"అమ్మీ, మళ్ళీ బడి ఎప్పుడు తెరుస్తారు?" అడిగింది మునియా. జనపనార మొక్కలు నాటే పనిలో నిమగ్నమై ఉన్న సహారా, ఆ పని చివరికొచ్చింది. ఆమె 10-దశాంశ భూమిలో ఇవి తీరిక దొరకని రోజులు. కూతురి ప్రశ్నలు వినడానికి ఆమెకు సమయం లేదు.
"బడులెందుకు తెరవరు...?" మునియా అదే ప్రశ్న వేస్తూనే ఉంది. ఇక ఆగలేక సహారా తన పని ఆపేసి వెనుదిరిగి, చిరాకును అణచుకుంటూ, “దేఖిష్ నా కీ గరొమ్ [ఎంత వేడిగా ఉందో నీకు కనిపించడంలేదా?" ఎనిమిది నెలలుగా ఒక్క చుక్క కూడా వాన పడలేదు." అంది.
"అయితే వాళ్ళు ఎసి ఎందుకు పెట్టుకోవటంలేదు?" మునియా ప్రశ్నలడుగుతూనే ఉంది.
"సర్కార్ [ప్రభుత్వం] దగ్గర డబ్బుల్లేవు," సహారా సహనం సన్నగిల్లిపోతోంది.
"అయితే, బడొలోక్ ఇంగ్లీష్ బడులకు [సంపన్నుల కోసం ఉన్న ఇంగ్లిష్ మీడియం బడులు] అన్ని ఎసిలు ఎక్కడనించి వచ్చాయి?"
సహారా జవాబు చెప్పకుండా సాయంత్రం వరకూ పనిలోనూ మౌనంలోనూ కూరుకుపోయింది. ఈరోజు ఆమె తన పనిని మధ్యలోనే వదిలేసి మునియాతో కలిసి ఇంటికెళ్ళాల్సివచ్చింది. ఈ రోజు వోటు వేసే రోజు. తనని పట్టుకుని వేలాడుతోన్న ఎనిమిదేళ్ళ కూతురితో కలిసి సహారా వోటు వేసేందుకు ప్రాథమిక పాఠశాలవైపుకు వడివడిగా నడిచింది.
"మనం వోటెందుకు వెయ్యాలి అమ్మీ?" మునియా ఈ రోజు ఆపకుండా ప్రశ్నలు వేస్తూనే ఉంది. ఇప్పటికైతే విషయం మారినందుకు సహారా కొంచం ఊపిరి పీల్చుకుంది, కానీ తన కూతురి మాటల్ని పట్టించుకోలేనంతగా అలసిపోయి ఉందామె.
"మొన్నొకరోజు నేను టీవీలో విన్నాను. వాళ్ళకి ముస్లిముల వోట్లు అవసరం లేదని ఒక పెద్ద నాయకుడు చెప్తున్నాడు! మనం ముస్లిములమే కదా అమ్మీ, మరి మనం ఎందుకు వోటెయ్యాలి?"
సహారా నడుస్తున్నదల్లా మధ్యదారిలో ఆగిపోయి ఆ పసిదాని వైపు తదేకంగా చూసింది. మునియాకు అమ్మ విరసంగా చూస్తోన్న ఆ చూపుకు అర్థం తెలుసు. అందుకే నోరు మూసేసింది.


