"దాని గురించి మాకేమీ తెలియదు," బడ్జెట్ గురించి నేను పదే పదే అడుగుతోన్న ప్రశ్నలను మొహమాటం లేకుండా తోసిపడేస్తూ అన్నారు బాబాసాహెబ్ పవార్.
"మాకేం కావాలో ప్రభుత్వం మమ్మల్ని ఎప్పుడు అడిగింది?" ఆయన భార్య మందా, జవాబు తెలుసుకోవాలన్నట్టుగా అడిగారు. "అదేమీ తెలుసుకోకుండా మా గురించి వాళ్ళెలా నిర్ణయం తీసుకుంటారు? మాకు నెలలో 30 రోజులూ పని కావాలి."
పుణే జిల్లా శిరూర్ తాలూకాలోని కురులీ గ్రామ శివారులో ఉన్న వారి ఒంటి గది తగరపురేకుల ఇల్లు ఈ ఉదయం అసాధారణంగా రద్దీగా ఉంది. “మేం 2004లో జాల్నా నుండి ఇక్కడికి వలస వచ్చాం. మాకెప్పుడూ మా స్వంత గ్రామమనేది లేదు. మేం వలసపోతుంటాం కాబట్టి మా ప్రజలు ఎప్పుడూ గ్రామాల వెలుపలే నివసిస్తారు,” బాబాసాహెబ్ చెప్పారు.
ఒకప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం చేత 'నేరస్థ' తెగగా ముద్ర వేయబడిన భిల్ పారధీలు, ఆ ముద్ర నుంచి విముక్తి పొందిన 70 సంవత్సరాల తర్వాత కూడా సామాజిక వివక్షకు గురవుతూ, లేమి నిండిన జీవితాన్ని కొనసాగిస్తున్నారనే విషయాన్ని ఆయన బయటకు చెప్పలేదు. మహారాష్ట్రలో షెడ్యూల్డ్ తెగగా జాబితా చేయబడిన తర్వాత కూడా. వారు వలస పోవడానికి వారిపై జరిగే అణచివేతే తరచుగా కారణమవుతోంది.
సహజంగానే వారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో వలసల గురించి మాట్లాడిన మాటలు వినలేదు. ఒకవేళ వినివున్నా కూడా అది వారినేమీ ఆకట్టుకోదు. "గ్రామీణ ప్రాంతాలలో పుష్కలమైన అవకాశాలను సృష్టించడమే లక్ష్యం, తద్వారా వలసలు ఒక ఎంపిక అవుతాయి తప్ప అవసరం కాకుండా ఉంటాయి," అని ఆమె తన 2025-26 బడ్జెట్ ప్రసంగంలో చెప్పింది.



