ధడ్‌గావ్ ప్రాంతంలోని అక్రాని తాలూకాలో ఒక రోజు మధ్యాహ్నం పూట బాగా ఎండ కాసి ఉన్నప్పుడు తన తల మీద పైట కప్పుకుని ఉన్న శెవాంత తడ్వీ తన మేకల మంద వెనుక పరిగెడుతున్నారు. ఏదైనా మేక పిల్ల పొదల్లోకి లేక ఇతరుల పొలంలోకి దూరబోతే, ఆమె తన కర్రను నేలపై బాది ఆ మేక పిల్లను అదుపులోకి తెచ్చి తిరిగి మందలోకి తీసుకువస్తారు. “వాటిపై నేను ఎల్లప్పుడూ ఒక కన్నేసి ఉండాల్సిందే. మేక పిల్లలకు అల్లరి ఎక్కువ. అటు ఇటు పరిగెడుతూనే ఉంటాయి” అని ఆమె చిరునవ్వు నవ్వారు. “ఇప్పుడు అవే నా కన్నబిడ్డల్లాంటివి.”
నందర్బార్ జిల్లాలోని హరన్‌ఖూరీ గ్రామంలోని మహారాజపద అనే తండాలోని తన ఇంటి నుండి దాదాపు నాలుగు కిలోమీటర్ల దూరాన ఉన్న అడవి వద్దకు ఆమె నడిచి వచ్చారు. ఇక్కడ ఒంటరిగా తన మేకలు, కిలకిలమనే పక్షులు, గాలికి ఊగుతూ శబ్దం చేసే చెట్ల మధ్య ఆమె ఏకాంతంగా స్వేచ్ఛగా ఉన్నారు. 12 ఏళ్ల ముందు తనకు పెళ్లి అయినప్పటి నుండి ఆమెను వాంజోతి (గొడ్రాలు), దాల్‌భద్రీ (శపించబడ్డది) మరియు దుష్ట్ (దుష్టమైనది) అనే పేర్లతో నిందించేవారు. ఆ మాటల నుండి ఈ అడవిలో ఆమెకు స్వేచ్ఛ లభించింది.
“పిల్లలు కనలేని మగవాళ్లకు మాత్రం అలాంటి నీచమైన పదం లేదెందుకు?” అని శెవాంత అడిగారు.
ఇప్పుడు 25 ఏళ్లున్న శెవాంతకు (నిజం పేరు కాదు) 14 ఏళ్ల వయసప్పుడే పెళ్లి చేశారు. ఆమె భర్త రవి (32) ఒక రైతు కూలీ. ఆయనకు పని దొరికినప్పుడు రోజుకు దాదాపు రూ. 150 సంపాదిస్తారు. ఆయన మద్యానికి బానిస కూడా. వారిద్దరూ, మహారాష్ట్రలో ప్రధానంగా ఆదివాసీలు నివసించే ఈ జిల్లాలో భీల్ అనే ఆదివాసీ వర్గానికి చెందిన వారు. అంతకు ముందు రోజు రవి (నిజం పేరు కాదు) ఆమెపై మళ్లీ చేయి చేసుకున్నారని శెవాంత చెప్పారు. “ఇదేమీ కొత్త కాదు” అని ఆమె నిట్టూర్చారు. “నేను ఆయనకు సంతానాన్ని ఇవ్వలేను. నా గర్భసంచిలో లోపం ఉండటం వల్ల నేను మళ్లీ గర్భం దాల్చలేనని డాక్టరు చెప్పారు.”
గర్భసంచిలో లోపం అని శెవాంత అని చెబుతోన్న వ్యాధి అసలు పేరు పాలీ సిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ (పి. సి. ఒ. ఎస్). 2010లో ధడ్‌గావ్ గ్రామీణ ఆసుపత్రిలో ఆమెకు గర్భ స్రావం అయినప్పుడు దీనిని నిర్ధారించారు. అప్పటికి ఆమె వయస్సు కేవలం 15 ఏళ్లే, అయినా మూడు నెలల గర్భవతిగా ఉన్నారు.







