“మై తేజ్ దౌడ్ కే ఆఊంగా, ఔర్ కూనో మే బస్ జాఊంగా (నేను పరుగు పరుగున వచ్చి కూనోలో స్థిరపడతాను).”
వినాలనుకునేవారు, లేదా చదవగలిగేవారితో ‘చింటూ’ అనే చిరుత ఒక పోస్టర్ ద్వారా ఇదే చెబుతోంది.
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు, మధ్యప్రదేశ్ అటవీ శాఖ ఆరు నెలల క్రితం ఈ పోస్టర్‌ని విడుదల చేసింది. పోస్టర్‌లో ఉన్న ‘స్నేహపూర్వక చిరుత’ చింటూ, ఇక నుండి ఆ అటవీ ప్రాంతంలోనే ఉండబోతుందన్న సందేశం, కూనో జాతీయ ఉద్యానవనం చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ప్రజలందరికీ చేరింది.
చింటూ ఉండాల్సింది తన తోటి 50 ఆఫ్రికన్ చిరుతలతోనే కానీ, బాగ్చా గ్రామంలో ఉండే 556 మంది మనుషులతో కాదు. ఈ ఆదివాసులను వారి ఆవాసాల నుంచి తొలగించి వేరొకచోటికి మార్చబోతున్నారు. ఈ ప్రవాసం, ప్రధానంగా అడవులతో పెనవేసుకుపోయి జీవించే సహరియా ఆదివాసుల జీవనోపాధికీ, వారి దైనందిన ఉనికికీ విఘాతం కలిగించబోతోంది.
ఇతర దేశాల నుండి తెచ్చిన చిరుతలను చూసేందుకు, ఎంతైనా ఖర్చు పెట్టి మరీ సఫారీ రైడ్‌లను ఏర్పాటు చేసుకోగలిగిన పర్యాటకులు మాత్రమే ఈ జాతీయ ఉద్యానవనానికి వస్తుంటారు. ఇది సహజంగానే ఎక్కువమంది దారిద్య్రరేఖకు దిగువగా ఉండే స్థానిక నివాసితులను అక్కడినుంచి తొలగిస్తుంది..
ఇదిలా ఉంటే, ‘ప్రియమైన’ ఈ మచ్చల పిల్లి పోస్టర్లను, కార్టూన్లను చూసి, అభయారణ్యానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న పైరా జాటవ్ గ్రామానికి చెందిన ఎనిమిదేళ్ల సత్యన్ జాటవ్ లాంటి పిల్లలు గందరగోళంలో పడ్డారు. “ఇది మేకనా?” అని ఆ అబ్బాయి తన తండ్రిని అడిగాడు. నాలుగేళ్ళ వయసున్న అతని తమ్ముడు అనురోధ్, అదొక రకమైన కుక్క అయి ఉంటుందని అభిప్రాయపడ్డాడు.














