ఇరవై మూడేళ్ల రానో సింగ్ కి ప్రసూతి నొప్పులు మొదలయ్యాయి. ఆమె అత్తగారు, భర్త కొండ పక్కన ఉన్న తమ ఇంటిలో నుంచి కంగారుగా బయటకి వచ్చారు. అప్పుడే ఉదయం 5 గంటలు అవుతూ ఉంది. వాళ్ళ ఇంటి ముందు నుండి ఒక కిలోమీటరున్నర దాకా కొండ పైకి దారి ఉంది. అది మెయిన్ రోడ్డు వరకు తీసుకెళ్తుంది. అక్కడ వాళ్ళకొక ప్రైవేటు వాహనం దొరికితే వారి ఊరు శివాలి నుండి 12 కిలోమీటర్ల దూరం లో ఉన్న రాణిఖేత్ హాస్పటల్ కి వెళ్లొచ్చు.
అసలు వాళ్ళు ఆమెను ఒక డోలి లో తీసుకుని వెళ్లదామనుకున్నారు. కడుపుతో ఉన్న ఠాకూర్ కులపు ఆడవాళ్లను పల్లకి లో కూర్చోబెట్టి పల్లకి కి ఉన్న నాలుగు మూలలను నలుగురు మనుషులు ఎత్తుకుని మోసుకుంటూ తీసుకెళ్తారు. ఈ డోలి ఆమెని రోడ్డు వరకు తీసుకెళ్తుంది. మామూలుగా అయితే మెయిన్ రోడ్డు మీద ఏదొక వాహనం ముందే వారికోసం ఎదురు చూస్తూ ఉంటుంది. కానీ ఆ ఉదయం అక్కడ డోలి లేకపోయింది, కాబట్టి వాళ్ళు నడవడం మొదలుపెట్టారు.
రానో సగం దూరం వరకు నడిచింది. “నేను సగం దూరం వచ్చాక ఇక నేను నడవలేకపోయాను(నొప్పి వలన). ఇక అప్పుడు నడవడం మానేసి ఆ దారిలోనే కూర్చుండి పోయాను. నేను అలా కూర్చోగానే నా భర్తకు విషయం అర్ధమయి దగ్గరలో ఉన్న ఇంటికి సాయం కోసం పరిగెత్తాడు. వాళ్ళు తెలిసినవాళ్ళే. ఆ ఇంట్లో ఉంటున్న పిన్ని ఇంకో పది నిమిషాల్లో నీళ్లు, ఒక బెడ్ షీట్ పట్టుకుని వచ్చింది. మా అత్తగారు, పిన్ని నా కాన్పుకు సాయం చేశారు.” (రానో భర్త రేషన్ షాప్ లో సహాయకుడి గా పని చేసి నెలకు 8000 రూపాయలు సంపాదిస్తాడు. ఆ ఆదాయం ఒక్కటే ఆ ఇంట్లో ముగ్గురు పెద్దవాళ్ళకి, ఒక చిన్న బాబు కి ఆధారం.)
“నా కొడుకు(జగత్) ఈ అడవిలో నేను మెయిన్ రోడ్డు వరకు నడుస్తుండగానే పుట్టాడు.” అన్నది రానో, ఆ పొద్దున్న తన తోలి కానుపు ఆ దట్టమైన చెట్ల మధ్య సన్నని దారిలో ఎలా జరిగిందో తలచుకుని భయపడుతూ. “నేను ఎప్పుడూ ఇలాంటి కానుపుని ఊహించుకోలేదు. ఇప్పటికి తలుచుకుంటే ఒంట్లోంచి వణుకు వస్తుంది. దేవుడి దయ వల్ల పుట్టిన పిల్లవాడు బాగున్నాడు. అదే అన్నిటి కన్నా విలువైనది.”
ఆ ఫిబ్రవరి ఉదయాన రానో, జగత్ పుట్టిన కాసేపటికే, తన అత్తగారు 58 ఏళ్ళ ప్రతిమ సింగ్ బిడ్డని ఎత్తుకోగా, ఆమెతో కలిసి ఇంటికి బయలుదేరింది.










