“ఒక్క చిన్న తప్పు చేస్తే చాలు, మీకు కోయ్తాకు బదులు సత్తుర్ వస్తుంది!” రాజేశ్ చాఫేకర్‌కి మాంసం కోసే కత్తికి, కొడవలికి మధ్య తేడా తెలుసు. నిపుణుడైన లోహార్ (కమ్మరి) అయిన అతను మహారాష్ట్రలోని అక్టన్ గ్రామంలోని తన కార్యశాలలో 10,000 కంటే ఎక్కువే ఇనుప పనిముట్లను తయారుచేశారు.
52 ఏళ్ళ రాజేశ్ తన తండ్రి దత్తాత్రేయ చాఫేకర్ నుండి వృత్తిపనిని నేర్చుకున్నారు. వారిది మహారాష్ట్రలోని వ్యవసాయ వర్గానికి చెందిన వినియోగదారులు బాగా విశ్వసించే పాంచాల్ లోహార్ల సుదీర్ఘ వారసత్వం. "ప్రజలు 'అక్టన్ సే హీ హత్యార్ లేకే ఆవో' [పనిముట్లను అక్టన్ నుంచే తీసుకురండి] అంటారు," అని వసై తాలూకాకు చెందిన ఈ ఏడవ తరం కమ్మరి చెప్పారు. అతనికి 25 కంటే ఎక్కువ రకాల వ్యవసాయ పనిముట్లను తయారుచేసే సామర్థ్యం ఉంది.
బోట్ల తయారీలో కీలక సాధనమైన తాస్ణి కోసం పెద్ద మొత్తంలో ఆర్డర్లు ఇవ్వడానికి దాదాపు 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న నవీ ముంబైలోని ఉరణ్ నుంచి కస్టమర్లు వచ్చారు. "గిర్‌హాయిక్‌లు [వినియోగదారులు] నాలుగు రోజులు మా ఇంట్లోనే ఉండి, మేం ఆ పనిముట్లను తయారుచేయడాన్ని మొదటి నుంచీ చూసేవాళ్ళు," అని అతను గుర్తు చేసుకున్నారు.
ఇరుకు దారులున్న అక్టన్ గ్రామం సోనార్ (కంసాలి), లోహార్ (కమ్మరి), సుతార్ (వడ్రంగి), చంభార్ (చెప్పులు కుట్టేవాళ్ళు), కుంభార్ (కుమ్మరి) లాంటి సంప్రదాయ కుల ఆధారిత వృత్తులకు ప్రసిద్ధి చెందింది. ఆ గ్రామంలోని ప్రజలు తామెప్పుడూ సుప్రసిద్ధ చేతివృత్తుల దేవుడైన విశ్వకర్మ శిష్యులమని చెప్పుకుంటారు. పాంచాల్ లోహార్‌లు 2008 నుండి సంచార జాతుల జాబితాలో ఉన్నారు, దానికి ముందు వారు ఒబిసి (ఇతర వెనుకబడిన తరగతులు) వర్గంలో ఉండేవాళ్ళు.
తనకు 19 ఏళ్ళ వయసులో కుటుంబ సంప్రదాయమైన కమ్మరి వృత్తిని కొనసాగించాలనే ఉద్దేశం తనకు లేదని రాజేశ్ తెలిపారు. ఒక ఎలక్ట్రానిక్స్ దుకాణంలో స్టోర్ కీపర్‌గా ఉద్యోగం చేస్తూ అతను నెలకు రూ.1,200 సంపాదించేవారు. కొన్నేళ్ళ తరువాత, వారి పెద్ద ఉమ్మడి కుటుంబం విడిపోవడంతో అతని తండ్రికి పనిలేకుండా పోయింది. దాంతో ఇంటి పెద్ద కొడుకుగా ఆయన కుటుంబ వృత్తిని చేపట్టాల్సి వచ్చింది.
























