"వాటిని కాల్చెయ్యండి!"
113 ఏళ్ళ వయసున్న మదరసా అజీజియాను మార్చి 31, 2023 రాత్రి తగులబెట్టిన నాటి నుండి మోహన్ బహదూర్ బుధా గుర్తుచేసుకున్న మాటలివి.
“కేకలు పెడుతున్న జనం గ్రంథాలయం ప్రధాన గేటును పగలగొట్టడం నాకు వినపడింది. నేను బయటకు వచ్చేసరికి, వాళ్ళు అప్పటికే గ్రంథాలయంలోకి ప్రవేశించి, దానిని ధ్వంసంచేస్తున్నారు,” అని 25 ఏళ్ళ ఈ సెక్యూరిటీ గార్డు చెప్పాడు.
ఆ గుంపు వద్ద “ భలా (బల్లెం), తల్వార్ (కత్తులు)లు ఉన్నాయి. వాళ్ళు ఇటుకలను కూడా ఆయుధాలుగా పట్టుకున్నారు. వో లోగ్ చిల్లా రహే థే , ' జలా దో , మార్ దో ' (వాళ్ళు 'చంపండి, కాల్చండి' అని అరుస్తున్నారు)."
ఒక అల్మారాలో 250 కల్మీ (చేతితో వ్రాసిన) పుస్తకాలున్నాయి. వీటిలో తత్వశాస్త్రం, వక్తృత్వం, వైద్యానికి సంబంధించిన పుస్తకాలు ఉన్నాయి
నేపాల్‌కు చెందిన బుధా గత ఏడాదిన్నర కాలంగా బిహార్‌షరీఫ్‌లోని మదరసా అజీజియాలో పనిచేస్తున్నాడు. "నేను వారిని ఆపమని కోరినప్పుడు, వాళ్ళు నాపై దాడి చేయడం మొదలుపెట్టారు. వాళ్లు నన్ను కొట్టి, ‘ సాలా నేపాలీ , భాగో యహాఁ సే , నహీ తో మార్ దేంగే ' (ఒరే నేపాలోడా, ఇక్కడ నుండి పారిపో! లేకుంటే మేం నిన్ను చంపేస్తాం) అని తిట్టారు."
మార్చి 31, 2023న నగరంలో జరిగిన రామనవమి ఊరేగింపులో మతపరమైన అల్లరిమూకలు మదరసా (ఇస్లామిక్ అధ్యయనానికి సంబంధించిన పాఠశాల, గ్రంథాలయం)కు నిప్పంటించిన సంఘటనలను గురించి అతను ప్రస్తావిస్తున్నాడు.
"గ్రంథాలయంలో ఏమీ మిగల్లేదు. ఇప్పుడు వాళ్ళకు సెక్యూరిటీ గార్డ్ అవసరం లేదు. నాకిప్పుడు ఉద్యోగం లేదు." అన్నాడు బుధా
ఈ మదరసా పైనే కాకుండా బిహార్‌లోని నలందా జిల్లా ప్రధాన కార్యాలయమైన బిహార్‌షరీఫ్ పట్టణంలోని ఇతర ప్రార్థనా స్థలాలపై కూడా మతతత్వ అల్లరిమూకలు దాడి చేసిన వారం రోజుల తర్వాత ఏప్రిల్ 2023 ప్రారంభంలో PARI మదరసా అజీజియాను సందర్శించింది. మొదట అధికారులు 1973 నాటి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC) సెక్షన్ 144 కింద నగరంపై ఆంక్షలు విధించారు; ఇంటర్నెట్‌ను మూసివేశారు. కానీ ఒక వారం తర్వాత ఈ రెంటినీ ఎత్తివేశారు.
మేం మదరసాను సందర్శించినప్పుడు ఒక మాజీ విద్యార్థి సయ్యద్ జమాల్ హసన్ అక్కడక్కడే నిరుత్సాహంగా తిరుగుతూ, "లైబ్రరీలో చాలా పుస్తకాలు ఉన్నాయి, కానీ నేను అవన్నీ చదవలేకపోయాను," అన్నారు. అతను చిన్నపిల్లవాడిగా 1970లో ఈ పాఠశాలలో 3వ తరగతి చదవడంతో ప్రారంభించి ఆలిమ్ (గ్రాడ్యుయేషన్) వరకు చదివారు.
"ఏమైనా మిగిలిందేమో చూద్దామని వచ్చాను," అన్నారు హసన్.
చుట్టుపక్కల చూస్తూవుంటే, ఒకప్పుడు తాను యువకుడిగా చదువుకున్న హాలును ధ్వంసం చేసి నేలమట్టం చేసినట్లు ఆ 70 ఏళ్ల వృద్ధుడికి స్పష్టమవుతూ ఉంది. ఎక్కడ చూసినా నల్లబడిపోయిన కాగితాలు, పూర్తిగా కాలిన, సగం కాలిన పుస్తకాల బూడిద కుప్పలే ఉన్నాయి. పాఠశాల ఉన్న రోజుల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు చదివిన, పరిశోధన చేసిన గ్రంథాలయపు గోడలు నల్లగా పొగచూరి, పగుళ్ళిచ్చాయి. కాలిన పుస్తకాల వాసన ఇంకా గాలిలో తేలియాడుతూనే ఉంది. పుస్తకాలను ఉంచిన పురాతనకాలపు చెక్క అలమారాలు బూడిదగా మారాయి.
ఈ 113 ఏళ్ళ వయసున్న మదరసా అజీజియాలో దాదాపు 4,500 పుస్తకాలు ఉన్నాయి. వాటిలో 300 పుస్తకాలు ఇస్లామ్ మత పవిత్ర గ్రంథాలైన ఖురాన్,హదీసుల రాతప్రతులు. పాఠశాల ప్రిన్సిపాల్ మహమ్మద్ షకీర్ ఖస్మీ మాట్లాడుతూ, “ఒక అల్మారాలో 250 కల్మీ (చేతితో రాసిన) పుస్తకాలు ఉన్నాయి. వాటిలో తత్వశాస్త్రం, వక్తృత్వం, వైద్యానికి సంబంధించిన పుస్తకాలు ఉన్నాయి. ఇవి కాకుండా, 1910 సంవత్సరం నుండి ఇప్పటివరకూ చదువుతున్న విద్యార్థుల అడ్మిషన్ రిజిస్టర్లు, మార్కు షీట్లు, సర్టిఫికేట్లు ఈ గ్రంథాలయంలో ఉన్నాయి.
ఆ దురదృష్టకరమైన రోజును గుర్తు చేసుకుంటూ ఖస్మీ ఇలా అంటారు, “నేను సిటీ ప్యాలెస్ హోటల్ దగ్గరికి చేరుకునేసరికి, నగరంలో పరిస్థితి చాలా తీవ్రంగా ఉండటాన్ని గమనించాను.. ఎక్కడ చూసినా పొగ మాత్రమే కనిపించింది. (రాజకీయ) పరిస్థితులు మనం నగరంలోకి ప్రవేశించటానికి వీలుగా లేవు."
ప్రిన్సిపాల్ మరుసటి రోజు ఉదయానికి మాత్రమే మదరసాలోకి ప్రవేశించగలిగారు. దాదాపు 3 లక్షల మంది జనాభా ఉన్న నగరం మొత్తం మీద విద్యుత్ లేదు. “నేను తెల్లవారుజామున నాలుగు గంటలకు ఒంటరిగా వచ్చాను. నా మొబైల్ టార్చ్ వెలుగులో గ్రంథాలయం వైపు చూసి నేను మ్రాన్పడిపోయాను. నన్ను నేను కూడగట్టుకునే శక్తి కూడా లేకుండాపోయింది.”
*****
మదరసా అజీజియా ప్రవేశ ద్వారం దగ్గర అరడజను మందికి పైగా వ్యాపారులు రోడ్డు పక్కనే చేపలు అమ్ముతూవున్నారు. ఈ ప్రాంతమంతా కొనేవాళ్ళ, దుకాణదారుల మోల్ భా వ్ (బేరసారాలు)తో రద్దీగా ఉంది. రహదారి మీద వాహనాలు వెళుతున్నాయి; అంతా మామూలుగా ఉన్నట్టే కనిపిస్తోంది.
“మదరసాకు పడమర వైపు ఒక దేవాలయం, తూర్పు వైపు ఒక మసీదు ఉన్నాయి. ఇది గంగా - జముని తెహజీబ్ (సంస్కృతుల చారిత్రక సమ్మేళనం) బెహతరీన్ అలామత్ (ఉత్తమ సంకేతం)," అని ప్రిన్సిపాల్ ఖస్మీ పేర్కొన్నారు.
“వారు మా ఆజాన్ (ప్రార్థనలు) వల్ల, లేదా వారి భజనల (భక్తి పాటలు) వల్ల మేమూ ఎప్పుడూ ఇబ్బంది పడలేదు. అల్లరి మూకలు మన తెహజీబ్ (సంస్కృతి)ని పాడు చేస్తాయని నేను ఊహించలేదు. ఇందుకు చాలా విచారంగా ఉంది.”
మరుసటి రోజు కూడా అల్లరిమూకలు పెట్రోల్ బాంబులు విసిరి మిగిలిన గదులను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారని పాఠశాలలోని మరికొందరు చెబుతున్నారు. డజనుకు పైగా దుకాణాలను, గోడౌన్లను ధ్వంసం చేశారు; దోచుకున్నారు. తమకు జరిగిన నష్టాలను పేర్కొంటూ ఆ ప్రాంతంలోనూ, చుట్టుపక్కలా స్థానికులు నమోదుచేసిన అనేక ప్రథమ సమాచార నివేదికల (ఎఫ్‌ఐఆర్) కాపీలను ఈ రిపోర్టర్‌కు చూపించారు.
బిహార్‌షరీఫ్‌లో మత హింస జరగటం కొత్తేమీ కాదు. 1981లో, ఒక పెద్ద మతపరమైన అల్లర్లు నమోదయ్యాయి, అయితే ఆ సమయంలో కూడా గ్రంథాలయంపై, మదరసా పై దాడి జరగలేదని స్థానికులు చెప్పారు.
*****
1896లో బీబీ సోఘ్రా స్థాపించిన మదరసా అజీజియాలో మొత్తం 500 మంది బాలబాలికలు చదువుకోడానికి చేరారు. ఇక్కడ చేరిన విద్యార్థులు బిహార్ స్టేట్ బోర్డ్‌కు సమానమైన పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని పూర్తి చేయవచ్చు.
ఆ ప్రాంతంలో భూస్వామి అయిన తన భర్త అబ్దుల్ అజీజ్ మరణించిన తర్వాత బీబీ సోఘ్రా దీనిని ఏర్పాటు చేశారు. "ఆమె బీబీ సోఘ్రా వక్ఫ్ ఎస్టేట్‌ను కూడా స్థాపించారు. భూమి ద్వారా వచ్చే ఆదాయాన్ని సామాజిక సేవ కోసం ఉపయోగించారు. విద్య, ఒక వైద్యశాల, మసీదుల నిర్వహణ, పెన్షన్లు, ఆహార పంపిణీ, ఇంకా మరిన్ని సేవలకోసం కోసం మదరసా ను నడుపుతున్నారు" అని హెరిటేజ్ టైమ్స్ వ్యవస్థాపకుడు ఉమర్ అష్రఫ్ చెప్పారు.
ఈ మదరసా కౌమార విద్యా కార్యక్రమం అయిన తాలిమ్-ఇ-నౌబాలిగాన్ ప్రాజెక్ట్‌లో కూడా భాగం. ఈ ప్రాజెక్ట్ యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ (UNFPA), బిహార్ మదరసా బోర్డు, బీహార్ విద్యా శాఖల ద్వారా 2019లో ప్రారంభమయింది.
"బహుశా ఈ గాయం ( మదరసా , గ్రంథాలయం కాలిపోవడం) కొద్దిగా నయం కావచ్చు, కానీ అది మాకు బాధను కలిగిస్తూనే ఉంటుంది," అని బీబీ సోఘ్రా వక్ఫ్ ఎస్టేట్ నిర్వాహకులు ముఖ్‌తారుల్ హక్ చెప్పారు.
ఈ కథనానికి రాష్ట్రంలోని అట్టడుగు వర్గాల కోసం పోరాడుతూ జీవితాన్ని గడిపిన బిహార్‌కు చెందిన ట్రేడ్ యూనియన్ నాయకుడి జ్ఞాపకార్థం ఏర్పాటుచేసిన ఫెలోషిప్ మద్దతు ఉంది.
అనువాదం: సుధామయి సత్తెనపల్లి