“అక్కడ MSP ఉండదు, వారు నెమ్మదిగా APMC లను మూసివేస్తారు, పైగా కరెంటును ను ప్రైవేటీకరిస్తున్నారు. మేము ఆందోళన పడడానికి పూర్తిగా కారణం ఉంది, ”అని శివమొగ్గ జిల్లాకు చెందిన డి. మల్లికార్జునప్ప అనే రైతు అన్నారు.
మల్లికార్జునప్ప (61) జనవరి 25 న షికార్పూర్ తాలూకా ఉన్న హులుగినకోప్ప అనే తన గ్రామం నుంచి 350 కిలోమీటర్ల దూరం ప్రయాణించి బెంగళూరుకు వచ్చారు, మరుసటి రోజు రైతుల రిపబ్లిక్ డే ట్రాక్టర్ పరేడ్‌లో చేరారు. "పెద్ద కంపెనీల మాటలు వినే బదులు, వారు [కేంద్ర ప్రభుత్వం] ఎపిఎంసిలను సంస్కరించాలి, తద్వారా మాకు ధాన్యానికి సరైన ధర లభిస్తుంది" అని ఆయన అన్నారు.
కొత్త వ్యవసాయ చట్టాలు అతని చింతలను పెంచాయి - రైతులు తమ ఆహార ధాన్యాల సేకరణకు హామీ ఇచ్చే కనీస మద్దతు ధర (ఎంఎస్పి) మరియు వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీలు (ఎపిఎంసి) వంటి కొన్ని ప్రభుత్వ సహకారాలను ఈ చట్టాలు బలహీన పరుస్తాయి.
మల్లికార్జునప్ప తన 12 ఎకరాల భూమిలో 3-4 ఎకరాలలో వరిని సాగు చేస్తాడు. అతను మిగిలిన స్థలంలో వక్క పంట ను పెంచుతాడు. "గత సంవత్సరం వక్క పంట దిగుబడి చాలా తక్కువగా ఉంది, వరి దిగుబడి కూడా తక్కువే వచ్చింది." అని అతను చెప్పాడు. “నేను 12 లక్షల రూపాయల బ్యాంకు రుణాలను తిరిగి చెల్లించాలి. వారు [రాష్ట్ర ప్రభుత్వం] రుణాన్ని మాఫీ చేస్తామని చెప్పారు. కానీ బ్యాంకులు ఇప్పటికీ నాకు చాలా నోటీసులు పంపి వేయబోయే జరిమానాల గురించి హెచ్చరిస్తున్నాయి. నాకు దాని గురించి కూడా ఆందోళనగా ఉంది ” అని ఆయన కోపంగా అన్నారు.
బెంగుళూరు కు దూరంగా ఉన్న జిల్లాల నుండి వచ్చిన మల్లికార్జునప్ప వంటి రైతులు పెరేడ్ కు ఒక రోజు ముందు చేరుకున్నారు. అయితే సమీప జిల్లాలైన మాండ్యా, రామనగర, తుమ్కూర్ జిల్లాల నుంచి వచ్చిన ఇతర రైతులు, జనవరి 26 న ఉదయం 9 గంటలకు బెంగళూరు నగర శివార్లలో ట్రాక్టర్లు, కార్లు బస్సులలో సమావేశమయ్యారు. వారు సెంట్రల్ బెంగళూరులోని గాంధీ నగర్ ప్రాంతంలోని ఫ్రీడమ్ పార్కుకు మధ్యాహ్నం ఒంటిగంటకు చేరుకుని ఢిల్లీలో రైతుల ట్రాక్టర్ పరేడ్‌కు మద్దతుగా నిరసనలో పాల్గొనవలసి ఉంది. నవంబర్ 26 నుండి ఢిల్లీ సరిహద్దుల్లో మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్న రైతులు జాతీయ రాజధానిలో రిపబ్లిక్ డే పరేడ్ నిర్వహించారు.







