డిసెంబర్ 11న వాళ్ళు కరెంట్ తీగలను తీసేస్తున్నప్పుడు ఒక దుకాణదారుడు ఏడ్చినంత పని చేశాడు. “మా మీద బెంగ పడతానని, మేము లేకపోతే ఒంటరినౌతానని అతను అన్నాడు. మాకు కూడా వీరిని వదిలి వెళ్లడం కష్టంగానే ఉంది. కానీ ప్రస్తుతం రైతుల విజయమే ఒక పెద్ద వేడుక.” అన్నాది గురువిందర్ సింగ్.
అప్పటికే ఉదయం 8.15 అయింది. గురువిందర్ ఇంకా అతని గ్రామం నుండి వచ్చిన ఇతర రైతులు పశ్చిమ ఢిల్లీలోని తిక్రిలో, నిరసన జరిగిన స్థలాలలోని గుడారాలను తీసివేస్తున్నారు. కొన్ని సార్లు వారు అక్కడ ఉన్న వెదురు బద్దలను విరగ్గొట్టడానికి చెక్క బద్దలను, కొన్నిసార్లు గుడారాలకు కింద దన్నుగా ఉన్న పునాదులను విరగగొట్టడానికి ఇటుకలను వాడవలసి వచ్చింది. ఇరవై నిముషాలలో ఇదంతా ఒక కుప్పగా మారింది. వారు అల్పాహార (టీ,పకోడా) విరామం తీసుకున్నారు.
“మేము ఈ గుడారాలని మా చేతులతో కట్టాము. ఇప్పుడు స్వయంగా మా చేతులతోనే వీటిని తీసేస్తున్నాము,” అన్నాడు 34 ఏళ్ళ గురువిందర్. ఇతని కుటుంబం గోధుమ, వరి, బంగాళా దుంపను పంజాబ్లోని లూథియానా జిల్లాలో డాంగియాన్ గ్రామంలో ఆరు ఎకరాల భూమిలో సాగు చేస్తుంది. “ విజయంతో ఇంటికి వెళ్లడం సంతోషంగా ఉంది, కాని ఇక్కడ ఏర్పరచుకున్న బంధాలను వదిలివెళ్లడం కూడా కష్టంగా ఉంది.” అన్నాడు.
“నిరసన మొదలైనప్పుడు ఇక్కడ ఏమి లేదు. మేము ఇక్కడ రోడ్ల పైనే పడుకునేవాళ్ళము. దీనినే ఇంటిగా మార్చుకున్నాము.” అన్నాడు 35 ఏళ్ళ దీదార్ సింగ్, ఈయన గురువిందర్ గ్రామం నుండే వచ్చాడు. ఈయన తన ఏడు ఎకరాల పొలంలో గోధుమ, వరి, బంగాళా దుంప, ఆకుకూరలు పండిస్తాడు. “మేము ఇక్కడ చాలా నేర్చుకున్నాము. ముఖ్యంగా ఒకరితో ఒకరం సోదరభావంతో మెలగడం నేర్చుకున్నాం. మన ప్రభుత్వాలు మనకు ఒకరితో ఒకరు పోట్లాడుకోడమే నేర్పాయి. కాని అందరం - పంజాబ్, హర్యాణా, ఉత్తర ప్రదేశ్ నుండి వచ్చి ఇక్కడ కలిసేసరికి మేమంతా ఒకటే అని అర్థం చేసుకున్నాం.”
“మాకు పంజాబ్ లో ఎన్నికలు ఉన్నాయి. మేము సరైన వ్యక్తికే ఓటు వేస్తాము,” అన్నారు గురువిందర్. “మేము మా చేయూతనినిచ్చే వారికే ఓటు వేస్తాము. అధికారంతో మమ్మల్ని మోసం చేసేవారిని కాదు.” అని దీదార్ చెప్పాడు.

































