'ప్రతి ఆత్మా చావును రుచి చూస్తుంది' అని ఆ శిలా ఫలకం మీద రాసి ఉంది.  మన జాతకాలలో రాయని ఎన్నో సత్యాలు, న్యూ ఢిల్లీ లో  అతిపెద్ద స్మశానవాటికలలో ఒకటైన  జదీద్‌ అల్-ఎ ఇస్లాం కబరిస్థాన్ లోని చాలా సమాధుల శాసనాల పైన ఉంటాయి.

—  كُلُّ نَفْسٍ ذَائِقَةُ الْمَوْتِ  –  ఖురాన్ నుండి వచ్చిన ఈ మాట ఈ ముస్లిం స్మశానవాటికలో అలుముకున్న దిగులుకు ప్రశాంతతనూ, బెంగానూ మిళితం చేసింది. మరో చనిపోయిన వ్యక్తితో అంబులెన్స్ వస్తుంది. వారి ప్రియతములు వెళ్ళిపోయినవారికి చివరి ప్రార్థనలు చేస్తారు. త్వరలో వ్యాన్ ఖాళీ అవుతుంది. ఒక సమాధి నిండిపోతుంది. ఆ తరవాత ఒక యంత్రం సమాధిని మట్టితో నింపుతుంది

బహదూర్ షా జాఫర్ మార్గ్ వద్ద ఉన్న హౌసింగ్ మీడియా సంస్థల భవనాల ప్రక్కనే ఉన్న ఈ స్మశానవాటికలో ఒక మారుమూల- - 62 ఏళ్ళ నిజాం అక్తర్, అక్కడే కూర్చుని, మరణించినవారి పేర్లను సమాధిపై వ్రాస్తాడు. ఇలా రాయడాన్ని మెహ్రాబ్ అని అంటాడతాను. తన పార్కాజా (కాలిగ్రాఫి బ్రష్) ను  వేళ్ళ మధ్య సున్నితంగా పట్టుకొని, అతను ఒక నుక్తాను - ఉర్దూ భాషలో  కొన్ని అక్షరాలపై చుక్కను -పెడతాడు. ఈ నుక్తా ఉర్దూ అక్షరాలకు ప్రత్యేకమైన ఉచ్చారణను ఇస్తుంది. ప్రస్తుతం అతను వ్రాస్తున్న పదం ‘దుర్దానా’, అది ఒక కోవిడ్ -19 బాధితుడి పేరు.

నిజానికి నిజాం పేర్లను పెయింటింగ్ చేస్తున్నాడు.  ఇంకా వచనాన్ని చక్కని సంక్లిష్టమైన కాలిగ్రఫీలో సమాధి రాళ్లపై చిత్రీకరిస్తున్నాడు. తరువాత అతనితో పాటు పని చేసే వ్యక్తి ఆ శాసనం వెంట వచనాన్ని చెక్కడానికి సుత్తి, ఉలిని ఉపయోగిస్తాడు.  అతను అలా చేస్తున్నప్పుడు  రాతి మీద పెయింట్ నెమ్మదిగా అదృశ్యమవుతుంది.

కతీబ్ (లేఖకుడు లేదా కాలిగ్రాఫర్) అనే నిజామ్, మరణించిన వారి పేర్లను సమాధిపై 40 ఏళ్లుగా ముద్రిస్తున్నాడు. "నేను ఇప్పటివరకు పనిచేసిన సమాధుల సంఖ్య మొత్తం నాకు గుర్తులేదు" అని అతను చెప్పాడు. “ఈ ఏప్రిల్, మే నెలల్లో, నేను కోవిడ్‌తో మరణించిన 150 మంది వ్యక్తుల పేర్లను కాక వేరే కారణాలతో చనిపోయినవారి ఇంకో 150 మంది పేర్లు కూడా వ్రాశాను. నేను రోజుకు మూడు నుండి ఐదు రాళ్లను పూర్తి చేస్తాను. ఒక రాయికి ఒక వైపు రాయడానికి ఒక గంట సమయం పడుతుంది,” అని అతను చెప్పాడు. రాయికి ఒకవైపు ఉర్దూలో రాస్తే రెండో వైపు ఇంగ్లిష్ లో  రాస్తారు. “ఇది పెన్నుతో పేజీలు నింపే పనివంటిది కాదు" అని చిరునవ్వు నవ్వి,  నోట్స్ రాసుకొంటున్న నన్ను చూసి సున్నితంగా వెక్కిరించాడు.

Left: One of the gates to the qabristan; on this side only those who died of Covid are buried. Right: Nizam Akhtar writing the names of the deceased on gravestones
PHOTO • Amir Malik
Left: One of the gates to the qabristan; on this side only those who died of Covid are buried. Right: Nizam Akhtar writing the names of the deceased on gravestones
PHOTO • Q. Naqvi

ఎడమ: కబ్రిస్తాన్‌ కు ఉన్న ద్వారాలలో ఒకటి; ఈ వైపు కోవిడ్ తో మరణించిన వారిని  మాత్రమే ఖననం చేస్తారు. కుడి: నిజాం అక్తర్ మృతుల పేర్లను వారి సమాధిపై రాస్తున్నాడు

మహమ్మారి ప్రారంభానికి ముందు ప్రతిరోజూ జదీద్‌ కబ్రిస్తాన్కు రోజుకు  ఒకటి రెండు సమాధి శాసనాల పనులు వస్తే, ఇప్పుడు పని భారాన్ని 200 శాతం పెంచుతూ రోజుకు నాలుగైదు పనులు వస్తున్నాయి.  ఆ భారాన్ని నలుగురు కార్మికులు పంచుకుంటారు. ఈ  వారానికి, వారిక కొత్త  ఆర్డర్లు తీసుకోవడం లేదు. ఇప్పుడు వారి చేతుల్లో120 సగం పూర్తయిన సమాధి శాసనాలు  కాక ఇంకా పని మొదలుపెట్టని 50 శాసనాలున్నాయి.

ఇది బ్రహ్మాండంగా పెరుగుతున్న వ్యాపారం - కానీ దాని వేగమైన ఎదుగుదల ఆ పని చేస్తున్నవారి హృదయాలను విచ్ఛిన్నం చేస్తుంది. “చాలా మంది చనిపోయారు, వారితో పాటు మానవత్వం కూడా చనిపోయింది. ఈ మరణ దృశ్యాలను చూస్తూ నా హృదయం గంటల తరబడి విలపిస్తుంది ” ఈ స్మశానవాటికలో మూడవ తరం కార్మికుడు మహ్మద్ షమీమ్ అంటున్నాడు.

"మరణం ఎంత నిజమో, జీవితం కూడా అంటే నిజం. ఈ భూమిపైకి వచ్చిన ప్రజలు, జీవిస్తారు, తరవాత  అందరూ చనిపోతారు, ఇదే జీవిత సత్యం" అంటాడు నిజాం. "ప్రజలు చనిపోతున్నారు, నేను సమాధుల పై వారి పేర్లని చెక్కుతున్నాను" మరణ తత్వవేత్త లాగా అంటున్నాడు నిజాం. "కానీ నేను ఇంతకు ముందెన్నడూ ఇటువంటి పరిస్థితిని చూడలేదు."

ప్రతి కుటుంబం ఒక సమాధిరాయిని పురమాయించకపోయినా కూడా వ్యాపారంలో హడావుడి బాగానే ఉంటుంది. సమాధి రాళ్ల ఖర్చుని భరించలేని కొందరు ఇనుప బోర్డులపై పెయింట్ చేసిన వచనంతో,  శాసనాలు తయారు చేయిస్తారు. చాలా సమాధులకు  గుర్తింపు లేకుండానే ఉనాయి. 'సమాధిరాళ్ల  కోసం కొన్ని ఆర్డర్లు, ఖననం చేసిన 15 నుండి 45 రోజుల తరువాత వస్తాయి' అని నిజాం చెప్పారు. 'మేము తీసుకునే ప్రతి ఆర్డర్ పూర్తి చేసి అందించడానికి, ఆ  కుటుంబం కనీసం 20 రోజులు ఎదురు చూడాలి' అని నిజాం సహ కార్మికుడు, శిల్పి అయిన ఆసిమ్ చెప్పాడు.  ఆసిమ్ హర్యానాలోని ఫరీదాబాద్ జిల్లా బల్లబ్ గడ్ లో నుండి వచ్చాడు. (అతని అభ్యర్థన మేరకు పేరు మార్చబడింది)

35 ఏళ్ల అసిమ్ గత సంవత్సరం గతం సంవత్సరం సందేహంగా ఉన్నాడు కానీ ఇప్పుడు అతను కరోనా వైరస్ ఉనికిని నమ్ముతాడు. 'శరీరాలు అబద్ధం చెప్పవు. నేను చాలామందిని చూశాను, ఇక నమ్మడం తప్ప వేరే మార్గం లేకుండా పోయింది. కొందరు తమ కుటుంబ సభ్యుల కోసం సొంతంగా సమాధులు తవ్వుకొన్నారు కూడా. కొన్నిసార్లు సమాధులు తవ్వడానికి సరిపడా మనుషులు కూడా లేరు' అన్నాడతను.

'మహమ్మారికి ముందు, ఈ స్మశానవాటికకు ప్రతిరోజూ నాలుగైదు మృతదేహాలను వచ్చేవి. అంటే నెలకు సుమారు 150' స్మశానవాటిక నడుపుతున్న కమిటీకి చెందిన సంరక్షకులు ఒకరు మాకు చెప్పారు.

Asim, Aas and Waseem (left to right) engraving the mehrab: 'Every order that we take, the family has to wait for at least 20 days'
PHOTO • Q. Naqvi
Asim, Aas and Waseem (left to right) engraving the mehrab: 'Every order that we take, the family has to wait for at least 20 days'
PHOTO • Amir Malik

అసిమ్ మరియు ఆస్ (ఎడమ నుండి కుడికి) మెహ్రాబ్ చెక్కడం: 'మేము తీసుకునే ప్రతి ఆర్డర్ అందుకోవడానికి , ఆ కుటుంబం కనీసం 20 రోజులు వేచి ఉండాలి'

ఈ సంవత్సరం ఏప్రిల్ మరియు మే రెండు నెలల్లో, ఈ స్మశానానికి 1,068 మృతదేహాలు వచ్చాయి- వాటిలో 453 కోవిడ్ -19 బాధితులు, 615 మంది ఇతర కారణాలతో చనిపోయినవారు ఉన్నారు. సరే ఇవన్నీ శ్మశానవాటిక అధికారిక సంఖ్యలు. కానీ ఇక్కడ పనిచేసేవారు(పేరు చెప్పవద్దన్నారు) మృతుల అసలు సంఖ్య బహుశా 50 శాతం కన్నా ఎక్కువగా ఉండొచ్చని చెప్పారు.

'ఒక మహిళ తన ఒకటిన్నర సంవత్సరాల బాబుతో పాటు శ్మశానానికి వచ్చింది' అని అసిమ్ చెప్పారు. "ఆమె భర్త, వేరే రాష్ట్రం నుండి వలస వచ్చినవాడు. అతను కోవిడ్ -19 తో మరణించాడు. ఆమెకు ఇక్కడ ఎవరూ లేరు. మేము అతని ఖననం ఏర్పాటు చేసాము. బాబు తన తండ్రి సమాధిలో మట్టి పోస్తున్నాడు.” పాత సామెత చెప్పినట్లుగా: ఒక బిడ్డ చనిపోతే, అతను తల్లిదండ్రుల హృదయంలో ఖననం చేయబడతాడు. మరి ఒక బిడ్డ తల్లిదండ్రులను పాతిపెట్టడానికి సహాయం చేసినప్పుడు ఏమి జరుగుతుందో  చెప్పే సామెత ఉందా?

అసిమ్ మరియు అతని కుటుంబం కూడా కోవిడ్ -19 బారిన పడ్డది. అతను, అతని ఇద్దరు భార్యలు, తల్లిదండ్రులు దాని లక్షణాలన్నింటినీ అనుభవించారు. వారి ఐదుగురు పిల్లలు సురక్షితంగా ఉన్నారు. కుటుంబంలో ఎవరూ పరీక్ష కోసం వెళ్ళలేదు - కాని అందరూ బయటపడ్డారు. "నా కుటుంబాన్ని నడపడానికి నేను ఇక్కడ రాళ్ళు పగలగొట్టాను," అతను చెక్కిన స్లాబ్ల గురించి చెప్పాడు. అసిమ్ - జదీద్‌ కబ్రిస్తాన్  వద్ద నెలకు రూ. 9,000 సంపాదిస్తాడు. కోవిడ్ బాధితులు మరియు ఇతర కారణాల వలన మరణించిన వందలమంది కోసం నమాజ్-ఎ-జనజా (తుది ప్రార్థనలు) కు కూడా చేసాడు.

"నా కుటుంబం నన్ను ఇక్కడ పనిచేయమని ప్రోత్సహిస్తుంది, ఎందుకంటే మానవులకు వారి చివరి ప్రయాణంలో సేవలను అందించే వారికి స్వర్గంలో బహుమతి లభిస్తుంది" అని అసిమ్ చెప్పాడు. నిజాం కుటుంబం కూడా అదే నమ్మకంతో ఇక్కడకు రావడానికి మద్దతు ఇచ్చింది. ఇద్దరూ మొదట్లో ఉద్యోగం చేయడానికి భయపడ్డారు, కాని వెంటనే వారి భయాలను విడిచిపెట్టారు. "నేల మీద ఒక శరీరం పడి ఉన్నప్పుడు, మీరు మీ భయం గురించి కాకుండా వారి  ఖననం గురించి ఆలోచిస్తారు." అని అసిమ్ చెప్పారు.

జదీద్‌ కబ్రిస్తాన్ లో పూర్తి చేసిన సమాధికి రూ.1,500 తీసుకుంటారు. ఇందులో కిటాబాట్ అని పిలువబడే నిజాం కాలిగ్రాఫికి సుమారు రూ. 250 నుండి 300 వరకు వస్తాయి. అతను పనిచేసే ప్రతి రాతి పలక 6 అడుగుల పొడవు మరియు 3 అడుగుల వెడల్పుతో ఉంటుంది. దీని నుండి, నాలుగు సమాధులు - ప్రతి 3 అడుగుల పొడవు మరియు 1.5 అడుగుల వెడల్పు తో తయారుచేస్తారు. ప్రతి రాయికి పైభాగంలో గోపురం ఆకారం ఇవ్వబడుతుంది. ఇక చివరగా తయారయిన ఆకారాన్ని మెహ్రాబ్ అని పిలుస్తారు. కొంతమంది పాలరాయిని కూడా ఉపయోగిస్తారు. రాళ్లకు బదులుగా ఐరన్ బోర్డులు వాడే వారు కేవలం రూ. 250 నుండి 300 మాత్రమే ఖర్చుబెడతారు. దీనికి పూర్తి మెహ్రాబ్ ఖరీదులో ఆరోవంతు మాత్రమే ఖర్చవుతుంది.

వీడియో చూడండి: కబ్రిస్తాన్ కాలిగ్రాఫర్స్

ఆబ్ర్ - ఏ-రెహమత్ ఉన్కి మార్కద్ పర్ గుహర్-బారి కరే
హష్ర్ తక్ షాన్ ఎ కరిమి నాజ్ బర్దారీ కరే.

దయాకరుణ అనే  మబ్బులు ఆవిడ సమాధిపై ముత్యాలవాన కురిపించుగాక,
యుగాంతం వరకు ఖుదా వాత్సల్యంలో ఆవిడ భద్రంగా ఉండుగాక.

నిజాం 1975 లో కితాబాట్ ప్రాక్టీస్ చేయడం ప్రారంభించాడు. చిత్రకారుడైన తన తండ్రి, 1979 లో మరణించిన తరువాత, నిజాం సమాధుల పై రాయడం ప్రారంభించాడు. “నా తండ్రి ఆర్టిస్ట్ అయినప్పటికీ నేను అతని నుండి నేర్చుకోలేదు. నేను అతనిని పెయింటింగ్ ని  చూశాను. నేను సహజంగానే ఈ అందమైన బహుమతితో ఆశీర్వదించబడ్డాను,” అని అతను చెప్పాడు.

నిజాం 1980 లో ఢిల్లీ విశ్వవిద్యాలయం కిరోరి మాల్ కాలేజీ నుండి ఉర్దూలో పట్టభద్రుడయ్యాడు. ఇప్పుడు శాశ్వతంగా మూసివేయబడిన జగత్ సినిమా అనే ఒక సినిమా థియేటర్ ముందు తన దుకాణాన్ని తెరిచాడు. జగత్ సినిమా ఒకప్పుడు పాకీజా, మొఘల్-ఎ-అజామ్ వంటి చారిత్రక చిత్రాలను తెరపై ప్రదర్శించేది. నిజాం 1986 లో నసీమ్ ఆరాను వివాహం చేసుకున్నాడు. నిపుణుడైన ఈ కాలిగ్రాఫర్ తన భార్యకు ఒక్క లేఖ కూడా రాయలేదు. అతనికి ఆ అవసరం రాలేదు. "ఆమె కూడా మా పరిసరాల్లోనే పెరిగింది. ఆమె తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళినా వెంటనే తిరిగి వస్తుంది.” అంటాడు. ఈ దంపతులకు ఒక కొడుకు, ఒక కూతురు, ఆరుగురు మనవలు. వాళ్లు పాత ఢిల్లీ లోని  జమ్మ మస్జీద్ లో ఉంటారు.

Left: From across the graveyard, you can see the building of the Delhi police headquarters at ITO. Right: Nizam has been printing names of the deceased on these gravestones for over 40 years
PHOTO • Amir Malik
Left: From across the graveyard, you can see the building of the Delhi police headquarters at ITO. Right: Nizam has been printing names of the deceased on these gravestones for over 40 years
PHOTO • Amir Malik

ఎడమ: స్మశానవాటిక నుండి, ITO వద్ద ఢిల్లీ పోలీసు ప్రధాన కార్యాలయ భవనాన్ని మీరు చూడవచ్చు. కుడి: నిజాం ఈ సమాధిపై మృతుల పేర్లను 40 ఏళ్లుగా ముద్రిస్తున్నారు

"అప్పటికి, నేను ముషైరాస్ [ఉర్దూ కవిత్వం పఠనం కోసం సమావేశాలు], సమావేశాలు, వాణిజ్య ప్రకటనలు, సెమినార్లు, మత, రాజకీయ సమావేశాలకు, హోర్డింగులకు పెయింట్ చేసేవాణ్ణి." అతను తన దుకాణంలో మెహ్రాబ్ పెయింటింగ్ కోసం ఆర్డర్లు కూడా తీసుకొనేవాడు. షాపులో చాలా నిరసన సామగ్రి, బ్యానర్లు, హోర్డింగ్‌లు, ప్లకార్డులు కూడా ఉండేవి.

అప్పటి భారత ప్రధాని రాజీవ్ గాంధీ 80 వ దశకం మధ్యలో బాబ్రీ మసీదుపై తాళాలు తెరవడానికి అనుమతించారని ఆయన చెప్పారు. "ఇది ముస్లిం, ఇతర సమాజాల నుండి భారీ నిరసనలకు దారితీసింది. నేను వస్త్రాలపై  ఆందోళన బ్యానర్‌లను, నిరసనలకు పిలుపునిచ్చే పోస్టర్‌లను పెయింట్ చేసివాడిని. 1992 లో బాబ్రీని పడగొట్టిన తరువాత, ఆందోళనలు నెమ్మదిగా తగ్గాయి,” అని నిజాం చెప్పారు. "ప్రజలలో [కూల్చివేతకు వ్యతిరేకంగా] కోపం ఉంది, కానీ ఇప్పుడు వారు బయటకు రావడం లేదు." సాధారణంగా ఇప్పటి సమాజంలో అటువంటి చైతన్యం తగ్గింది అని చెప్పాడు. “నా దగ్గర ఎనిమిదిమంది పనిచేసేవారు. కానీ అందరూ నెమ్మదిగా  మానేయాల్సి వచ్చింది. నా దగ్గర వారికి జీతాలు ఇవ్వడానికి  డబ్బులుండేవి కాదు. వారేమయ్యారో తెలీదు. తలుచుకుంటే బాధ అనిపిస్తుంది.”

“2009-10లో, గొంతు ఇన్ఫెక్షన్ కారణంగా, నేను నా స్వరాన్ని కోల్పోయాను. 18 నెలల తర్వాత దానిలో సగం మాత్రమే తిరిగి పొందగలిగాను. ఇప్పుడు మీరు నన్ను అర్థం చేసుకోవడానికి ఇది సరిపోతుంది, ”అని అతను నవ్వుతాడు. ఇలా గొంతు పోయిన ఏడాదే నిజాం దుకాణం మూసివేయబడింది. "కానీ నేను మెహ్రాబ్‌లో పేర్లు రాయడం ఎప్పుడూ ఆపలేదు." అని చెప్పాడు.

"అప్పుడు, కోవిడ్ -19 మన దేశం లోకి వచ్చినప్పుడు, ఈ స్మశానవాటికలో పనిచేసేవారికి నా సేవలు అవసరమయ్యాయి. నేను చేయను అని అనలేకపోయాను. నేను కూడా నా కుటుంబాన్ని నడపుకోవాలి.  అందుకే నేను గత ఏడాది జూన్‌లో ఇక్కడకు వచ్చాను.” నిజాం కొడుకు జమా మసీదు దగ్గర ఒక చిన్న పాదరక్షల దుకాణం నడుపుతున్నాడు. కానీ మహమ్మారి, లాక్డౌన్లు అతని ఆదాయాన్ని తీవ్రంగా ప్రభావితం చేశాయి.

2004 లో మూసివేయబడిన జగత్ సినిమా మాదిరిగా, నిజాం యొక్క పాత కార్యస్థలం చుట్టూ ఇప్పుడు జ్ఞాపకాలు మాత్రమే ఉన్నాయి. అతను సాహిర్ లుధియాన్వి రచనలను ప్రేమిస్తాడు, అతని పాటలలో సాహిత్యాన్ని వింటాడు. ఈ గొప్ప కవి నిజాం పట్టభద్రుడైన సంవత్సరంలోనే మరణించాడు. ఆయనకు ఇష్టమైన లుధియాన్వి లైన్: ‘రండి. మనం మరోసారి ఒకరికొకరు అపరిచితులం అవుదాం.’ మరో మాటలో చెప్పాలంటే, జీవితం మరియు మరణం ఎప్పుడూ మాట్లాడుకోవు.

Nandkishore, an expert in cutting stones and shaping them with hammer and chisel, says, 'The graveyard has never seen such a horrible situation as it does now'
PHOTO • Amir Malik
Nandkishore, an expert in cutting stones and shaping them with hammer and chisel, says, 'The graveyard has never seen such a horrible situation as it does now'
PHOTO • Amir Malik

రాళ్లను కత్తిరించి వాటిని సుత్తి, ఉలి సహాయంతో ఆకృతిని ఇవ్వడంలో  నిపుణుడైన నందకిషోర్, 'స్మశానవాటిక ఇంత భయంకరమైన పరిస్థితిని ఎప్పుడూ చూడలేదు' అంటారు.

“ఆ రోజుల్లో ఉర్దూలో రాయగల కళాకారులు ఉండేవారు. ఇప్పుడు హిందీ, ఆంగ్ల భాషలలో సమాధులపై వ్రాయగల వ్యక్తులు ఉన్నారు. కానీ ఢిల్లీ లో  ఉర్దూ భాషలో మెహ్రాబ్‌లో పేర్లు రాయగల వ్యక్తిని దొరకడం మాత్రం చాలా అరుదు,” అని అతను చెప్పాడు. "రాజకీయ ప్రయోజనాల కోసం ఇది ముస్లింల భాష మాత్రమే అని కథలు సృష్టించడం వలన ఈ భాష దెబ్బతిన్నది. ఉర్దూ కాలిగ్రాఫిలో ఉద్యోగావకాశాలు గతంలో కంటే చాలా తగ్గిపోయాయి.”

నిజాం తాను పనిచేస్తున్న మెహ్రాబ్‌ లో కితాబాట్‌ ను ముగించిన తరువాత, కాసేపు పెయింట్ ను ఆరనిస్తాడు. అసిమ్, సులేమాన్, నందకిషోర్ వీరు ముగ్గురు చెక్కేపని మొదలు పెడతారు. 50 యేళ్ళున్న నందకిషోర్, 30 సంవత్సరాలుగా స్మశానవాటికలో పనిచేస్తున్నాడు. అతను రాళ్లను కత్తిరించడంలో, యంత్రాన్ని ఉపయోగించకుండా సుత్తి - ఉలితో రాయి పై గోపురం ఆకారాన్ని ఇవ్వడంలో నిపుణుడు. "ఈ స్మశానవాటిక, ఇప్పుడున్నంత భయంకరమైన పరిస్థితిని ఎప్పుడూ చూడలేదు."అన్నాడు.

కోవిడ్ తో చనిపోయిన వారి కోసం నందకిషోర్ సమాధి చెక్కడం లేదు. అతను వైరస్ నుండి తనను కాపాడుకొనే ఉద్దేశంతో జదీద్‌ కబ్రిస్తాన్ కు మరొక మూలలో కూర్చున్నాడు. "నేను ప్రతి రోజు చెక్కడం, కత్తిరించడం, కడగడం చేస్తాను. అంతేగాక పనిచేసిన ప్రతి రాయికి 500 రూపాయలు తీసుకుంటాను" అని చెప్పాడు. "యే ఆంగ్రేజోన్ కే జమానే కా కబ్రిస్తాన్ హై [ఇది బ్రిటిష్ కాలం స్మశానవాటిక]," అని అన్నాడు. “బ్రిటీష్ వారు మనకు విడిచిపెట్టినవి స్మశానవాటికలే కదా?”, అని నేను అడిగినప్పుడు నవ్వుతాడు.

"ముస్లిం స్మశానవాటికలో పనిచేసే నందకిషోర్ ని చూసి కొంతమందికి ఆశ్చర్యం కలుగుతుంది. అటువంటి పరిస్థితులలో నేను వారి ముఖాలను చూసి, ఏమి చెప్పాలో తెలియక చిన్న నవ్వు నవ్వుతాను. అయినప్పటికీ, కొన్నిసార్లు నేను వారికి చెప్తాను: 'నేను మీ కోసం ఖురాన్ పద్యాలను చెక్కాను, ముస్లింలుగా ఉన్నప్పటికీ మీరు మీ జీవితంలో ఎన్నడూ చేయలేని పని నేను చేసాను.'అని. అప్పుడు వారు నాకు కృతజ్ఞతలు తెలుపుతారు, నన్ను నమ్మండి, వారు నా వారేననిపిస్తుంది.”  అని ముగ్గురు పిల్లల తండ్రి అయిన నందకిషోర్ చెప్పాడు. ఇతను ఉత్తర ఢిల్లీలోని సదర్ బజార్లో నివసిస్తున్నాడు.

"వారి సమాధుల లోపల నిద్రిస్తున్న ఈ వ్యక్తులు, నా వారిలాగా అనిపిస్తారు. ఒక్కసారి  ఇక్కడ నుంచి అడుగు బయటపెడితే ఆ ప్రపంచం నాది కాదనిపిస్తుంది. ఇక్కడ నేను ప్రశాంతంగా ఉన్నాను, ”అని అతను చెప్పాడు.

Pawan Kumar and Aas Mohammad: the dust from the stone work often covers them entirely
PHOTO • Amir Malik
Pawan Kumar and Aas Mohammad: the dust from the stone work often covers them entirely
PHOTO • Amir Malik
Pawan Kumar and Aas Mohammad: the dust from the stone work often covers them entirely
PHOTO • Amir Malik

పవన్ కుమార్, ఆస్ మొహమ్మద్: రాతి పని నుండి వచ్చే దుమ్ము తరచుగా వారిని పూర్తిగా కప్పివేస్తుంది

రెండు నెలల క్రితం కొత్త కార్మికుడిని నియమించారు. పవన్ కుమార్, బీహార్ యొక్క బెగుసారై జిల్లాకు చెందినవాడు. అతని భార్య,  ముగ్గురు పిల్లలు బీహార్లోనే  ఉన్నారు. 31 ఏళ్ల పవన్ కూడా రాయిని కోస్తాడు. ఒక చిన్న రాతి కట్టర్ యంత్రం సహాయంతో 20 స్లాబ్లను కత్తిరించిన తరువాత "నా ముఖం ఎర్రగా మారింది" అని అతను చెప్పాడు. పని నుండి వచ్చే దుమ్ము అతని శరీరమంతా కప్పేసింది. “కోవిడ్ ఉన్న లేకపోయినా, నా కుటుంబాన్ని పోషించడానికి నేను ఏడాది పొడవునా పని చేయాలి. ఇక్కడ, నేను కొన్నిసార్లు రోజుకు 700 రూపాయలు సంపాదించగలను. ” అతనికి ఇంతకు ముందు స్థిరమైన ఉపాధి లేదు, అంతేగాక, నందకిషోర్, షమీమ్ లాగ కొద్దిగా అయినా చదువుకున్నవాడు కూడా కాదు.

మరో కార్మికుడు, ఉత్తర ప్రదేశ్‌లోని అలీగడ్ పట్టణానికి చెందిన ఆస్ మొహమ్మద్ (27), స్మశానవాటికలో అన్ని పనులలోనూ పనిచేయగలిగే ఆల్‌రౌండర్. అతను ఇప్పుడు సుమారు ఆరు సంవత్సరాల నుండి ఇక్కడ పనిచేస్తున్నాడు. ఉత్తర ప్రదేశ్ లోని కాస్గంజ్ జిల్లాలో దూరపు బంధువుల కుమార్తెతో ఆస్ కుటుంబం అతని పెళ్ళికి సంబంధం కుదుర్చుకున్నారు.

“నేను ఆమెతో ప్రేమలో పడ్డాను. గత సంవత్సరం లాక్డౌన్ సమయంలో ఆమె కోవిడ్ -19 తో చనిపోయింది,” అని ఆతను చెప్పాడు. అప్పుడు అతని కుటుంబం మరొక సంబంధాన్ని చూశారు. "ఈ అమ్మాయి, ఈ సంవత్సరం మార్చిలో, ఒక స్మశానవాటికలో పనిచేసే వ్యక్తిని వివాహం చేసుకోవటానికి ఇష్టపడనందున ఈ సంబంధం వద్దంది.” అన్నాడు.

"దుఃఖంలో, నేను మరింత పని చేయడం ప్రారంభించాను. ఎక్కువగా సమాధులు తవ్వడం, రాళ్లను కత్తిరించడం- ఇదే పని. ఇప్పుడు నాకు పెళ్ళి చేసుకోవాలని కూడా లేదు.”అని ఆస్ చెప్పాడు. అతను మాట్లాడుతూ స్లాబ్లను కత్తిరిస్తున్నాడు. అతను కూడా తల నుండి కాలి వరకు దుమ్ముతో కప్పబడి ఉన్నాడు. అతనికి నెలకు 8,000 రూపాయలు వస్తాయి.

సమీపంలో, ఒక పసుపురంగు  సీతాకోకచిలుక సమాధుల చుట్టూ అనిశ్చితంగా తిరుగుతుంది, సమాధి రాళ్ళపై ఉంచిన పువ్వులను ముద్దాడాలా లేదా అని ఆలోచిస్తున్నట్టుంది.

శాసనాల రచయిత నిజాం ఇలా అంటాడు: “చనిపోయేవారు చనిపోతారు. అల్లాహ్ సహాయంతో, వారి పేరును చివరిసారిగా ఇచ్చేది నేను. ఈ సమాధి లో ఉన్న ఆకారం, ఒకప్పుడు ఒక వ్యక్తి - ఎవరికో ప్రియమైన వ్యక్తి.” అతని చుట్టూ తెలుపు మరియు నలుపు పెయింట్‌తో కప్పబడిన అతని బ్రష్‌లు, నిజాం కోరుకున్న విధంగా మెహ్రాబ్‌పై కదులుతాయి. అతను అరబిక్‌లో వ్రాస్తున్నప్పుడు చివరి పదం యొక్క చివరి అక్షరంపై ఒక నూక్తాను కొట్టాడు: ‘ప్రతి ఆత్మ మరణాన్ని రుచి చూస్తుంది’, అని మరో రాయిపై రాస్తాడు.

అనువాదం - అపర్ణ తోట

Amir Malik

ਆਮਿਰ ਮਿਲਕ ਇੱਕ ਸੁਤੰਤਰ ਪੱਤਰਕਾਰ ਹਨ ਤੇ 2022 ਦੇ ਪਾਰੀ ਫੈਲੋ ਹਨ।

Other stories by Amir Malik
Translator : Aparna Thota

Aparna Thota is a writer (Telugu & English) based out in Hyderabad. ‘Poorna’ and ‘Bold & Beautiful’ are her published works.

Other stories by Aparna Thota