ఆ ప్రకంపనలు రాచరికపు పడక గదులను చేరుకునే సమయానికే చాలా ఆలస్యం జరిగింది. ధ్వంసమైన బురుజులను మరమ్మత్తు చేయడానికీ ఆలస్యమైంది, శక్తివంతమైన స్థానిక నాయకులను(సత్రాప్), భట్రాజులను ఇక్కడికి తీసుకురావడం మరీ ఆలస్యమైంది.
లోతైన అగాధాలు సామ్రాజ్యం అంతటా సగర్వంగా పరచి ఉన్నాయి. పచ్చి గోధుమకాండాల వాసన వేస్తూ ఆకలితో అలమటిస్తున్న పేద ప్రజలపై ఆయనకున్న ద్వేషం కన్నా లోతుగా, ఆయన విశాల ఛాతి కన్నా వెడల్పుగా ఉన్న ఈ అగాధాలు - వీధులంతా వ్యాపించాయి. ఆ ఆగాధాల వీధులు - సాగి సాగి రాజభవనానికి, బజారులకు, ఆయన గోశాలల గోడలకు చేరుకున్నాయి. కాని అప్పటికే చాలా ఆలస్యమైంది.
తన అనుంగు కాకులను ఎగురవేయడం ఆలస్యమైంది. ఇది కాసేపట్లో తొలిగిపోయే దారిలోని చిన్న అడ్డంకి మాత్రమే - అంటూ ప్రజల మధ్య కంగారుగా పరిగెత్తుతూ, గోలగోలగా గొడవ చేసి, ప్రకంపనల పై విసుగును ప్రకటించడం కూడా ఆలస్యమైంది. కవాతు చేస్తున్న పాదాలను తెగనాడడమూ ఆలస్యమైంది. అబ్బా, ఆ పగిలిన, ఎండలో కమిలిన పాదాలు, అవి అతని మస్నాడ్(పీఠాన్ని)ని ఎలా కదిలించాయి! ఈ పవిత్ర సామ్రాజ్యం వెయ్యి సంవత్సరాల పాటు కొనసాగుతుందని బోధించడానికి కూడా చాలా ఆలస్యమైంది. మట్టిని మొక్కజొన్న కంకులుగా మార్చిన ఆ పచ్చని చేతులు, ఇప్పుడు ఆకాశాన్ని తాకుతున్నాయి.
అయితే ఆ బలమైన పిడికిళ్లు ఎవరెవరివి? సగం స్త్రీలవి, మూడింట ఒక వంతు బానిసత్వ భారాన్ని ఇంకా భరిస్తున్నవారివి, ఇక నాలుగోవంతు పైచిలుకు మిగిలిన వాటికన్నా పురాతన మైనవి. వారు అద్భుతమైన హరివింటి రంగులలో అలంకరించబడి ఉన్నారు. కొందరు కెంపు, పసుపు రంగులలో ఉన్నారు. మరి కొందరు చినిగిన దుస్తుల్లో ఉన్నారు. అధినేత వేసుకునే పదిలక్షల డాలర్ల దుస్తుల కంటే ఈ చినిగిన బట్టలు ఇంకా ఘనంగా ఉన్నాయి. వీరు కవాతు చేస్తూ, పాడుతూ, నవ్వుతూ, ఆనందిస్తూనే మృత్యువు ఎదుర్కొని ధిక్కరించే వీరులు. వీరు నాగలి పట్టే అలసట ఎరుగని యోధులు. విరోధి ప్రయోగించిన పవిత్రమైన రాళ్లు, షాట్‌గన్‌లు కూడా వీరి ముందు విఫలమయ్యాయి.
ఈ ప్రకంపనలు గుండెకు బదులుగా రాచరిక సూన్యం నిండి ఉన్న చోటుకు చేరేసరికి, చాలా ఆలస్యం అయింది.



