సామాజిక మాధ్యమాలన్నీ ఆక్సిజన్, ఆస్పత్రి బెడ్, అవసరమైన మందులు కావాలనే అభ్యర్థనలతో కూడిన పోస్ట్లు, కథనాలు, సందేశాలతో నిండిపోయింది. నా ఫోన్ కూడా నిరంతరం మోగుతూనే ఉంది. “తక్షణమే ఆక్సిజన్ కావాలి” అని ఒక మెసేజ్ వచ్చింది. ఆదివారం ఉదయం సుమారు తొమ్మిది గంటల ప్రాంతంలో ఒక ఆప్త మిత్రుడి నుంచి కాల్ వచ్చింది. కోవిడ్ 19 తో బాధపడుతున్న అతని స్నేహితుని తండ్రి కోసం ఆస్పత్రిలో బెడ్ పొందడానికి కష్టపడుతున్నారు. అప్పటికి భారతదేశంలో రోజువారీ కేసులు 300,000కి పైగా పెరిగాయి. నాకు తెలిసిన కొందరికి నేను కాల్ చేసి ప్రయత్నించాను కానీ విఫలమైంది. ఆ హడావిడిలో పడి ఈ కేసు గురించి నేను మర్చిపోయాను. కొన్ని రోజుల తర్వాత నా స్నేహితుడు మళ్ళీ కాల్ చేసి చెప్పాడు, “నా స్నేహితుని తండ్రి…ఆయన చనిపోయారు.”
ఏప్రిల్ 17న ఆయన ఆక్సిజన్ సాట్యూరేషన్ చాలా ప్రమాదకరంగా 57 కి పడిపోయింది (92-90 కన్నా తక్కువుంటే ఆస్పత్రిలో చేరాలని సూచన). కొన్ని గంటల వ్యవధిలోనే ఆయన సాట్యురేషన్ 31 కి పడిపోయి చనిపోయాడు. అధ్వాన్నమవుతున్న తన స్థితి గురించి ఆయన ప్రత్యక్షంగా ట్వీట్ చేసాడు, అతని చివరి ట్వీట్ : “నా ఆక్సిజన్ 31 ఉంది. ఎవరైనా నాకు సహాయం చేస్తారా?”
మరిన్ని SOS మెసేజీలు, మరిన్ని ట్వీట్లు, మరిన్ని కాల్స్. ఒక పోస్ట్ ఉంటుంది: “హాస్పిటల్ బెడ్ కావాలి” అని. కానీ మరుసటి రోజే ఒక అప్డేట్ ఉంటుంది- “పేషెంట్ చనిపోయారు,” అని.
నేనెప్పుడూ కలవని, ఎప్పుడూ మాట్లాడని లేదా తెలియని ఒక స్నేహితుడు; వేరే భాషలో మాట్లాడే సుదూర ప్రాంతంలో ఉండే ఒక స్నేహితుడు, శ్వాస ఆడక ఎక్కడో చనిపోయాడు, తెలియని చితిలో కాలిపోతూ.
ఆరని చితి
నా హృదయం విలవిలలాడుతోంది
ప్రియ నేస్తమా... ,
శవాల లోయలో ఒంటరిగా,
తెల్లటి మృత్యువుని చుట్టుకొని,
నువ్వు భయంగా ఉన్నావని తెలుసు.
నా హృదయం నీ కోసం అల్లాడుతోంది
ప్రియ నేస్తమా,
సూర్యుడు అస్తమిస్తూ,
రుధిర సంధ్యలో నిన్ను తడిపేస్తుంటే,
నువ్వు భయంగా ఉన్నావని నాకు తెలుసు.
అపరిచితుల పక్కనే నువ్వు,
అపరిచితులతో కాలిపోతూ,
నీ ప్రయాణం కూడా అపరిచితులతోనే.
నీ భయం నాకు తెలుసు.
ఆ తెల్ల గోడల గది నడుమన,
ఒక చుక్క ఊపిరి కోసం నీ వేదన తలచుకుని,
నా హృదయం నీకై కుమిలిపోతోంది
ప్రియా నేస్తమా,
నువ్వు భయంగా ఉండేవాడివని నాకు తెలుసు
ఆ చివరి క్షణాల్లో,
నీ తల్లి నిస్సహాయంగా కన్నీరు కారుస్తుండగా,
నీ చివరి రెండు కన్నీటి బొట్లు
మోముపై జారుతుండగా;
నువ్వు భయపడిన సంగతి నాకు తెలుసు.
సైరేన్ల మోతలు,
తల్లుల రోదనలు,
మండుతున్న చితులు.
“భయపడొద్దు!”
అని నేను చెప్పడం సరైనదే
“భయపడొద్దు!”
అని నేను చెప్పడం సరైనదే
నా హృదయం నీకోసం విలపిస్తోంది,
ప్రియనేస్తామా….
అనువాదం: దీప్తి సిర్ల