మహమ్మద్ షామిమ్ కుటుంబంలో ముగ్గురూ ఉత్తరప్రదేశ్ లోని తమ స్వగ్రామానికి రైలులో వెళ్లాల్సి ఉంది. అయితే అతను తమ వెయిట్ లిస్ట్ టికెట్లలో ఒక్క టిక్కెటుకు అయినా రిజర్వేషను ఖరారు అయ్యేలా చూడమని రైల్వే టికెటింగ్ ఏజెంటును ప్రాధేయపడుతున్నాడు. “ నా భార్యకు సీటు ఖరారు అయితే చాలు. నేను ఏదో రకంగా ప్రయాణం చేసేస్తాను. ఎటువంటి పరిస్థితుల్లో అయినా నేను ప్రయాణం చేయగలను. పరిస్థితులు గతంలోలా దిగజారిపోకమునుపే మేము ఇంటికి చేరిపోవాలి” అని షామిమ్ అన్నాడు.
“సీటు ఖరారు కావడానికి ఏజెంటు టికెట్టుకు రూ. 1600 అడుగుతున్నాడు. రూ. 1400కి చేసిపెట్టమని బేరం ఆడాను. మాకు ఒక సీటు ఖరారు అయితే ముగ్గురం రైలు ఎక్కేసి ఆ తర్వాత జరిమానా కట్టేస్తాం” అని షామిమ్ అన్నాడు. ముంబై నుంచి ఉత్తరప్రదేశ్ వెళ్లడానికి టికెట్ ధర సాధారణంగా రూ. 380-500 ల మధ్య ఉంటుంది. షామిమ్ అన్నలిద్దరూ ఉత్తరప్రదేశ్ లోని ఫైజాబాద్ జిల్లా మసోదా బ్లాక్ కు చెందిన అబ్బూ సరాయి గ్రామంలో వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్నారు.
కోవిడ్-19 వ్యాప్తిని నిలువరించడానికి మహారాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన నిబంధనలు మరోసారి కర్మాగారాల మూసివేతకూ, నిరుద్యోగానికీ , నిర్మాణ పనుల స్తంభనకూ దారితీసాయి. ఈ కారణంగా ఇరవై రెండేళ్ల షామిమ్ గానీ, ముంబై లోని అసంఖ్యాక వలస కార్మికులు గానీ పది నెలల కాలంలో స్వగ్రామాలకు ప్రయాణం కావడం ఇది రెండోసారి.
ముంబై లోని ప్రధాన రైల్వే స్టేషన్ల నుంచి- ముఖ్యంగా బంద్రా, లోకమాన్య టెర్మినస్ల నుంచి ఉత్తరాదిలోని ఉత్తరప్రదేశ్, బిహార్ ప్రాంతాలకు పలు రైళ్లు బయలుదేరతాయి. పనుల మీదా, ప్రయాణాల మీదా ఏప్రిల్ 14 నుంచి రాష్ట్రంలో పరిమితులు అమలు అయ్యాయి. దీనికి ముందే ఏప్రిల్ 11-12 తేదీల నాటికే పెద్ద సంఖ్యలో వలస కార్మికులు తమ స్వగ్రామాలకు పయనం కావడంతో ఈ స్టేషన్లు వారితో నిండిపోయాయి. ఇంకా ఏయే నిబంధనలు వస్తాయో అన్న ఆందోళనతో చాలామంది స్వగ్రామాలకు వెళ్లిపోయే ప్రయత్నంలో ఉన్నారు.
శివసేన నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం కర్ఫ్యూ ,ఇతర నియమాలను మరో ‘ లాక్ డౌన్ ‘ అని పిలువనప్పటికీ షామిమ్ ఈ పదజాలం పట్ల నిరుత్సాహం వెళ్ళగక్కారు. “ రెండో సారి మా కూలికి పడ్డ గండి ఇది. ఇప్పటికే అది మమ్మల్ని నష్టపరచింది” అని షామిమ్ అన్నాడు.






