దట్టమైన తూరుపు కనుమల వెనగ్గా, సూర్యాస్తమవుతున్నప్పుడు; కీచుమనే కొండ మైనా పిట్టల అరుపులు, పారా మిలటరీ దళాల బూటు శబ్దాల కింద నలిగిపోయేవి. ఆ దళాలు మళ్ళీ పల్లెల్ని కాపలా కాస్తున్నాయి. ఆ సాయంత్రాలంటేనే ఆమెకు అత్యంత భయం కలిగేది.
ఆమెకు దేమాతి అన్న పేరెందుకు పెట్టారో తెలియదు. "ఆమె మా గ్రామాన్నుండి బ్రిటీషు సైన్యాన్ని ఒంటి చేత్తో నిర్భయంగా వెంటాడిన స్త్రీమూర్తి," అని అమ్మ ఎంతో ఉద్వేగంతో చెప్పేది. కానీ అమ్మ దేమాతిలా ధైర్యవంతురాలు కాదు, చాలా పిరికి మనిషి.
కడుపు నొప్పి, ఆకలి దప్పులతో; చేతిలో చిల్లిగవ్వ లేకుండా ఇంట్లో రోజుల తరబడి ఉండటం, అనుమానాస్పద కళ్ళని, భయపెట్టే చూపుల్ని, నిరంతరం అరెస్టుల్ని, చిత్రహింసల్ని; మనుషులు చచ్చిపోవడం వీటితో కలిసి జీవించింది. అప్పుడు, అడవి, అందులోని చెట్లూ, సెలయేళ్ళూ ఎల్లప్పుడూ ఆమెతోనే తోడుగా ఉండేవి. అక్కడి సాలువ పూల పరిమళాలు వాళ్ళమ్మని గుర్తుచేసేవి; అడవిలో వాళ్ళ అమ్మమ్మ పాటల ప్రతిధ్వనుల్ని వినేది. ఇవి తోడుగా ఉంటే చాలు కదా, తానెన్ని కష్టాలనన్నా ఓర్చుకోగలనని అనుకునేది.
ఆమెకిప్పుడివన్నీ తెలుసని నిరూపించేందుకొక కాగితం కావాలి. లేకపోతే ఇంట్లోంచి, ఊళ్ళోంచి, తన సొంత నేల్లోంచి ఆమెను తరిమేందుకు సిద్దమయ్యారు. గాయాల్ని మాన్పగల శక్తి ఉన్న చెట్లూ, పొదల సంగతి; ఆకూ బెరళ్ళ పేర్ల గురించీ ఆమెకు నాన్న నేర్పింది సరిపోదంటున్నారు. వాళ్ళమ్మతో కలసి పళ్ళనీ, గింజల్నీ; వంట చెరుకునీ ఏరేందుకెళ్ళినప్పుడల్లా, ఆమె తను పుట్టిన చెట్టు నీడను చూపెట్టేది. మామ్మ అడవి గురించిన పాటలు నేర్పేది. పక్షుల్ని చూస్తూ, వాటి ప్రతిధ్వనుల్ని వింటూ; ఆమె తన తమ్ముడితో కలసి అక్కడ తను కలియ తిరిగేది.
కానీ, చిన్న నాటి ఆటలు, కధలూ పాటలూ, ఆనాటి జ్ఞానమంతా దేనికన్నా ఆధారం చూపిస్తాయా? తన పేరుకున్న అర్ధమేమిటో, ఏ స్త్రీమూర్తి పేరును తనకు పెట్టారో అని ఎడతెగని ఆశ్చర్యంతో ఆలోచిస్తూనే కూర్చునేది. అసలు దేమాతీ తాను ఈ అడవికి బంధువునని ఎలా నిరూపించుకుని ఉంటుంది?



