నా గమ్యస్థానానికి చేరుకున్నానని గూగుల్ మ్యాప్స్ చెప్పింది. కానీ ఆ ప్రాంతం నా జ్ఞాపకాలకు భిన్నంగా, కాస్త కొత్తగా అనిపించింది. క్రితంసారి ఉప్పాడకు వచ్చినప్పుడు సముద్రపు ఒడ్డున శిథిలావస్థలో ఉన్న ఒక పాత ఇంటి కో-ఆర్డినేట్స్‌ను నేను ఫోన్‌లో భద్రపరుచుకుని ఉన్నాను. దాని ఆనవాళ్లు ఇప్పుడు తెలియడం లేదు. “ఓహ్, ఆ ఇల్లా? అది ఇప్పుడు సముద్రంలో ఉంది - అక్కడ!” అని బంగాళా ఖాతంలో నుండి ఎగిసిపడుతోన్న ఒక అలవైపు చూపిస్తూ టి. మారమ్మ చెప్పారు.
2020 మార్చి నెలలో దేశవ్యాప్త లాక్‌డౌన్‌కు కొన్ని వారాల ముందు మారమ్మను, ఆమె కుటుంబ సభ్యులను నేను ఫోటోలు తీశాను. ఆ ఫోటోల బ్యాక్‌గ్రౌండ్‌లో ఆ ఇల్లు అద్భుతంగాను, ఏదో నిగూఢమైన విషాదాన్ని దాచుకున్నట్టు అనిపించడం స్పష్టంగా గుర్తుంది. ఈ ఇల్లు, అంతగా వెడల్పు లేని ఒక బీచ్‌లో సముద్రానికి చాలా దగ్గరగా ప్రమాదకరంగా నిలబడి ఉండింది. ఈ శతాబ్దపు తొలి నాటి వరకు మారమ్మ ఉమ్మడి కుటుంబం ఈ ఇంట్లోనే నివాసం ఉండేవారు. ఆ ఇంట్లో కొంత భాగం మాత్రమే ధ్వంసం కాకుండా నిలబడి ఉండేది.
“ఇందులో ఎనిమిది రూములు, మూడు షెడ్లు [పశువుల కోసం] ఉండేవి. ఇక్కడ సుమారు వంద మంది కలిసి ఉండేవాళ్లం,” అని మారమ్మ చెప్పారు. ఈమె స్థానికంగా ఒక చిన్న స్థాయి రాజకీయ నాయకురాలు, గతంలో చేపల వ్యాపారం చేసేవారు. 2004 సునామీకి ముందు వచ్చిన ఒక తుఫాను తాకిడి వల్ల ఈ భవనంలో అధిక భాగం దెబ్బతిని సముద్రంలో కలిసిపోయింది. దాంతో ఆ ఉమ్మడి కుటుంబం విడిపోయి వేర్వేరు ఇళ్లలోకి మారాల్సి వచ్చింది. మారమ్మ అదే భవనంలో ఇంకొన్నేళ్లపాటు నివసించి ఆ తర్వాత దగ్గర్లోని మరో ఇంటికి మారారు.
మారమ్మ, ఆమె కుటుంబ సభ్యులు మాత్రమే కాదు; సముద్ర విస్తరణ వల్ల ఉప్పాడలో దాదాపు అందరూ కనీసం ఒక్కసారైనా వేరే ఇళ్లకు మారాల్సి వచ్చింది. తమ జీవితంలో చవిచూసిన అనుభవాన్ని బట్టి, స్థానిక ప్రజలకు సముద్రపు అలలపై ఉండే అవగాహనను బట్టి ఎప్పుడు ఇళ్లు మారాలా అని వారు అంచనా వేసుకుంటారు. “అలలు మున్ముందుకు రావడం మొదలుపెట్టగానే మా ఇల్లు కూడా సముద్రంలో మునిగిపోతుందని మాకు అర్థం అవుతుంది. అప్పుడు మా వంట సామాగ్రి, ఇతరత్రా వస్తువులన్నీఒకవైపు పేర్చుతాము, [ఆ తర్వాత తాత్కాలికంగా ఉండేందుకు అద్దె ఇల్లు వెతుక్కుంటాం]. అలా మేము అంచనా వేసుకున్న ఒక నెలలోపే పాత ఇల్లు [సముద్రంలో] మునిగిపోతుంది,” అని ఓ. శివ వివరించారు. తనకు 14 ఏళ్లే అయినా, ఈ వయసులోనే ఇదివరకే ఒకసారి ముంపును తప్పించుకోవడానికి ఇల్లు మారాడు.















