"ఈ సంవత్సరం లోహ్రీ, భోగి మంటలో రైతు వ్యతిరేక చట్టాలను ముద్రించిన పత్రాలను కాల్చిన సమయంగా గుర్తించబడుతుంది" అని చెప్పారు పంజాబ్ యొక్క సంగ్రూర్ జిల్లావాసి, సుఖ్దేవ్ సింగ్. 60 పై బడ్డ సింగ్, తన జీవితంలో ఎక్కువ భాగం రైతుగానే గడిపారు. ప్రస్తుతం, ఈయన హర్యానా- ఢిల్లీ సరిహద్దులోని సింఘు వద్ద ఉన్న వేలాది మంది నిరసనకారులలో ఒకరు.
"ఈ లోహ్రీ భిన్నంగా ఉంటుంది," అని ఆయన చెప్పారు. "సాధారణంగా, మేము మా ఇళ్లలో మా బంధువులతో, వచ్చేపోయే స్నేహితులతో గడుపుతాము.మాకు ఇది ఒక ఉల్లాస సమయం. కానీ ఈ సంవత్సరంలో, మేము మా పొలాలకూ ఇళ్ళకు దూరంగా ఉన్నాము. అయినా మేము ఇంకా కలిసి ఉన్నాము. ప్రస్తుత ప్రభుత్వ పదవీకాలం ముగిసే వరకు ఇక్కడే ఉండాలమో కూడా! ఐనా పర్లేదు, చట్టాలు రద్దు అయ్యే వరకు మేము వెనక్కి వెళ్ళము."
ప్రసిద్ధ లోహ్రీ పండుగను ప్రధానంగా పంజాబ్ మరియు ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో జరుపుకుంటారు. ఇది సాధారణంగా మకర సంక్రాంతికి ముందు రోజు (అంటే శీతాకాలంలో నెల చివరి రోజు) జరుపుకోబడుతుంది.. ఇది వసంతకాలానికి ప్రారంభం కూడా. ఈ పండుగకు ప్రజలు భోగి మంటలను వెలిగిస్తారు, బెల్లం, వేరుశనగ, నువ్వులు మరియు ఇతర సాంప్రదాయ ఆహార పదార్థాలను సూర్యుడికి సమర్పిస్తారు, ముఖ్యంగా ఆనందం, సమృద్ధి, మంచి పంట కోసం ప్రార్థిస్తారు.
జనవరి 13 న, అంటే ఈ సంవత్సరం లోహ్రీకి, సింఘు సరిహద్దు వద్ద, నిరసన మార్గంలో అనేక ప్రదేశాలలో భోగి మంటలు వెలిగించి, పేపర్ల పై ముద్రించిన మూడు వ్యవసాయ చట్టాలను మంటలో వేసి తగలబెట్టారు. రైతులు సంఘీభావం తెలిపే నినాదాలకు గళమెత్తారు. వారి ట్రాక్టర్ల పక్కన వెలిగించిన పవిత్రమైన మంటల్లో పేపర్లు అదృశ్యమవుతుండగా కలిసి ఆడి పాడారు.
రైతులు నిరసన తెలిపే చట్టాలు - రైతు (సాధికారత మరియు రక్షణ) ధరల భరోసా మరియు వ్యవసాయ సేవల చట్టం, 2020; రైతు ఉత్పత్తి వాణిజ్యం (ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్) చట్టం, 2020; మరియు ఎసెన్షియల్ కమోడిటీస్ (సవరణ) చట్టం, 2020 . భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ను బలహీనం చేస్తూ, పౌరులందరికీ వాజ్యం వేయగల చట్టబద్దమైన హక్కును నిలిపివేస్తున్నందున ఈ చట్టాలు ప్రతి భారతీయుడిని ప్రభావితం చేస్తాయని విమర్శించారు.
అనువాదం - అపర్ణ తోట