చక్కని ఎండ కాస్తున్న ఒక ఆదివారం రోజున, సుమారు 30 మంది మహిళలతో ముప్ఫయి తొమ్మిదేళ్ల సునీతారాణి మాట్లాడుతున్నారు. తమ హక్కుల్ని కాపాడుకోవడం కోసం పెద్ద సంఖ్యలో దీర్ఘకాలిక దీక్షకు సిద్ధం కావాలని ఆమె వారికి ఉద్బోధిస్తున్నారు. “కామ్ పక్కా, నౌకరి కచ్చి(పనికి హామీ, జీతానికి లేదు)”, అని ఆమె నినదిస్తుండగా, “నహి చలేగీ, నహీ చలేగీ(ఇకపై చెల్లదు, ఇకపై చెల్లదు)”, అంటూ ఆ మహిళలు తమ గొంతును కలుపుతున్నారు.
ఢిల్లీ-హర్యానా హైవేకి సమీపం లోని సోనిపట్ పట్టణంలోని సివిల్ హాస్పిటల్ లాన్ లోపల పలువురు మహిళలు కూర్చునివున్నారు. వీరిలో ఎక్కువమంది ఎరుపు రంగు దుస్తులు ధరించివున్నారు. హర్యానాలో వారు ధరించే యూనిఫారం రంగు కూడా అదే. ఒక ధుర్రి (చిన్నపాటి వేదిక)పై కూర్చుని న్న సునీతతో వారు తమ బాధలు వెళ్లబోసుకుంటున్నారు. నిజానికి అవన్నీ అందరికీ తెలిసిన విషయాలే.
ఆ మహిళలందరూ గుర్తింపు పొందిన ఆశా సామాజిక ఆరోగ్య కార్యకర్తలు, జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ (ఎన్ఆర్‌హెచ్ఎం)ను ముందుకు నడిపే క్షేత్రస్థాయి కార్యకర్తలు. భారతదేశ గ్రామీణ ప్రజల్ని దేశ ప్రజారోగ్య సంరక్షణ వ్యవస్థతో అనుసంధానించే కీలకమైన బాధ్యతను నిర్వహిస్తున్నది వీరే. దేశవ్యాప్తంగా పది లక్షలమందికి పైగా ఆశా కార్యకర్తలు విధులు నిర్వహిస్తున్నారు. ఆరోగ్యానికి సంబంధించి ఏ అవసరం ఏర్పడినా, అత్యవసర పరిస్థితుల్లో కూడా ప్రజలకు సర్వవేళలా అందుబాటులో వుండేది ఈ ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలే.
వీరకి పన్నెండు ముఖ్యమైన పనులుంటాయి, మళ్లీ ఇందులో 60 ఉప టాస్కులుంటాయి. పోషకాహారం, పారిశుద్ధ్యం, అంటు వ్యాధుల గురించి ప్రజలకు సమాచారాన్ని అందించడం నుండి, క్షయవ్యాధి రోగుల చికిత్సను ట్రాక్ చేయడం, వారి ఆరోగ్య సూచికల రికార్డులను నిర్వహణ దాకా బాధ్యతలన్నీ ఆశా కార్యకర్తలు పంచుకోవాల్సిందే.
''మా ఆశా కార్యకర్తలు వీటిలోనే కాదు, ఇంకా అనేక విధుల్లో కూడా భాగమవుతుంటారు. నిజానికి మేము శిక్షణ పొందినది, పనిచేస్తున్నది వేర్వేరు అంశాల మీద. శిక్షణలో భాగంగా మాకు నేర్పింది ప్రసవించిన తల్లుల, నవజాత శిశువుల ఆరోగ్య గణాంకాలను మెరుగుపరచడం గురించి మాత్రమే'' అన్నారు సునీతారాణి. ఆమె సోనిపట్ జిల్లాలోని నాథుపూర్ గ్రామంలో పనిచేస్తున్నారు. ఆ గ్రామంలోని 2,953 మంది జనాభాను చూసుకునే ముగ్గురు ఆశా కార్యకర్తల్లో సునీత ఒకరు.








