యూ ఢిల్లీ కి చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ పర్సెప్షన్ స్టడీస్ జరిపిన పరిశోధనల ప్రకారం, ఏప్రిల్ 1 2020 నుండి మే 12 2021 మధ్య సంభవించిన 219 మరణాలలో 138 మెట్రోయేతర ప్రాంతాలలో ఉన్నాయి.
గ్రామీణ భారతదేశంలో జర్నలిస్టులు ఎటువంటి గుర్తింపు లేకుండా తక్కువ జీతం కోసం కష్టపడతారు. వారిని నిర్లక్ష్యం చేస్తూనే ఉన్నారని ఉస్మానాబాద్‌లోని 37 ఏళ్ల జర్నలిస్ట్ సంతోష్ జాదవ్ చెప్పారు. "జర్నలిస్టులు [ప్రజాస్వామ్యం యొక్క] నాల్గవ స్తంభంగా, కోవిడ్ యోధులుగా కీర్తించబడ్డారు. జర్నలిజాన్ని ఒక ముఖ్యమైన సేవ అని కూడా పిలుస్తారు, కాని వ్యాక్సిన్ల కోసం మాకు ప్రాధాన్యత లభించదు ”అని ముంబై లో ప్రధాన కార్యాలయం ఉన్న మరాఠీ టెలివిజన్ ఛానల్ లో విలేకరిగా పనిచేసే జాదవ్ చెప్పారు. “మేము అందరిలోనూ అవగాహన పెంచాలి అనుకుంటారు. మేము సరైన సమాచారాన్ని ప్రసారం చేయాలని అనుకుంటారు. మేము ఇతరుల ఆందోళనలను తెలియజేస్తాము. కానీ మా జర్నలిస్టుల ఆందోళనలను మాత్రం ఎవరూ వినరు.” అన్నారు.
జాదవ్ వంటి జర్నలిస్టుల పరిస్థితి దారుణంగా ఉంది. “మీరు ముంబై లేదా ఢిల్లీ లో ఉంటే, మీ ఉనికిని గుర్తిస్తారు. ఈ కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో తమ విలేకరులను రక్షించడానికి న్యూస్ ఛానెల్స్ గాని పేపర్లు గాని ఏమి చేశాయి? ఎంతమంది సంపాదకులు తమ విలేకరులకు భరోసా ఇచ్చారు? ప్రాధాన్యత ఆధారంగా వారి టీకాల కోసం ఎంతమంది ప్రచారం చేశారు? ” అని అతను అడుగుతాడు. "గ్రామీణ ప్రాంతాల్లోని విలేకరులకు మంచి జీతం లభించదు. చనిపోతే వారి పిల్లలు ఏమవుతారు? ” అని గట్టిగా ప్రశ్నిస్తాడు.
కోవిడ్ -19 చిన్న పట్టణాలు మరియు గ్రామాలలో వ్యాపించడంతో, గ్రామీణ ప్రాంతాల్లోని జర్నలిస్టుల భద్రత ఇప్పుడు ఎక్కువ ఆందోళన కలిగిస్తుంది, ఎందుకంటే కొంత దూరం ప్రయాణిస్తే తప్ప వీరికి మంచి ఆరోగ్య సంరక్షణ అందుబాటులో ఉండకపోవచ్చు
ధావరే యొక్క 18 ఏళ్ల కుమార్తె విశాఖ 12 వ తరగతి చదువుతోంది. ఆమె డాక్టర్ కావాలని అనుకుంటుంది, కానీ ఇప్పుడు అది సాధ్యమో కాదో తెలీదు. "నేను ఆమె చదువుకయ్యే ఫీజును భరించలేను" అని విశాఖ ఎదురుగానే ఆమె తల్లి జయశ్రీ చెప్పింది.
విశాఖ (కవర్ ఫోటోలో, అద్దాలు ధరించి ఉన్నఅమ్మాయి) తన తండ్రి చనిపోయే నాలుగు రోజుల ముందు అతను వీడియోకాల్ లో బాగా మాట్లాడాడని గుర్తు చేసుకుంది. "ఏప్రిల్ 2 అతని పుట్టినరోజు," అని ఆమె చెప్పింది. "నేను అతనికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాను. నాన్న నన్ను నా చదువు మీదే దృష్టి పెట్టమని చెప్పాడు. తను చుట్టూ లేకపోయినా పుస్తకాల మీద నుండి నా దృష్టి మరల్చవద్దని చెప్పాడు. నేను వీలైనంత వరకు చదువుకోవాలని ఆయన కోరుకున్నారు.”
విశాఖని చదివించాలి, అంతేగాక హాస్పిటల్ బిల్లు చెల్లించడానికి తీసుకున్న అప్పులు చెల్లించాలి, అని జయశ్రీ ఆందోళన పడుతోంది. "నా బంధువులు డబ్బును తిరిగి ఇవ్వమని ఇంకా ఇబ్బంది పెట్టడం లేదు. కానీ రోజులు చాలా చెడ్డగా ఉన్నాయి. ప్రతి ఒక్కరూ డబ్బుల కోసం కష్టపడుతున్నారు" అని ఆమె చెప్పింది. “నేను నా అప్పులన్నీ తిరిగి చెల్లించాలి, కాని ఎలా చెల్లించాలో నాకు తెలియదు. నేను ఒక్కదాన్నే చూసుకోవాలి.” భారంగా అంది జయశ్రీ.
కొంతమంది ఉస్మానాబాద్ జర్నలిస్టులు కుటుంబాన్ని అప్పుల్లో ముంచెత్తడం కన్నా పని మానేయడమే మంచిది అనుకుంటున్నారు.
ఫిబ్రవరిలో రెండవ కోవిడ్ వేవ్ ప్రారంభమైనప్పటి నుండి జాదవ్, బయటకు వెళ్ళలేదు. అతనికి ఆరు, నాలుగు ఏళ్ళ పిల్లలు ఇద్దరున్నారు. 2020 లో మొదటి వేవ్ సమయంలో ఫీల్డ్ నుండి రిపోర్టింగ్ చేసి అతను చాలా పెద్ద మూల్యమే చెల్లించాడు. "నా తల్లి నా కారణంగా మరణించింది," అని ఆయన చెప్పాడు. "నాకు జూలై 11 న కోవిడ్ పరీక్షలో పాజిటివ్ వచ్చింది . ఆ తర్వాత నుంచి మా అమ్మకు వ్యాధి సోకింది. నేను కోలుకున్నాను, కానీ ఆమె కోలుకోలేకపోయింది . ఆమె అంత్యక్రియలకు కూడా నేను లేను. ఇప్పుడు ఇక బయటకు వెళ్ళడానికి నాకు ధైర్యం లేదు. ” అతను ఉస్మానాబాద్ జిల్లాలోని వివిధ ప్రాంతాలలో తన కున్న పరిచయాల ద్వారా వీడియోలు సేకరించి పంపుతున్నాడు. “నేను ఒక ముఖ్యమైన ఇంటర్వ్యూ కోసమో లేక కెమెరా తో పని ఉంటేనో తప్ప బయటకు వెళ్ళను.” అని చెప్పాడు.
కానీ ముప్ఫయితొమ్మిదేళ్ళ దాదాసాహెబ్ బాన్, స్పాట్ నుండి రిపోర్టింగ్ చేయడానికి ఇష్టపడ్డాడు. బీడ్ జిల్లాలోని అష్టి తాలూకా లోని కసరి గ్రామానికి చెందిన ఈ ప్రింట్ జర్నలిస్ట్, జిల్లాలోని మరాఠీ దినపత్రిక లోకాషా కోసం పని చేసేవారు. అతను తన నివేదికల సమాచారం కోసం ఇతరుల వద్దకు వెళ్లడం లేదు.
"అతను ఆసుపత్రులు, పరీక్షా కేంద్రాలు, ఇంకా వేరే ప్రదేశాలకు వెళ్లి అక్కడి స్థానిక సమస్యల గురించి వ్రాసాడు. మార్చి చివరిలో అతను కొత్త వేవ్ గురించి నివేదించేటప్పుడు అతనికి వైరస్ సోకింది." అని అతని ముప్ఫయి నాలుగేళ్ల అతని భార్య మీనా, చెప్పింది.
బాన్ కుటుంబం అతనిని కసరి నుండి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న అహ్మద్ నగర్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్ళింది. “అయినా అతని ఆరోగ్యం మెరుగుపడలేదు” అని మీనా చెప్పింది. "అతని ఆక్సిజన్ స్థాయి 80 కి పడిపోయింది. అలా తగ్గిపోతూనే ఉంది."
నాలుగు రోజుల తరువాత, దీర్ఘకాలిక వ్యాధులేవీ లేని బాన్, కోవిడ్ -19 కి లొంగిపోయాడు."ఆసుపత్రి ఛార్జీలు, మందుల కోసం మేము లక్ష రూపాయలు ఖర్చు చేసాము" అని బాన్ మేనల్లుడు ముప్ఫయి అయిదేళ్ల దిలీప్ గిరి చెప్పారు. “హాస్పిటల్ బిల్లు చెల్లించడానికి మేము స్నేహితులు, బంధువుల దగ్గర నుండి డబ్బు తీసుకున్నాము. మామయ్య రూ. నెలకు 7,000 - 8,000 రూపాయల కన్నా ఎక్కువ సంపాదించలేదు. మేము పెద్దగా పొదుపు చేయగలిగింది కూడా లేదు. ”
బీడ్తో సహా రాష్ట్రంలోని 14 వ్యవసాయ క్షోభకు గురైన జిల్లాల్లోని రైతు కుటుంబాలను కవర్ చేసే MJPJAY క్రింద కూడా బాన్ చికిత్స పొందవచ్చు. బాన్ కుటుంబానికి అతని గ్రామంలో ఐదు ఎకరాల పొలం ఉంది, అందువలన అతను ఈ పథకానికి అర్హుడయ్యాడు.
బాన్ చికిత్స పొందిన అహ్మద్‌నగర్‌లోని ప్రైవేట్ ఆసుపత్రి అతన్ని MJPJAY కింద చేర్చుకోవడానికి నిరాకరించింది. "మేము ఈ పథకం యొక్క ప్రయోజనాన్ని పొందాలనుకుంటే మరొక ఆసుపత్రిని చూసుకోమని వారు మాకు చెప్పారు" అని మీనా చెప్పారు. “ఆ సమయంలో, ఒక మంచి ఆసుపత్రిని కనుక్కోవడానికి, మనిషిని రక్షించడం గురించి మాత్రమే ఆలోచిస్తాము. డబ్బు గురించి ఆలోచించము. కానీ మేము మనిషిని, డబ్బుని రెండిటిని రక్షించుకోలేకపోయాము. "
పదిహేను, పధ్నాలుగు యేళ్ళున్న రుషికేశ్ మరియు యష్, బాన్, మీనాల పిల్లలు. ఇప్పుడు వారి భవిష్యత్తును గురించి దిక్కుతోచకుండా ఉన్నారు. వాళ్లిద్దరూ బాగా చదువుకుని డాక్టర్లు కావాలని వాళ్ళ నాన్న కోరుకున్నారు. "వారు జర్నలిస్టులుగా మారడానికి ఆయన ఇష్టపడలేదు" అని దిలీప్ చెప్పారు. “పిల్లల భవిష్యత్తు ఇప్పుడు తల్లి చేతిలో ఉంది. కానీ ఆమెకు వ్యవసాయం తప్ప వేరే ఆదాయానికి ఆస్కారం లేదు . మేము జోవర్ మరియు బజ్రా మాత్రమే పెంచుతాము. మేము వాణిజ్య పంటలను పండించము, ”అని ఆయన చెప్పారు.
నిశ్శబ్దంగా ఒకరి పక్కన కూర్చుని, కౌమారంలో ఉన్న ఆ పిల్లలు ఇద్దరూ మా సంభాషణను వింటున్నారు. "తండ్రిని కోల్పోయినప్పటి నుండి వారు చాలా నిశ్శబ్దంగా ఉన్నారు. "ఇదివరకు వారు ఉల్లాసంగా చిలిపిగా ఉండేవారు. కానీ ఇప్పుడు ఒక్కోసారి, వారు తమ పప్పా వెళ్లిన చోటకే వెళ్తామంటున్నారు." అని దిలీప్ చెప్పారు.
అనువాదం - అపర్ణ తోట