ఉదయం 6 గంటల సమయం. శరణ్య బలరామన్ అప్పటికే గుమ్మిడిపూండిలోని తన ఇంటి నుండి బయలుదేరుతున్నారు. చెన్నైకి సమీపంలో ఉండే తిరువళ్లూరు జిల్లాకు చెందిన ఈ చిన్న పట్టణంలోని రైల్వే స్టేషన్‌లో, ఆమె తన ముగ్గురు పిల్లలతో లోకల్ రైలు ఎక్కుతారు. దాదాపు రెండు గంటల ప్రయాణం తర్వాత 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెన్నై సెంట్రల్ స్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి తల్లి, పిల్లలు మరో లోకల్ రైలులో 10 నుంచి 12 కిలోమీటర్లు ప్రయాణించి పాఠశాలకు చేరుకుంటారు.
సాయంత్రం 4 గంటలకు, ఇదే ప్రయాణం వ్యతిరేక దిశలో సాగుతుంది. వారు ఇంటికి తిరిగి వచ్చేసరికి సమయం 7 గంటలవుతుంది.
ఇంటి నుండి పాఠశాలకు, తిరిగి ఇంటికి రోజుకు 100 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణం. ఇలా వారానికి ఐదుసార్లు జరుగుతుంది. శరణ్యకు ఇది ఒక సాహసకార్యమే. “అంతకుముందు (ఆమెకు పెళ్లి కాకముందు), నాకు బస్సు గానీ రైలు గానీ ఎక్కడ ఎక్కాలో తెలిసేదికాదు. అలాగే ఎక్కడ దిగాలో కూడా,” అని ఆమె వివరించారు.

























