ఈ ప్యానెల్ కనిపించే పని, కనిపించని మహిళలు అనే ఛాయాచిత్ర ప్రదర్శన (ఫోటో ఎగ్జిబిషన్) లో భాగంగా ఉంది . ఈ ప్రదర్శన గ్రామీణప్రాంతాలలో మహిళలు చేసే ఉన్నతస్థాయి పనిని వర్ణించే ఫోటోల ఎగ్జిబిషన్. ఇందులోని ఛాయాచిత్రాలను పి. సాయినాథ్ 1993 నుండి 2002 మధ్యకాలంలో 10 భారతీయ రాష్ట్రాలలో పర్యటించి, తీశారు. అనేక సంవత్సరాల పాటు దేశంలోని చాలా ప్రాంతాల్లో ప్రదర్శించబడిన ఈ ఫోటో ఎగ్జిబిషన్ ను, PARI సృజనాత్మకంగా డిజిటలైజ్ చేసింది.
సంతకు పోదాం, సంతకు...
ఆ వెదుర్లు వాటిని అక్కడికి తెచ్చిన మహిళల కంటే మూడింతలు ఎత్తుగా ఉన్నాయి. ఝార్ఖండ్‌లోని గొడ్డాలో జరిగే వారపు సంతకు (హాట్- గ్రామీణ ప్రాంతపు బజారు) ప్రతి మహిళా ఒకటో రెండో వెదుర్లను అమ్మకానికి తెస్తుంటారు. వెదుర్లను భుజమ్మీదనో తలపైనో మోస్తూ 12 కిలోమీటర్లు నడిచి సంతకు వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. ఈ సంతకు రావడానికి ముందు వీరంతా, సహజంగానే, అడవిలో వెదుర్లను నరుకుతూ గంటలతరబడి గడిపివుంటారు.
ఇంత ప్రయత్నమూ చేసి ఆ రోజు ముగిసేసరికి 20రూ.లు సంపాదించగలిగితే వాళ్ళు అదృష్టవంతులనే చెప్పాలి. గొడ్డాలోనే ఉన్న ఇంకో సంతకు వెళ్తున్నవాళ్ళలో కొందరు ఇంతకన్నా తక్కువే సంపాదిస్తారు. తలలమీద ఇంతెత్తున ఆకుల కట్టలను మోసుకొస్తూ ఉన్న ఆ మహిళలు ఆ ఆకుల్ని వారే సేకరించి వాటిని విస్తళ్ళుగా కలిపి కుట్టారు. ఆ ఆకులతో వాళ్ళు అద్భుతమైన వాడి పడేసే విస్తళ్ళను తయారుచేస్తారు. టీ దుకాణాలవాళ్ళు, హోటళ్ళవాళ్ళు, క్యాంటీన్లవాళ్ళు ఈ ఆకులను వందల లెక్కన కొంటారు. దాంతో ఈ మహిళలకు 15-20 రూ.లు వస్తుండవచ్చు. ఈసారి రైల్వే స్టేషన్‌లో ఈ ‘ఆకు పళ్ళేలలో’ తింటున్నప్పుడు, ఇప్పుడు మీకు తెలుసు, అవి ఎక్కడినుంచి వచ్చాయో!









