"పూలన్నీ ఎండిపోతున్నాయి"
అది మార్చి 2023లో ఒక వెచ్చగా ఉన్న ఉదయం. పోముల భీమవరానికి చెందిన మరుడుపూడి నాగరాజు తన మూడెకరాల మామిడి ( మాంగిఫెరా ఇండికా ) తోటను పరిశీలనగా చూస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అనకాపల్లి జిల్లాలో ఉన్న అతని మామిడి తోటలో స్థానిక రకాలైన పెద్దవిగా ఉండే బంగినపల్లి , రసాలూరే చెరకు రసాలు , ఎక్కువగా పచ్చివిగానే తినే తోతాపురి కాయ రకం, పండూరి మామిడి వంటి 150 మామిడి చెట్లున్నాయి.
ఆయన పొలంలోని చెట్లన్నీ గోధుమవన్నె పసుపు రంగులో ఉన్న మామిడి పూతతో నిండి ఉన్నాయి. కానీ 62 ఏళ్ళ ఈ రైతుకు అదేమీ సంతోషకరమైన దృశ్యం కాదు - ఈసారి మామిడి పూత ఆలస్యమయింది. “సంక్రాంతి (జనవరి నెల మధ్యలో వచ్చే పండుగ) నాటికి పూత వచ్చేసి ఉండాలి, కానీ రాలేదు. ఫిబ్రవరిలో మాత్రమే పూత ప్రారంభమయింది,” అని నాగరాజు చెప్పారు.
మార్చి వచ్చేసరికల్లా మామిడికాయలు ఒక నిమ్మకాయంత సైజుకు వచ్చివుండాలి. "మామిడి పూత లేకపోతే మామిడి పళ్ళుండవు, ఈ ఏడాది కూడా నేనేం సంపాదించలేను."
నాగరాజు ఆదుర్దాను అర్థంచేసుకోవచ్చు. రోజు కూలీ అయిన ఆయనకు ఆ మామిడి తోట కష్టపడి సాధించుకున్న కల. మాదిగ (ఆంధ్రప్రదేశ్‌లో షెడ్యూల్డ్ కులాల జాబితాకు చెందినది) సముదాయానికి చెందిన ఈయనకు పాతికేళ్ళ క్రితం ఆ భూమిని రాష్ట్ర ప్రభుత్వం పంపిణీచేసింది. ఆంధ్రప్రదేశ్ భూ సంస్కరణల (సీలింగ్ ఆన్ అగ్రికల్చరల్ హోల్డింగ్స్) చట్టం, 1973 కింద, భూమిలేని వర్గాలకు భూమిని తిరిగి పంపిణీ చేయడానికి రాష్ట్రం చేపట్టిన చర్యలలో భాగంగా ఇది జరిగింది.
జూన్‌లో మామిడిపండ్ల కాలం ముగిసిపోయాక ఆయన ఆ చుట్టుపక్కల గ్రామాలలోని చెరకు తోటలలోకి రోజువారీ కూలిపనులకు వెళ్తుంటారు. అందులో పని దొరికినపుడు రోజుకు రూ. 350 సంపాదిస్తారు. ఇంకా ఆయన ఏడాదిలో 70-75 రోజుల పాటు ఎమ్ఎన్ఆర్ఇజిఎ కింద దొరికే చెరువుల పూడిక తీయటం, ఎరువులు తయారుచేయటం వంటి పనులకు కూడా వెళ్తుంటారు. ఆ పని ద్వారా ఆయనకు రోజుకు రూ. 230 - 250 వరకూ వస్తాయి.
నాగరాజు ఆ భూమికి సొంతదారు అయిన మొదట్లో ఆయన అందులో పసుపు పంటను సాగుచేశారు. కానీ ఒక ఐదేళ్ళ తర్వాత కొంత మెరుగైన లాభాలు పొందాలనే ఆశతో మామిడి పంట సాగుకు మారిపోయారు. "నేనిది మొదలుపెట్టినపుడు (20 ఏళ్ళ క్రితం) ఒక్కో చెట్టుకు 50-75 కిలోల మామిడిపండ్లు లభించేవి," సమృద్ధిగా పండిన ఆ సంతోషకరమైన రోజులను తల్చుకొంటూ చెప్పారాయన. "నాకు మామిడి అంటే చాలా ఇష్టం. ప్రత్యేకించి తోతాపురి అంటే మరీనూ..." అంటారాయన.
మామిడి సాగు చేసే రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్‌ది దేశంలోనే రెండవ స్థానం. ఈ మామిడి పంటను మొత్తమ్మీద 3.78 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో పండిస్తున్నారనీ, 2020-21 వార్షిక ఉత్పత్తి 49.26 లక్షల మెట్రిక్ టన్నులనీ రాష్ట్ర ఉద్యానవన శాఖ చెప్తోంది.
పోముల భీమవరం గ్రామం కృష్ణ, గోదావరి నదుల మధ్యనున్న వ్యవసాయ ప్రదేశంలో ఉంది. ఈ ప్రదేశం భారతదేశ తూర్పు తీరంలోనున్న బంగాళాఖాతంలో ఈ రెండు నదులూ కలిసిపోయే చోటు నుండి ఎంతో దూరంలో లేదు. మామిడి పూతకు అక్టోబరు-నవంబర్ నెలలలో చల్లని, తేమతో కూడిన వాతావరణం అవసరం. సాధారణంగా మామిడి పిందెలు డిసెంబర్-జనవరి నెలలలో కనిపించడం ప్రారంభిస్తాయి.
కానీ, “గత ఐదేళ్ళలో అక్టోబర్, నవంబర్ నెలలలో అకాల వర్షాలు కురవడం పెరిగింది,” అని బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చరల్ రీసెర్చ్ (IIHR) ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎమ్. శంకరన్ అభిప్రాయపడ్డారు.
అకాల వేడిమికి మామిడి పూత ముడుచుకుపోయినట్లుగా తాను గమనించానని ఈ మామిడి రైతు చెప్పారు. దీనివలన పంట దిగుబడి బాగా తగ్గిపోతుంది. "ఒక్కోసారి ఒక్కో చెట్టునుంచి ఒక పెట్టెడు (120-150 మామిడి పండ్లు) మామిడి పండ్లు కూడా రావు. వేసవికాలంలో వచ్చే తీవ్రమైన ఉరుములతో కూడిన గాలివాన దాదాపు పక్వానికి వచ్చిన పండ్లను నాశనంచేస్తుంది," అన్నారాయన.
ఎరువులు, పురుగుమందులు, కూలీల వంటి పెట్టుబడి ఖర్చుల కోసం నాగరాజు గత రెండేళ్ళుగా ప్రతి ఏడాది లక్ష రూపాయల చొప్పున అప్పుచేస్తున్నారు. ఈ మొత్తాన్ని ఆయన ఏడాదికి 32 శాతం వడ్డీకి ఒక ప్రైవేట్ వడ్డీ వ్యాపారి దగ్గర తీసుకున్నారు. ఆయన సంవత్సర ఆదాయం సుమారు రూ 70,000 నుండి రూ. 80,000 వరకూ ఉంటుంది. ఇందులో కొంత భాగాన్ని ఆయన జూన్ నెలలో వడ్డీవ్యాపారికి చెల్లిస్తారు. నానాటికీ దిగుబడి తగ్గిపోతుండటంతో, తొందరపడి మామిడి సాగును నిలిపివేయడానికి మనస్కరించకపోయినా, అప్పు చెల్లించలేనేమో అని ఆయన విచారపడుతుంటారు.
*****
నాగరాజు పొరుగింటివారైన కంటమరెడ్డి శ్రీరామముర్తి తన చేతిలో పట్టుకునివున్న ఒక లేతపసుపు వన్నె పూవును కదిలించారు. దాదాపు ఎండిపోయిన ఆ పువ్వు వెంటనే పొడిపొడి అయిపోయింది.
అదే గ్రామంలో ఉన్న అతని ఒకటిన్నర ఎకరాల మామిడి తోటలో బంగినపల్లి , చెరుకు రసాలు , సువర్ణరేఖ రకాలకు చెందిన 75 మామిడి చెట్లున్నాయి. మామిడి పూత తగ్గిపోతోందని నాగరాజు అంటోన్న మాటతో ఆయన ఏకీభవిస్తున్నారు. "ఇది ప్రధానంగా అక్టోబర్, నవంబర్ నెలల్లో తరచుగా కురుస్తోన్న అకాల వర్షాల వల్ల జరుగుతోంది. అని ఆ రైతు చెప్పారు. తూర్పు కాపు (ఆంధ్రప్రదేశ్‌లో ఇతర వెనకబడిన కులానికి చెందినవారు) సముదాయానికి చెందిన ఈయన ప్రతి ఏటా జూలై నుండి సెప్టెంబర్ వరకూ తన బంధువులకు చెందిన ఒక చెరకుతోటలో పనిచేస్తుంటారు. అక్కడ పనిచేసినన్ని నెలలూ ఆయన నెలకు రూ. 10,000 వరకూ సంపాదిస్తారు.
ఈ ఏడాది (2023) మార్చిలో వచ్చిన ఉరుములతో కూడిన గాలివాన వలన ఆయన మామిడి తోటలోని పూతా పిందే రాలిపోయాయి. "వేసవిలో వచ్చే వానలు మామిడి చెట్లకు మంచివే. కానీ ఈ ఏడాది మరీ విపరీతం," వర్షంతో పాటు బలమైన గాలులు వీచటంతో పంటకు జరిగిన నష్టాన్ని గురించి చెప్తూ అన్నారాయన.
మామిడికి పూత రావడానికి 25-30 డిగ్రీ సెల్సియస్‌ల ఉష్ణోగ్రత సరైనదని ఉద్యానవన శాస్త్రవేత్త శంకరన్ చెప్పారు. "ఫిబ్రవరి 2023లో రాత్రీ పగళ్ళ ఉష్ణొగ్రతలతో చెప్పుకోతగ్గ వ్యత్యాసాలున్నాయి. ఇటువంటి తేడాలను చెట్లు భరించలేవు." అన్నారాయన.
గత కొన్నేళ్ళుగా మామిడి సాగుకు అనువైన పరిస్థితులు దిగజారిపోతుండటంతో శ్రీరామమూర్తి ఈ పంటను సాగుచేయాలని తాను 2014లో తీసుకున్న నిర్ణయం గురించి ఇప్పుడు చింతిస్తున్నారు. ఆ ఏడాది ఆయన అనకాపల్లి పట్టణానికి సమీపంలో తనకు ఉన్న 0.9 ఎకరాల భూమిని అమ్మేసి, ఆ వచ్చిన ఆరు లక్షల రూపాయలను పోముల భీమవరంలోని మామిడితోటకు పెట్టుబడి గా పెట్టారు.
అప్పుడలా చేయడానికి గల కారణాలను వివరిస్తూ ఆయన "అందరూ ఆ పండ్లను (మామిడి) చాలా ఇష్టపడతారు. వాటికి చాలా డిమాండ్ ఉంటుంది. అంచేత మామిడి సాగు నాకు మంచి లాభాలను తెచ్చిపెడుతుందని ఆశపడ్డాను," అన్నారాయన.
ఏదైతేనేం, అప్పటినుంచీ తనేమీ లాభాలను పొందలేకపోయినట్టు ఆయన చెప్పారు. "2014 నుండి 2022 మధ్య, మామిడి సాగు ద్వారా నా మొత్తం ఆదాయం (ఈ ఎనిమిదేళ్లలో) ఆరు లక్షల రూపాయలకు మించలేదు," అని శ్రీరామమూర్తి చెప్పారు. భూమిని విక్రయించాలనే అప్పటి తన నిర్ణయానికి పశ్చాత్తాపపడుతూ, “నేను అమ్మిన భూమికి ఇప్పుడు ఎన్నోరెట్లు విలువ పెరిగింది. బహుశా నేను మామిడి సాగును మొదలుపెట్టకుండా ఉండాల్సింది." అన్నారు.
కేవలం వాతావరణ పరిస్థితులవల్లనే కాదు, మామిడి పంటకు సాగునీరు అవసరం. నాగరాజుకు గానీ, శ్రీరామమూర్తికి గానీ వారి భూముల్లో బోరుబావులు లేవు. 2018లో శ్రీరామమూర్తి రూ.2.5 లక్షలు వెచ్చించి బోరుబావి తవ్వినా అందులో చుక్క నీరు పడలేదు. నాగరాజు, శ్రీరామమూర్తిల తోటలు ఉన్న బుచ్చయ్యపేట మండలం లో అధికారికంగా 35 బోర్‌బావులు, 30 నేలబావులు ఉన్నాయి.
చెట్లకు నిరంతరం నీటి సరఫరా ఉండేలా చూస్తే ఈ పూత ఎండిపోయే సమస్యను పరిష్కరించవచ్చని శ్రీరామమూర్తి చెప్పారు. ఆయన వారానికి రెండు ట్యాంకర్ల నీటిని కొంటారు. దాని కోసం నెలకు రూ. 10,000 ఖర్చుచేస్తారు. “ప్రతి చెట్టుకు ప్రతిరోజూ కనీసం ఒక లీటరు నీరు అవసరం. కానీ నేను వారానికి రెండుసార్లు మాత్రమే వాటికి నీరిస్తున్నాను; నేను అంతవరకే భరించగలను,” అంటారు శ్రీరామమూర్తి.
తన మామిడి చెట్లకు నీటికోసం నాగరాజు కూడా ఒక్కో ట్యాంకరుకు రూ. 8000 చొప్పున చెల్లిస్తూ ప్రతివారం రెండు ట్యాంకర్ల నీరు కొంటున్నారు.
వలివిరెడ్డి రాజు తన చెట్లకు నవంబర్‌లో వారానికి ఒకసారి నీరు పోయడంతో ప్రారంభించి, ఫిబ్రవరి నెల నుండి వారానికి రెండుసార్లకు పెంచారు. సాపేక్షికంగా చూస్తే గ్రామంలో కొత్తగా మామిడిని సాగుచేస్తోన్న ఈ 45 ఏళ్ళ రైతు, 2021లో తన 0.7 ఎకరాల భూమిలో మామిడి సాగును ప్రారంభించారు. నాటిన రెండు సంవత్సరాల తర్వాత ప్రస్తుతం ఆ మొక్కలు ఆయన కంటే కొంచెం పొడవుగా ఎదిగాయి. “మామిడి మొక్కలకు మరింత శ్రద్ధ అవసరం. వాటికి ప్రతిరోజూ రెండు లీటర్ల నీరు కావాలి- ముఖ్యంగా వేసవిలో,” అని ఆయన చెప్పారు
తన పొలంలో బోరుబావి లేకపోవడంతో రాజు వివిధ నీటిపారుదల సౌకర్యాల కోసం దాదాపు రూ. 20,000 వెచ్చిస్తారు. అందులో సగం తన పొలానికి ట్యాంకర్లలో నీటిని తీసుకురావడానికే ఖర్చు చేస్తారు. తన చెట్లకు రోజూ నీరు పెట్టే స్తోమత తనకు లేదని ఆయన అన్నారు. "నేను ప్రతిరోజూ నా తోటలో ఉన్న 40 మామిడి చెట్లకు నీరు పోసేట్టయితే, నాకున్నవన్నీ అమ్ముకోవలసి ఉంటుంది."
మూడేళ్ళుగా తాను పెట్టిన పెట్టుబడికి తగిన ప్రతిఫలం ఉండాలని ఆయన ఆశిస్తున్నారు. "లాభాలు రావని నాకు తెలుసు, కానీ నష్టాలు మాత్రం రావద్దనే ఆశతో ఉన్నాను," అంటారాయన.
*****
గత నెల (ఏప్రిల్ 2023)లో నాగరాజు సుమారు 3,500 కిలోగ్రాములు లేదా దాదాపు 130-140 పెట్టెల మామిడి దిగుబడిని పొందగలిగారు. విశాఖపట్నం నుంచి వచ్చిన వ్యాపారులు కిలోగ్రాము పంటకు రూ. 15 ధరను ఇవ్వజూపారు; దాంతో అతను తన మొదటి పంటకు రూ. 52,500 పొందగలిగారు.
“నేను రెండు దశాబ్దాల క్రితం వ్యవసాయం చేయడం ప్రారంభించినప్పటి నుండి ఈ ధర కిలోకు 15 రూపాయలుగానే ఉంది,” అని నాగరాజు పేర్కొన్నారు. "ప్రస్తుతం కిలో బంగినపల్లి మామిడి పండ్ల ధర విశాఖపట్నంలోని మధురవాడ రైతుబజార్ లో రూ.60గా ఉంది. ఈ వేసవి కాలమంతా ఈ ధర రూ.50 - 100కు మధ్య మారుతూ ఉంటుంది" అని రైతుబజార్ ఎస్టేట్ అధికారి పి. జగదీశ్వరరావు చెప్పారు.
శ్రీరామమూర్తికి ఈ ఏడాది మొదటి దిగుబడిగా 1,400 కిలోల మామిడిపండ్లు వచ్చాయి. అందులోంచి ఆయన తన కుమార్తెల కోసం ఒక రెండు మూడు కిలోల పండ్లను పక్కన పెట్టారు. మిగిలిన పండ్లను విశాఖపట్నం నుంచి వచ్చిన వ్యాపారులకు కిలో ఒకటికి సుమారు రూ. 11కు ఆయన అమ్ముతున్నారు. తాను మామిడి పళ్ళను చిల్లరగా ఎందుకు అమ్మడంలేదో వివరిస్తూ, "ఇక్కడికి దగ్గరగా ఉండే మార్కెట్ 40 కిలోమీటర్ల దూరంలో ఉంది," అని చెప్పారు.
పోముల భీమవరంలోని మామిడి రైతులు తమ వార్షిక ఆదాయాన్ని లెక్కగట్టుకునేటందుకు జూన్ నెలలో రాబోయే రెండవ దిగుబడి కోసం ఎదురుచూస్తున్నారు. కానీ నాగరాజు అంత ఆశాజనకంగా లేరు. "లాభాలుండవు, నష్టాలు మాత్రమే ఉంటాయి," అని ఆయన చెప్పారు
పూతతో నిండివున్న చెట్టు వైపు తిరిగి, "ఈపాటికి ఈ చెట్టుకు ఇంత పరిమాణంలో (అరచేయంత) పండ్లుండాలి." అన్నారు. ఆకుపచ్చగా, గుండ్రంగా ఉన్న ఆ పండూరి రకం మామిడి ఆయనకు ఇష్టమైన మామిడి రకం.
ఆ చెట్టునుంచి ఆయన కొన్ని మామిడి పండ్లను కోస్తూ, "ఏ ఇతర రకం మామిడి పండు కూడా ఈ పండంత తియ్యగా ఉండదు. ఇది పచ్చగా ఉన్నప్పటికీ బాగా తియ్యగానే ఉంటుంది. అదే దాని ప్రత్యేకత." అన్నారు.
ఈ కథనానికి రంగ్ దే నుండి గ్రాంట్ మంజూరయింది .
అనువాదం: సుధామయి సత్తెనపల్లి