సోహన్ సింగ్ టీటాకు ఉన్న దేనికీ వెరువని స్వభావం నేలమీదా నీళ్లలోనూ అనేక ప్రాణాలను కాపాడటానికి ఉపయోగపడుతుంది. సాధారణంగా ఆయన, భులే చక్ గ్రామం వీధుల్లోనూ, ఆ చుట్టుపక్కలా పొగ, ధూళి కమ్మిన మేఘాల మధ్య నుండి వస్తూ కనబడతారు. కూరగాయలను అమ్మటానికి తన మోటర్ సైకిల్ మీద ఆయన స్వారీ చేస్తూ వస్తుంటే దేవుడు ప్రత్యక్షమైనట్లే ఉంటుంది. కానీ మునక ఈతలో ఆయనకున్న ప్రావీణ్యం వల్లనే ఆయన అందరికీ తెలుసు. ప్రజలను సురక్షితంగా ఒడ్డుకు చేర్చటానికి సోహన్ పంజాబ్ రాష్ట్రం, గుర్‌దాస్‌పుర్ జిల్లాలోని తన గ్రామానికి దగ్గరలో ఉన్న పంట కాలవలలోకి తరచుగా దూకుతుంటారు.
“నీటిలో మునిగిపోతున్న ప్రజలను కాపాడటం నా పని కాదు, నేనలా చేస్తానంతే,” అంటారు 42 ఏళ్ళ సోహన్. అతనాపనిని గత 20 సంవత్సరాల నుండి చేస్తున్నారు. “మీరు ‘నీళ్ళే ప్రాణం’ అనుకుంటుంటారు. కానీ నిజ అర్థంలో అది మరణం అవటాన్ని నేను ఒక వెయ్యిసార్లు చూశాను,” సంవత్సరాల తరబడి తాను నీటి నుంచి బయటకు తీసిన శవాల సంఖ్యను ఎత్తి చూపుతూ అంటారు సోహన్.
కాలువలో ఎవరైనా పడినపుడు రక్షించటానికో, లేదా శవాన్ని బయటకు తీయటానికో గుర్‌దాస్‌పుర్, దాని పక్కనే ఉండే పఠాన్‌కోట్ జిల్లాలలో మొట్టమొదటిగా పిలిచేవారిలో సోహాన్ ఉంటారు. ఆ మనిషి ప్రమాదవశాత్తు నీటిలో పడ్డాడా లేక ఆత్మహత్య చేసుకొని మరణించాడా అనే విషయం తెలుసుకోవటానికి వేచి ఉండకుండానే, “ఎవరైనా నీటిలో పడ్డారని తెలియగానే నేను నీళ్లలోకి ప్రవేశిస్తాను. ఆ మనిషిని సజీవంగా పట్టుకోవాలనుకుంటాను,” అంటారు సోహన్. కానీ వారు చనిపోయి దొరికితే, “బంధువులు చివరిసారి వారి ముఖం చూడాలనుకుంటాను” అని నెమ్మదిగా అంటారు. అప్పుడాయన మాటలు వెయ్యి ప్రాణాలు పోయిన వేదనతో నిండి ఉంటాయి.
సోహన్ ప్రతి నెలా కాలువల నుండి రెండు మూడు శవాలను బయటకు తీస్తుంటారు. “జీవితం ఒక పెద్ద తుఫానులాంటిది” అనే వేదాంతధోరణిలో ఆయన తన అనుభవాలకు అర్థం చెబుతారు. “ఒక్క క్షణంలోనే మొదలయ్యి, అంతలోనే ముగిసిపోయే చక్రం అది” అని నాతో చెప్తారాయన..









