పారూని ఆమె తండ్రి 2019లో మహారాష్ట్రలోని నాశిక్‌లో ఉండే తమ ఇంటి నుంచి గొర్రెలను కాయడానికి పంపినపుడు ఆమె వయసు కేవలం ఏడేళ్ళే!
మూడేళ్ళ తర్వాత, ఆగస్ట్ 2022లో వారి గుడిసె బయట - తెలివిలేనిస్థితిలో, దుప్పటిలో చుట్టివున్న పారూ తల్లిదండ్రులకు కనిపించింది. ఆమె మెడపై గొంతు నులిమిన గుర్తులున్నాయి.
"ఆమె తన చివరి శ్వాస వరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఏం జరిగిందని అడిగే ప్రయత్నంచేశాం, కానీ ఆమె మాట్లాడలేకపోయింది," అని పారూ తల్లి సవితాబాయి కన్నీళ్లు తుడుచుకుంటూ చెప్పారు. “ఆమెపై ఎవరో చేతబడి చేశారని మేం అనుకున్నాం. దాంతో మేం ఆమెను (ముంబై-నాశిక్ హైవే) సమీపంలోని మోరా కొండల్లో ఉండే ఒక దేవాలయానికి తీసుకెళ్లాం. పూజారి అంగారా (విభూది) పూశాడు. ఆమెకు స్పృహ వస్తుందేమోనని ఎదురుచూశాం, కానీ రాలేదు” అని సవితాబాయి గుర్తుచేసుకున్నారు. గాయాలతో కనిపించిన ఐదు రోజుల తర్వాత, సెప్టెంబర్ 2, 2022న, పారూ నాశిక్ నగరంలోని పౌర ఆసుపత్రిలో ఆ గాయాల కారణంగా మరణించింది.
ఇంటికి దూరంగా ఉన్న మూడేళ్లలో పారూ ఒక్కసారి మాత్రమే తన కుటుంబాన్ని చూడటానికొచ్చింది. ఆమెను పనిచేయడానికి తీసుకెళ్లిన మధ్యవర్తి ఆమెను ఏడాదిన్నర క్రితం ఇంటికి తీసుకొచ్చాడు. "ఆమె మాతో ఏడెనిమిది రోజులు గడిపింది. ఎనిమిదో రోజు తర్వాత అతను వచ్చి ఆమెను మళ్లీ తీసుకెళ్లాడు," అని పారూ అపస్మారక స్థితిలోకి వెళ్లిన మరుసటి రోజు మధ్యవర్తిపై పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో సవితాబాయి పేర్కొన్నారు.











