ప్రతి ఉదయం ఉత్తరప్రదేశ్ లోని చిత్రకూట్ జిల్లాలో ఉండే మాణిక్‌పూర్ రైల్వేస్టేషన్‌కు అనేక గ్రామాల నుంచి జనం వస్తుంటారు. వారిలో ఎక్కువమంది ఆదివాసీ, దళిత సమూహాలకు చెందినవాళ్ళే. చుట్టుపక్కల వంద కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఊళ్ళ నుంచి వీళ్ళుజనాలను కూడగట్టి చేరవేసే జీపులలోను, ఆటోలలోను, సైకిళ్ళపైనా వస్తారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ సరిహద్దులలోని పాఠా అడవుల నుంచి ఒక్కొక్కటి 20 నుండి 50 కిలోల బరువుండే వందలాది కట్టెల మోపులను మోసుకొని వస్తారు.
ఆ కట్టెలను సమీపంలోని మార్కెట్లలో అమ్మితే వచ్చే డబ్బే ఆ కుటంబాలకు స్థిరమైన ఆదాయం. చెట్లను సంరక్షించే చట్టాలు చెట్లను నరకడాన్ని నిరోధించాయి. కానీ జీవనాధారం కోసం వంటచెరకును అమ్ముతున్న స్థానిక సమూహాలకు భూములుండవు. కొద్దోగొప్పో ఉన్నా అవి పంటలకు అనువైనవి కావు. దగ్గరలో ఉన్న పట్టణాలలో భవననిర్మాణ స్థలాల్లో రోజు కూలికి పనిచేస్తే వచ్చే ఆదాయమొక్కటే వారికి నికరమైనది.
మాణిక్‌పూర్, కర్వి(మాణిక్‌పూర్‌కు 30కిలోమీటర్ల దూరం), శంకర్‌ఘర్ లనుంచి తెందు (తునికి), పలాశ్ (మోదుగ) చెట్ల కట్టెల మోపులను తీసుకుని పాసింజర్ రైళ్ళలో పోతారు. అలహాబాద్ మార్గంలో వెళ్ళే ఆ రైళ్ళలో ప్రయాణించి దాదాపు 80 కిలోమీటర్ల దూరం వరకు ఉండే పట్టణాలలోని మార్కెట్లకు తీసుకుపోయి అక్కడ అమ్ముతారు.
కట్టెల ఎండుదనం, నాణ్యతను బట్టి, ఆయా కాలాల్లో వాటికి ఉండే గిరాకీని బట్టి రోజయ్యేటప్పటికి వీరు 150 నుంచి 300 రూపాయలవరకు సంపాదించగలుగుతారు.
వంటచెరకు అమ్మేవారు తమ పేర్లు వెల్లడించడానికి ఇష్టపడకపోవడంతో ఈ కథనంలో వాళ్ళ పేర్లను ప్రస్తావించలేదు.
అనువాదం: వి.వి. జ్యోతి