"ఈ పోరాటం రైతులది మాత్రమే కాదు, వ్యవసాయ కూలీలది కూడా" అని రేషమ్, బీంట్ కౌర్ చెప్పారు. "ఈ వ్యవసాయ చట్టాలు అమలవుతే, అది రైతులను మాత్రమే ప్రభావితం చేస్తుంది అనుకుంటారేమో. కానీ రైతుల జీవనోపాధి పై ఆధారపడిన కూలీలకు కూడా ఈ చట్టాలు నష్టం కలుగజేస్తాయి."
అందుకే జనవరి 7 మధ్యాహ్నం, ఈ ఇద్దరు అక్కాచెల్లెళ్లు పంజాబ్ లోని ముక్త్సర్ జిల్లా నుండి ప్రయాణించి, దేశ రాజధాని శివార్ల వద్ద జరుగుతున్న రైతుల నిరసనలో చేరారు.
పంజాబ్ ఖేత్ మజ్దూర్ యూనియన్ ఏర్పాటు చేసిన 20 బస్సులలో కనీసం 1,500 మంది ప్రయాణీకులు ఉన్నారు. వీరంతా కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగే నిరసనల ప్రదేశాలలో ఒకటైన పశ్చిమ ఢిల్లీలోని తిక్రి వద్దకు రాత్రికల్లా చేరుకున్నారు. వీరు బతిండా, ఫరీద్కోట్, జలంధర్, మోగా, ముక్త్సర్, పాటియాలా మరియు సంగ్రూర్ జిల్లాల నుండి వచ్చారు. రేషమ్, బీంట్ ముక్త్సర్ జిల్లాలోని తమ గ్రామమైన చన్ను సమీపంలో ఈ బస్సులను ఎక్కి ఇక్కడికి చేరుకున్నారు.
నవంబర్ 26 నుండి ఢిల్లీ చుట్టుపక్కల ఉన్న తిక్రి ,ఇంకా ఇతర నిరసన ప్రదేశాలలో చాలా మంది రైతులు క్యాంప్ చేస్తున్నారు. మరికొందరు కొద్దిరోజులు వారితో ఉండి, తిరిగి వారి గ్రామాలకు వెళ్లి ఢిల్లీ లో జరుగుతున్న ఆందోళన గురించి తమ ఊరిలోని ప్రజలకు తెలియజేస్తారు. "ఈ కొత్త వ్యవసాయ చట్టాలు వ్యవసాయ కార్మికులను ఎలా ప్రభావితం చేస్తాయో మా గ్రామంలో చాలామందికి తెలియదు" అని 24 ఏళ్ల రేషమ్ చెప్పారు. “వాస్తవానికి, మా గ్రామాలలో మేము చూసే వార్తా చానెళ్ళ లో ఈ చట్టాలు రైతులు, వ్యవసాయ కూలీల ప్రయోజనాల కోసమేనని చెప్పారు. కూలీలకు భూమి ఇస్తామని వారు చెప్పారు.”
ఈ చట్టాలు మొదట జూన్ 5, 2020 న ఆర్డినెన్స్‌లుగా ఆమోదించబడ్డాయి, తరువాత సెప్టెంబర్ 14 న పార్లమెంటులో వ్యవసాయ బిల్లులుగా ప్రవేశపెట్టబడ్డాయి. ఇక ఆ నెల 20 నాటికి చట్టాలలోకి ప్రవేశించాయి. మూడు చట్టాలు ధరల భరోసా మరియు వ్యవసాయ సేవల చట్టం, 2020 పై రైతు (సాధికారత మరియు రక్షణ) ఒప్పందం, రైతుల ఉత్పత్తి వాణిజ్యం (ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్) చట్టం, 2020 మరియు ఎసెన్షియల్ కమోడిటీస్ (సవరణ) చట్టం, 2020. ఈ చట్టాలు ప్రతి భారతీయుడిని చట్ట సహాయం పొందలేనంతగా ప్రభావితం చేస్తాయని విమర్శించారు.





