ఇది కాస్త వింతగా తోచవచ్చు- కాని ఢిల్లీలోని జిటి కర్నాల్ బైపాస్ వద్ద అందరి కళ్ళ ముందే జరిగింది.
నిరసన స్థలాల నుండి కొన్ని ట్రాక్టర్లు ఢిల్లీ వైపుగా వెళ్తున్నప్పుడు- వాటికి ఢిల్లీ నుండి సింఘు వైపు వెనక్కి వస్తున్నమరికొన్ని ట్రాక్టర్లు ఎదురుపడ్డాయి. ఈ గందరగోళాన్ని అర్దం చేసుకోవడానికి ప్రయత్నిస్తే అర్ధమైన విషయమిది- ఢిల్లీ నుండి తిరిగి వచ్చే బృందం పోలీసులు ఒప్పుకున్న దారిలో కాక, తమ నాయకులు వేరే దారిలో రాజధాని వెళ్లాలనుకున్నారని అపోహపడి ఉదయమే రాజధానిలోకి వెళ్లి, మళ్లీ వారి నాయకులు తిరిగి రమ్మన్నారని వెనక్కి వస్తోంది.
సెప్టెంబరులో పార్లమెంటులో ప్రవేశించిన మూడు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన రైతులు తమ సొంత పద్ధతిలో రిపబ్లిక్ డే పరేడ్‌ను నిర్వహించారు, ఢిల్లీ సరిహద్దుల్లో సింగు, తిక్రీ, ఘాజిపూర్, చిల్లా మరియు మేవాట్ వంటి వివిధ ప్రాంతాల నుండి ఢిల్లీవైపుగా తరలివెళ్లారు. రాజస్థాన్-హర్యానా సరిహద్దులోని షాజహాన్పూర్ వద్ద కూడా ఒక మార్చ్ జరిగింది, ఇక్కడ భారతదేశ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వాహనాలు దాదాపు 60 కిలోమీటర్ల దూరం ప్రయాణించాయి. అఖిల భారత కిసాన్ సభ చెప్పినట్లుగా, “ఇది అత్యంత ప్రజాదరణ పొందిన మరియు పౌర వేడుక”, అనవచ్చు.
ఇది చాలా భారీగా శాంతియుతంగా క్రమశిక్షణతో జరిగిన అపూర్వమైన విన్యాసం , సాధారణ పౌరులు, రైతులు, కార్మికులు మరియు ఇతరులు మనది రిపబ్లిక్ దేశం అని మళ్లీ మళ్లీ చెప్పారు. ఈ కార్యక్రమంలో అనేక వేల ట్రాక్టర్ల పైన లక్షలాది మంది ప్రజలు పాల్గొన్నారు. అంతేగాక భారత యూనియన్‌లోని దాదాపు అన్ని రాష్ట్రాల్లోని వివిధ ప్రదేశాలలో ఇటువంటి వేడుకలు చేసి అన్నింటిని సమన్వయపరిచారు.
కానీ ఇంత ఆశ్చర్యకరమైన స్థాయిలో సాగుతున్న ఈ అద్భుతమైన దృశ్యాన్నుంచి, వీటన్నితో సంబంధం లేని మరొక విషయం మీదకి మీడియా చూపులను ఒక చిన్న సమూహం మళ్లించగలిగింది. రెండు నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో నిరసనలకు నాయకత్వం వహిస్తున్న 32 వ్యవసాయ సంఘాలతో కూడిన సమ్యూక్తా కిసాన్ మోర్చా (ఎస్‌కెఎం) ఢిల్లీలోకి ప్రవేశించిన సమూహాల హింస మరియు విధ్వంసాలను, వారు నిర్దేశించిన మార్గం గుండా కాక వేరే మార్గాల ద్వారా ఢిల్లీ కి చేరడాన్ని తీవ్రంగా ఖండించింది. SKM వారి చర్యను "శాంతియుతంగా జరుగుతున్న రైతుల పోరాట బలాన్ని పడగొట్టడానికి వేయబడిన పెద్ద కుట్ర" అని మండిపడింది.



















