కోరై గడ్డి కోతలో నైపుణ్యం ఉన్నవారు ఆ మొక్కను 15 సెకన్లలోపే కోసి, దాన్ని అర నిమిషంలో విదిలించి, ఇంకొన్ని నిమిషాలలోనే ఒక బండిల్‌గా కట్టగలరు. గడ్డి లాగా ఉండే ఆ మొక్క వాళ్ల కంటే ఎత్తుగా ఉంటుంది, ఒక్కో బండిల్ దాదాపు అయిదు కిలోల బరువు ఉంటుంది. ఒక్కొక్కరు అలాంటి 12-15 బండిల్స్ ఒకేసారి అలవోకగా నెత్తిన పెట్టుకుని మండుటెండలో దాదాపు అర్ధ కిలోమీటర్ నడిస్తే వారికి వచ్చే ఆదాయం ఒక బండిల్‌కు కేవలం 2 రూపాయలు మాత్రమే.
రోజు చివరికి, ఒక్కొక్కరు తలా కనీసం 150 కోరై బండిల్స్ కడతారు. ఇది తమిళనాడులోని కరూర్ జిల్లాలోని నదీ తీర పొలాల్లో పుష్కలంగా పెరుగుతుంది.
కావేరి నదీ తీరాన కరూర్ జిల్లాలో మణవాసి గ్రామానికి చెందిన నత్తమేడు అనే బస్తీలో కోరై గడ్డి కోసే కార్మికులు - దాదాపు అందరూ మహిళలే - విరామం అనేదే లేకుండా రోజుకు ఎనిమిది గంటలు పని చేస్తారు. దట్టంగా పెరిగిన గడ్డిని వంగి కోసి, చేతులతోలే ఆ గడ్డి కాడలను నూర్పిడి చేసి, బండిల్స్‌గా కట్టి, వాటిని కలెక్షన్ పాయింట్ వద్దకు తీసుకు వెళ్తారు. ఇందుకు నైపుణ్యం, సత్తువ అవసరం. ఇది ఎంతో కష్టమైన పని కూడా.
వాళ్లలో చాలా మంది, తాము చిన్న పిల్లలుగా ఉన్నప్పటి నుండి కోరై గడ్డిని కోస్తున్నాము అని చెప్పారు. "నేను పుట్టినప్పటి నుండి, కోరై కాడు (అడవి) చుట్టూనే నా ప్రపంచం ఉండేది. నాకు పదేళ్ల వయసు ఉన్నప్పటి నుండి ఈ పొలాల్లో పని చేస్తున్నాను, అప్పట్లో రోజుకు మూడు రూపాయల ఆదాయం వచ్చేది," అని ఎ. సౌభాగ్యం (59) చెప్పింది. ఇప్పుడు తన ఆదాయంతో ఐదుగురు ఉన్న కుటుంబాన్ని పోషిస్తోంది.
ఎమ్. మగేశ్వరి (33), స్కూలుకు వెళ్లే ఇద్దరు కొడుకులు ఉన్న ఒక వితంతువు. తన తండ్రి తనను ఆవుల పెంపకానికి, కోరై గడ్డిని కోయడానికి పంపడం గుర్తు చేసుకుంది. "నేను స్కూల్లో కనీసం అడుగు కూడా పెట్టలేదు" అని చెప్పింది. "ఈ కోరై పొలం నాకు మరో ఇల్లు లాంటిది." ఆర్. సెల్వి (39) తన తల్లి అడుగుజాడల్లో నడిచింది. "అమ్మ కూడా కోరై కోత పనే చేసేది. నేను కూడా చిన్నప్పటి నుండి ఈ పని చేయడం మొదలు పెట్టాను," అని ఆమె చెప్పింది.























