నిసత్తువగా పడి ఉన్న స్మశానాలు, ప్రాణవాయువు లేని ఆసుపత్రుల మధ్య ఆమె జీవించింది. ఇస్మాయిల్! ఊపిరి పీల్చుకోవటానికి నువ్వెంత పోరాటం చేశావు! వైద్యులు జైలుకి వెళుతున్న, రైతులను ఉగ్రవాదులుగా చూస్తున్న, ఈ గడ్డమీద ఆమె బతికింది. ప్రియమైన నజియా, సోహ్రాబ్... బంగారుకొండ అయ్లీన్... ఇక పై వాళ్ల కడుపులను ఆమె ఎలా నింపగలుగుతుంది? మనుషులను వస్తువులుగా మార్చి, ఆవులను పవిత్రంగా భావించిన ఈ భూమి మీద ఆమె మనగలిగింది. ఉన్న చిన్నచెక్క భూమి ఆమె భర్త మందులకు అమ్ముడుబోయింది. ఆమె ఇప్పుడు ఎక్కడ తలదాచుకొంటుంది?
విగ్రహాలు, మరుగుదొడ్లు, నకిలీ పౌరసత్వాల వాగ్దానాలు - దౌర్జన్యాలకు సాధికారత ఇస్తున్న నేల మీద ఆమె జీవించింది. స్మశానాల దగ్గరి అంతులేని క్యూల నుండి ఆమె బతికి బయటపడ్డా, శవాలగోతులు తవ్విన వాళ్లకు ఆమె ఏమి ఇవ్వగలదు ? వ్యవస్థ కూలిపోనున్నదా, లేక మొదటి నుంచి ఇలాగే ఉన్నదా - అని కామెంట్లలోనో, కాపచినో తాగుతూనో బాబూ, బీబీలు మేధోపరమైన వాదనలు చేసే భూమి మీద ఆమె జీవించింది.
సోహ్రాబ్ ను ఎవరూ ఓదార్చలేకపోయారు. నజియా స్థాణువైపోయింది. వెలసిపోయిన అమ్మ కొంగును చుట్టుకొని అయ్లీన్ మూసిముసి నవ్వులు నవ్వింది. అంబులెన్స్ మనిషి 2000 రూపాయలు అదనంగా అడిగాడు. భర్త శవాన్ని తాకవద్దని పొరుగువాళ్లు ఆమెను హెచ్చరించారు. గత రాత్రి ఎవరో ఆమె తలుపు మీద పిచ్చిరాతతో ‘కత్వా సాలా’ (ముసల్మాన్ కుక్క) అని రాశారు. జనాలు రెండో లాక్ డౌన్ గురించి గుసగుసలాడుతున్నారు.
సోహ్రాబ్ స్పృహ తప్పి పడిపోయాడు. నజియా తన తండ్రి శవంపై కఫాన్ ని వేళ్లనుంచి రక్తం వచ్చేంత గట్టిగా పట్టుకుంది. ఐదు బొట్ల రక్తం తెలుపుకు వీడ్కోలునిచ్చింది . అయ్లీన్ నిద్రపోయింది. నిన్న చవక దుకాణదారుడు 50కేజీల బియ్యం బస్తాను దాచుకొని పట్టుబడ్డాడు. రైల్వేల నుండి టీకాల వరకూ, మంత్రుల నుండి పొత్తిళ్లలో పసిపాపల వరకూ - అన్నీ డబ్బున్నోడికి అమ్ముడుబోయే చోట ఆమె జీవించింది.
ఆమె తన పొలాన్ని పోగొట్టుకుంది . కానీ షెడ్లో ఇస్మాయిల్ వేసుకునే దివ్యమైన తెల్లటి జుబ్బా కింద ఫోలీడాల్ సీసా అలానే ఉంది. ఇస్మాయిల్ గ్రామ మసీదులో - ముజీన్ (అజా పాడేవాడు). ఈ నయీ బీమారీ తన తల్లినీ, అన్ననీ, భర్తనీ -ఒకరి తరువాత ఒకరిని తీసుకెళ్ళిపోయింది. అయినా ఆమె ముగ్గురు పిల్లలు ఆమెకు తన జీవితంలో మిగిలి ఉన్న ఖిలాబ్ (మక్కా మసీదు దశ), మీహ్ రాభ్ లు (ఇమామ్ ప్రార్థన చేసే మధ్య ద్వారం) నజియా వయసు 9 సంవత్సరాలు, సోహ్రాబ్ వయసు 13 సంవత్సరాలు, అయ్లీన్ కేవలం 6 నెలల పాప. ఇప్పుడిక ఆమెకు వేరే దారి లేదు.










