తన కొడుకు మరణానికి కారణమేమిటో తనకు తెలుసునని శోభా సాహ్ని అనుకునేవారు. కానీ అది జరిగిన ఏడు నెలల తర్వాత, ఆ కారణం గురించి ఆమెకు అంత ఖచ్చితంగా తెలియటంలేదు.
ఫిబ్రవరిలో ఒక ప్రశాంతమైన మధ్యాహ్నం వేళ, బ్రహ్మసరి గ్రామంలోని తన ఒక గది ఇంటి గుమ్మం వద్ద కూర్చొని ఉన్న శోభ (30), ఆరేళ్ల ఆయుష్ అనారోగ్యంతో ఎలా బాధపడ్డాడో గుర్తుచేసుకున్నారు. "వాడికి జ్వరం వచ్చింది, ఆపైన కడుపులో నొప్పిగా ఉందన్నాడు," అని ఆమె చెప్పారు.
ఉత్తరప్రదేశ్, గోరఖ్‌పూర్ జిల్లాలోని వారి గ్రామాన్ని వర్షాలు ముంచెత్తిన తర్వాత, 2021 జూలై చివరలో ఇది జరిగింది. ఇలా వరదలు ముంచెత్తడం అసాధారణమేమీ కాదు. "ఇది ప్రతి యేటా జరుగుతూనే ఉంటుంది. నీరు బయటికి పోయే మార్గం లేదు" అని ఆమె చెప్పారు.
వర్షం కురిసిన ప్రతిసారీ బ్రహ్మసరి నీటిలో మునిగిపోతుంది. ఆవు పేడ, మానవ మలమూత్రాలు - బహిరంగ మలవిసర్జన కారణంగా - గ్రామమంతటా చెల్లాచెదురుగా పడవేసే చెత్త ఆ నీటిలో కలిసిపోతుంది. “నీటిలో చచ్చిన పురుగులు వుంటాయి, దోమలుంటాయి. మేం వంట చేసుకునే ప్రదేశాలలోకి మురికి నీరు చేరుతోంది," అని శోభ తెలిపారు. “మనం ఎంత ఆపాలని ప్రయత్నించినా మా పిల్లలు ఆ నీళ్లలో ఆడుకుంటారు. ఇక్కడి జనం ఎక్కువగా వర్షాకాలంలోనే అనారోగ్యాల పాలవుతుంటారు."
గత ఏడాది ఇది ఆమె కొడుకు వంతయింది. "మేము మొదట పిల్లవాడికి బరహల్‌గంజ్, సిక్రిగంజ్‌లలోని రెండు ప్రైవేట్ ఆసుపత్రులలో చికిత్స చేయించే ప్రయత్నం చేశాం, కానీ లాభాంలేకపోయింది" అని శోభ చెప్పారు.
జ్వరం వచ్చిన ఒక వారం రోజుల తర్వాత, శోభ ఆయుష్‌ను అక్కడికి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న బేల్‌ఘాట్‌లోని సామాజిక ఆరోగ్య కేంద్రం (కమ్యూనిటీ హెల్త్ సెంటర్ - సిఎచ్‌సి)కి తీసుకువెళ్ళారు. అక్కడ ఆయుష్‌ని గోరఖ్‌పూర్‌లోని బాబా రాఘవ్ దాస్ వైద్య కళాశాల (బిఆర్‌డి మెడికల్ కాలేజ్)కు తీసుకువెళ్ళమని సూచించారు. ఇది బ్రహ్మసరికి 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.










