మీనా యాదవ్ ఒకవైపు తన వద్ద మొక్కజొన్న పొత్తులను కొనడానికి వచ్చేవారితో మాట్లాడుతుంటారు. మరోవైపు తన స్నేహితులతోనూ, ఇంకోవైపు దక్షిణ కొల్‌కతాలోని బహుళ సంస్కృతులకు కేంద్రమైన ఆ లేక్ మార్కెట్లో దారుల గురించి వాకబుచేసే అపరిచితులతోనూ మాట్లాడుతుంటారు. ఈ అందరితోనూ ఆమె భోజ్‌పురి, బంగ్లా, హిందీ భాషలలో మాట్లాడతారు. "కొల్కతాలో ఇది (భాష) సమస్య కాదు," అంటూ ఆమె వలసదారుగా తన దైనందిన జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి చెబుతారు.
“యే సిర్ఫ్ కెహ్నే కా బాత్ హైఁ కి బిహారీ లోగ్ బిహార్ మే రహేగా (బిహారీ ప్రజలు బిహార్‌లోనే ఉంటారని చెప్పడం చాలా సులభం). వాస్తవం ఏమిటంటే కఠినమైన శారీరక శ్రమ అంతా మేమే చేస్తాం. బరువులెత్తే కూలీలు, నీటి రవాణా చేసేవారు, కూలిపనులు చేసేవారందరూ బిహారీలే. ఈ పనులు చేయటం బెంగాలీల వల్ల కాదు. మీరు న్యూ మార్కెట్, హౌరా, శియాల్దాహ్లకు వెళ్ళి చూడండి... భారీ బరువులను మోస్తున్న బిహారీలే మీకు కనిపిస్తారు. కానీ ఇంత కష్టపడి పనిచేస్తున్నా వారికి గౌరవం లభించడం లేదు. బిహారీలు అందరినీ బాబూ అని పిలుస్తుంటారు...కానీ అందరూ వారిని నీచంగానే చూస్తారు. మామిడి పండు బెంగాలీ బాబుల కోసం, ఆ పండులోని టెంక మాత్రమే మాకు మిగిలేది," అని ఆమె గుక్కతిప్పుకోకుండా చెప్పుకొచ్చారు.
మీనా యాదవ్ భాషకూ, గుర్తింపు రాజకీయాలకూ మధ్య నేర్పుగా మాటలను కలుపుతారు
"చెన్నైలో మేం (భాషాపరమైన) అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నాం," ఆమె కొనసాగించారు. “వాళ్ళు హిందీ లేదా భోజ్‌పురి మాట్లాడితే ప్రతిస్పందించరు. మాకు తెలియని వారి సొంత భాషలోనే మాట్లాడతారు. కానీ ఇక్కడలా కాదు,” అన్నారు మీనా. “చూడండి, బిహారీ అనేది ఒక్క భాష కాదు. ఇంట్లో మేం 3-4 భాషల్లో మాట్లాడతాం. కొన్నిసార్లు భోజ్‌పురి, కొన్నిసార్లు హిందీ, కొన్నిసార్లు దర్భంగియా (మైథిలి), కొన్నిసార్లు బంగ్లా మాట్లాడుతాం. కానీ మాకు దర్భంగియాలో మాట్లాడటమే చాలా తేలిక,” అని బిహార్‌లోని ఛప్రాకు చెందిన 45 ఏళ్ళ మీనా చెప్పారు.
"మేం ఆరా, ఛప్రా బోలి(పలుకుబడి)ని కూడా వాడతాం. ఎలాంటి సమస్య లేదు. మేం ఏ భాషలో మాట్లాడాలనుకున్నా మాట్లాడుతాం,” ఆమె బహుభాషలు తెలిసినవారికుండే ఒక ఆశ్చర్యకరమైన సౌలభ్యంతో చెప్పారు. ఇంకా, ఈ భాషలన్నింటిలో తనకున్న జ్ఞానానికీ, తన అసాధారణ నైపుణ్యాలకూ ఏదైనా సంబంధం ఉండవచ్చనే ఆలోచనతో ఆమె తనను తాను మోసం చేసుకోవాలనుకోలేదు.


















