అతను ఆ షాపుకు యజమాని కానని చెప్పాడు, అది అతని స్నేహితుడిది. కాస్తాగి, అతను తన స్థాయిని పెంచుకుంటూ, “ఓనర్ కు బంధువును,”అని చెప్పుకున్నాడు. ఇంకాసేపటికి, “ఆ షాపులో పని చేసే బంధువును,” అని చెప్పాడు. ఇక అలానే అడుగుతూ పొతే, తానే ఓనర్ ని అని చెప్పుకునేవాడే.
అతను ఫోటో తీసుకోవడానికి ఒప్పుకోలేదు. షాపులో వీడియో కూడా తీసుకోనివ్వలేదు. కానీ బయట ఉన్న సైన్ బోర్డు ఫోటో తీసుకున్నందుకు మాత్రం సంతోషించాడు.
ఆ బోర్డు మీద విదేశీ షరాబ్ దుకాణ్ అని ఉంది - ఎంట్రన్స్ కి కాస్త దూరంలో(విదేశీ లిక్కర్ దుకాణం, అని అర్థం)లైసెన్సీ: రమేష్ ప్రసాద్ అని కూడా ఉంది. ఇది ఛత్తీస్గఢ్(అప్పట్లో ఇది మధ్యప్రదేశ్)లోని సుర్గుజా జిల్లాలో కట్ఘోరా పట్టణ చివరలో ఉంది. కాస్త మత్తుతో తూలుతూ మాతో సంభాషిస్తున్న ప్రస్తుత వ్యక్తి అయితే రమేష్ ప్రసాద్ కాదు. ఈ విదేశీ లిక్కర్ దుకాణంలో ఇతను ఒక పెద్ద కస్టమర్ ఏమో, అనే అనుమానం మొదలైంది మాలో.
విదేశీ లిక్కర్? అంటే, పూర్తిగా కాదు. నేను చివరగా IMFL అన్న ఎక్రోనీమ్ విన్నది ఎప్పుడో గుర్తులేదు. దాని పూర్తి అర్థం ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్(Indian Made Foreign Liquor). 1994 లో, ఈ ఫోటో తీసుకున్నప్పుడు IMFLకు, దేశి లిక్కర్ కు మధ్య చాలా వేడిగా వాదోపవాదాలు జరిగేవి.
IMFL రకం అంటే, లా ఇన్‌సైడర్ వెబ్‌సైట్ నుండి నేను తెలుసుకున్నట్లుగా, “విదేశాల నుండి దిగుమతి చేసుకున్న జిన్, బ్రాందీ, విస్కీ లేదా రమ్ పద్ధతిలో భారతదేశంలో ఉత్పత్తి చేయబడిన, తయారు చేయబడిన లేదా సమ్మేళనం చేయబడిన మద్యం, మిల్క్ పంచ్ ఇంకా ఏదైనా ఇతర మద్యాలను కలిగి ఉంటుంది. కానీ ఇందులో బీర్, వైన్, విదేశీ మద్యం మాత్రం ఉండవు.” ఇక్కడ "బీర్, వైన్ మరియు విదేశీ మద్యం" మినహాయించబడుతాయని గమనించండి.
IMFL లో దిగుమతి చేసుకున్న లిక్కర్ తో పాటుగా ఒక దేశీయ విశేషం ఉండాలి. (బహుశా మొలాసిస్ కానీ, స్థానికంగా కలపడంగాని, లేదా దిగుమతి చేసుకున్న పదార్ధాన్ని బాటిళ్లలో పోయడం గాని). మనకు నిజంగానే ఏమి తెలియదు.



