ఈ ప్యానెల్ కనిపించే పని , కనిపించని మహిళలు అనే ఛాయాచిత్ర ప్రదర్శన (ఫోటో ఎగ్జిబిషన్) లో భాగంగా ఉంది . ఈ ప్రదర్శన గ్రామీణప్రాంతాలలో మహిళలు చేసే ఉన్నతస్థాయి పనిని వర్ణించే ఫోటోల ఎగ్జిబిషన్ . ఇందులోని ఛాయాచిత్రాలను పి . సాయినాథ్ 1993 నుండి 2002 మధ్యకాలంలో 10 భారతీయ రాష్ట్రాలలో పర్యటించి , తీశారు . అనేక సంవత్సరాల పాటు దేశంలోని చాలా ప్రాంతాల్లో ప్రదర్శించబడిన ఈ ఫోటో ఎగ్జిబిషన్ ను , PARI సృజనాత్మకంగా డిజిటలైజ్ చేసింది.
ఇటుకలు, బొగ్గు, రాయి
వారికి కేవలం కాళ్ళకు చెప్పులు లేకపోవడమే కాదు - వారి తలపై ఉన్నవి వేడి ఇటుకలు. ఆ ర్యాంప్‌పై నడుస్తున్నవారు ఒడిశా నుంచి వలస వచ్చి, ఆంధ్రప్రదేశ్‌లోని ఇటుక బట్టీలో పనిచేస్తున్నవారు. అక్కడ బయట ఉష్ణోగ్రత 49 డిగ్రీల సెల్సియస్‌గా ఉండగా, మహిళలు ఎక్కువగా పనిచేసే కొలిమి ప్రాంతంలో అంతకంటే చాలా వేడిగా ఉంటుంది.
ఒకరోజు కూలిగా ప్రతి మహిళకు లభించేది రూ. 10-12. అది పురుషులు పొందుతున్న కనాకష్టమైన రూ. 15-20 మధ్య ఉన్న రోజు కూలి కంటే కూడా తక్కువ. కాంట్రాక్టర్లు ముందస్తు 'అడ్వాన్స్'లు అప్పుగా ఇచ్చి, అటువంటి వలసదారుల కుటుంబాలకు కుటుంబాలనే ఇక్కడికి రవాణా చేస్తారు. ఈ అప్పులు వలసదారులను కాంట్రాక్టర్‌కు కట్టిపడేస్తాయి; చివరికి వారు వెట్టి కార్మికులుగా మిగిలిపోతారు. ఇక్కడికి వలసవచ్చేవారిలో 90 శాతం మంది భూమి లేనివారు లేదా సన్నకారు రైతులే.







