జనాదరణ పొందిన గర్బా తీరులో స్వరపరిచిన ఈ పాట, స్త్రీల స్వేచ్ఛ, ధిక్కరణ, పట్టుదలలను అంశాలుగా పొందుపరిచిన పాట. వారసత్వకట్టడిని, సంస్కృతి విధించిన నిర్దేశాలను ప్రశ్నించకుండా అంగీకరించడానికి సిద్ధంగా లేని గ్రామీణ మహిళల నిజ స్వరాన్ని ఈ పాట ప్రతిధ్వనిస్తుంది.
ఈ పాట కచ్ ప్రాంతంలో మాట్లాడే అనేక భాషలలో ఒకటైన గుజరాతీలో రాసినది. మహిళా హక్కుల గురించి అవగాహన కల్పించడానికి కచ్ మహిళా వికాస్ సంగఠన్ (కెఎమ్‌విఎస్) నిర్వహించిన ఒక వర్క్‌షాప్‌లో పాల్గొన్న గ్రామీణ మహిళలు ఈ పాటకు సహరచయితలు.
ఈ పాటను మొదట ఏ సంవత్సరంలో స్వరపరిచారు, పాట రచయితలు ఎవరు అనేది ఖచ్చితంగా నిర్ధారించడం కష్టం. అయితే ఆస్తిపై సమాన హక్కులు కోరుతూ మహిళలు ఎలుగెత్తిన బలమైన స్వరాన్ని శ్రోతలు నిస్సందేహంగా వినగలుగుతారు.
ఈ పాటను ఏ సందర్భంలో రూపొందించారో మనకు తెలియకపోయినా, గుజరాత్ అంతటా, ప్రత్యేకించి కచ్‌లో, 2003 సంవత్సరంలో మహిళల భూయాజమాన్యం, జీవనోపాధి సమస్యల గురించి చర్చలు జరిపి, వర్క్‌షాప్‌లు నిర్వహించినట్లు మావద్ద రికార్డులున్నాయి. మహిళల హక్కులపై అవగాహన పెంపొందించడానికి చేపట్టిన ప్రచార కార్యక్రమాలు, వ్యవసాయోత్పత్తికి మహిళలు అందించే సహకారం, భూమిపై వారికి హక్కు లేకపోవడం మధ్య ఉన్న తీవ్ర వ్యత్యాసం వంటి కీలక అంశాలపై దృష్టి సారించాయి. ఈ పాట రూపొందడానికి ఆ చర్చలే ప్రభావితం చేశాయా అనేది మనకు ఖచ్చితంగా తెలియదు.
అయితే అప్పటి నుంచి ఈ పాట ఆ ప్రాంతం అంతటా ప్రయాణించి ప్రచారంలోకి వచ్చింది. ఈ పాట ప్రయాణమంతటా, తరచుగా జానపద పాటలలో జరిగే మాదిరిగానే, గాయకులు తమ తక్షణ ప్రేక్షకులను ఆకర్షించడానికి పంక్తులను జోడించారు, మార్పులు చేశారు, సర్దుబాటు చేశారు. ఇప్పుడు మనం వింటున్న ఈ పాటను నఖాత్రా తాలూకాకు చెందిన నందుబా జడేజా అందించారు.
ఈ పాట 2008లో ప్రారంభించిన సాముదాయక రేడియో, సురవాణి రికార్డ్ చేసిన 341 పాటల్లో ఒకటి. కెఎమ్‌విఎస్ ద్వారా PARI సేకరించిన ఈ పాటలు ఈ ప్రాంతపు అద్భుతమైన సంస్కృతి, భాష, సంగీత వైవిధ్యాలను చక్కగా ప్రతిబింబిస్తాయి. ఈ పాటల సేకరణ క్షీణిస్తోన్న కచ్ సంగీత సంప్రదాయాన్ని, ఎడారి ఇసుకలో మసకబారుతున్న దాని సంగీత ధ్వనులనూ సంరక్షించడానికి సహాయపడుతుంది.



